Language problem
-
భాషా సమస్యను భావోద్వేగాలతో చూడొద్దు..
ఏయూక్యాంపస్ (విశాఖతూర్పు): భాషా సమస్యను భావోద్వేగాలతో కాకుండా వాస్తవిక, సామాజిక దృష్టి కోణంలో పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఏయూ హిందీ విభాగంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాతృభాషపై అమితమైన పట్టు సాధించాలని, జాతీయ స్థాయిలో రాణించాలంటే హిందీ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపునకు ఆంగ్ల భాష పరిజ్ఞానం అవసరమన్నారు. త్రిభాషా సూత్రాన్ని భారత్‌లో ఎప్పట్నుంచో అమల్లో ఉందని, దానిని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల నిర్వహించిన అధికార భాషా సంఘం సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ హిందీ నేర్చుకోవాలని, పలకరించుకునే సందర్భాల్లో హిందీ భాషను ఉపయోగించాలని చెప్పడంలో తప్పులేదన్నారు. అమెరికాలో 2006లో అప్పటి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధ్యక్షుడు బుష్ నేతృత్వంలో ఐదు విదేశీ భాషలను నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందని, వాటిలో హిందీ ఒకటనే విషయం మరువరాదన్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని పీవీ నరసింహారావు విజయవంతంగా నడిపాడంటే ఆయనకు హిందీ భాష రావడం కూడా ఓ కారణమన్నారు. భాషకు సీఎం జగన్ పట్టాభిషేకం రాష్ట్రంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి భాషల అభివృద్ధికి పాటుబడుతున్నారని యార్లగడ్డ తెలిపారు. తెలుగు అకాడమీని ప్రారంభించడం, అధికార భాషా సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయడం, ఆంగ్ల మాధ్యమాన్ని బోధన భాషగా, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు చదవాలని, హిందీ అకాడమీ ప్రారంభించడం, ఉర్దూను ద్వితీయ భాషగా బోధించేలా నిర్ణయం తీసుకోవడం వంటివి భాషల వికాసానికి ఉపయుక్తంగా నిలుస్తున్నాయని లక్ష్మీప్రసాద్ వివరించారు. -
ప్రధాని మోదీ.. మీరు మౌనంగా ఉండడమేంటి?
న్యూఢిల్లీ: దేశంలో ఈమధ్యకాలంలో నెలకొన్న పరిస్థితులపై, చోటు చేసుకుంటున్న వరుస ఉదంతాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. శ్రీరామ నవమి సందర్భంగా చోటుచేసుకున్న మత ఘర్షణలను హైలైట్ చేస్తూ.. మొత్తం 13 ప్రతిపక్ష పార్టీలు శనివారం రోజున సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తారతమ్యాలకు, రాగద్వేషాలకు తావులేకుండా దేశం మొత్తం శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన ఆ పార్టీలు.. మత హింసకు కారణమైనవాళ్లను వదలకూడదని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. ఇదిలా ఉండగా.. ఈ ఘర్షణలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మౌనంగా ఉండడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆ సంయుక్త ప్రకటనలో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. మతోన్మాదాన్ని ప్రచారం చేసే వాళ్ల మాటలను, వాళ్ల చర్యలను ఖండించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఆయన మౌనం.. ఇటువంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుందని, వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచిందని ఆరోపించాయి. తినేతిండి, కట్టుకునే బట్ట, వాళ్ల వాళ్ల విశ్వాసాలు, పండుగలు, భాషకు..ఇలాంటి విషయాలను పాలక వ్యవస్థలోని వర్గాలు.. మన సమాజాన్ని ధ్రువీకరించడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నతీరుపై చింతిస్తున్నాం. దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన సంఘటనలు పెరిగిపోతున్నాయి. అధికారమనే అండతో రెచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లపై అర్ధవంతమైన, బలమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నాం అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. హిజాబ్, హిందీ భాష, తిండిపై ఆంక్షలు, మత ఘర్షణలు.. ఇలా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న అంశాలపైనే ఈ పార్టీలు, ప్రధాని మోదీని నిలదీసినట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం), డీఎంకే, ఆర్జేడీతో పాటు మరికొన్ని ఈ సంయుక్త ప్రకటనలో సంతకాలు చేశాయి. అయితే.. శివసేన, ఆమ్ఆద్మీ పార్టీ మాత్రం ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం. -
మీ పిల్లల్లో మాటలు ఆలస్యం అవుతున్నాయా? ఇలా చేశారంటే..
పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలై దాదాపు రెండేళ్ల వయసు నాటికి చాలావరకు కమ్యూనికేట్ చేస్తుంటారు. మూడేళ్లకు అన్ని మాటలూ వచ్చేస్తాయి. అయితే కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వినడానికి దోహదపడే వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు దోహదపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. ఆ పిల్లల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం దీనికి కారణం. ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ. ఇలా మాటలు రావడం ఆలస్యమైన సందర్భాల్లో సాధారణంగా స్కూల్లో చేర్చే ఈడు నాటికి పిల్లలు తమంతట తామే మాట్లాడతారు. ఇక కొందరిలో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలను (డిజార్డర్స్‌ను) సూచించే ఒక లక్షణం. ఉదాహరణకు వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు (ఎక్స్‌ప్రెసివ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ డిజార్డర్)... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల (గెష్చర్స్) ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే నిర్వహిస్తుంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్ప్రెషన్స్) ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది. మరికొందరిలో భాషను నేర్చుకునే శక్తి కొంతమేరకు తక్కువగానే ఉంటుంది. వాళ్లలో మరికొన్ని కాంప్లికేషన్లూ వచ్చే అవకాశమూ ఉంటుంది. ఏం చేయాలి? ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంలో పూర్తి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల మాటలు రాకపోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్‌కూ లేదా స్పీచ్ థెరపిస్ట్కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు. తల్లిదండ్రుల భూమిక ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలో తామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతో పాటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!! -
కర్నాటక, మహారాష్ట్రల మధ్య ‘భాష’ వివాదం
బెంగళూరు: రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి రాజుకుంది. మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన ప్రకటనతో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్ర రాజధాని ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ముంబై మహానగరాన్ని కర్నాటకలో కలపాలని.. ఆలోపు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కర్నాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది డిమాండ్ చేశారు. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో మరాఠీ మాట్లాడేవాళ్లు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేయడంతో వివాదం మొదలైంది. దీనికి బదులుగా ఒక్క అంగులం కూడా ఇచ్చేది లేదని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. దీంతో పాటు కర్నాటక సరిహద్దు జిల్లా బెల్గామ్ పేరును బెల్గావిగా మార్చడంతో ఉద్దవ్ ఠాక్రే వ్యతిరేకించారు. దీంతో వివాదం ముదిరింది. అయితే ఈ సమయంలోనే బుధవారం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై రచించిన ఒక పుస్తకం విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న బెల్గాం, కార్వార్, నిప్పని ప్రాంతాల్లో మరాఠీ భాషను మాట్లాడేవాళ్లు అధికంగా ఉన్నారని తెలిపారు. అయితే ఆ ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి’’ అని సరికొత్త డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సుప్రీంకోర్టులో ఉన్న వివాదం పరిష్కారయ్యే వరకు ముంబైని యూటీగా చేయాలని కోరారు. కర్నాటక సరిహద్దు జిల్లా బెల్గామ్ పేరును బెల్గావిగా మార్చడాన్ని మహా సీఎం ఉద్దవ్ వ్యతిరేకించారు. బెల్గామ్‌ను రెండవ రాజధానిగా చేసిన కర్నాటక తప్పుపని చేసిందని, అందరం ఏకమైతే ఆ ప్రక్రియను అడ్డుకోవచ్చని సీఎం ఉద్దవ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మహారాష్ట్ర నాయకులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. -
ఇద్దరు సీఎంల మధ్య భూవివాదం
సాక్షి, హైదరాబాద్: సరిహద్దు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు విభిన్న ప్రకటనలు చేశారు. దీంతో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటన చేసింది. దానిపై సోమవారం కర్ణాటక బీఎస్ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని సీఎం స్పష్టం చేశారు. ‘‘కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు దురదృష్టకరం. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం. కర్ణాటకలో కన్నడిగులు, మహారాష్ట్రీయులు సోదరులుగా ఐకమత్యంతో జీవిస్తున్నారు. ప్రజల్లో శాంతికి భంగం కలిగించేలా ఉన్న థాకరే వ్యాఖ్యలను ఖండిస్తున్నా. నిజమైన భారతీయుడిగా సమాఖ్య స్ఫూర్తికి థాకరే గౌరవం ఇవ్వాలి. వాటికి కట్టుబడి ఉండాలని’’ యడియూరప్ప సోమవారం ట్వీట్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ఆదివారం ఓ ట్వీట్ రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ‘‘కర్ణాటకలో మరాఠీ మాట్లాడే కొన్ని ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ అని ట్వీట్ చేసింది. కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉండగా ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చుకుంటామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. ఆ ప్రాంతాలు తమ రాష్ట్రానికి చెందినవేనని, వాటిని మహారాష్ట్రలో కలపాలని ఎన్నాళ్ల నుంచో మహారాష్ట్రలో డిమాండ్ ఉంది. ఇదే డిమాండ్‌పై మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘ కాలంగా పోరాడుతోంది. అయితే 1956 జనవరి 17వ తేదీన ఈ ఉద్యమంలో జరిగిన ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ జనవరి 17వ తేదీని మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఆ ట్వీట్ చేసింది. కర్ణాటక అధీనంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకు తాము అందించే ఘన నివాళి అని పేర్కొంది. -
ట్రాన్స్‌లేటర్స్ పేరుతో నయా దందా
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాన్స్‌లేటర్స్ పేరుతో కొందరు దారణమైన దోపిడిలకు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన రోగులను టార్గెట్‌గా చేసుకుని దందాలు చేస్తున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇతర దేశాస్తులు బాష రాకపోవడంతో ప్రతి విషాయానికి ట్రాన్స్‌లేటర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని వారి వద్దనుంచి లక్షల సొమ్మును కాజేస్తున్నారు. ఈ దందా నగరంలో ఎక్కువగా ఆస్పత్రుల వద్ద సాగుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే బంజారాహీల్స్‌లో వెలుగులోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఆనారోగ్యం కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోరకు చేరింది. ఇక్కడి భాష రాకపోవడంతో ఓ ట్రాన్స్‌లేటర్‌ను నియమించుకుంది. గాల్ బ్లాడర్‌లో ట్యామర్ ఉండడంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను తప్పుడు సమాచారంతో మోసం చేశాడు. బ్లాడర్ మార్పిడితో పాటు డబ్బు విషయంలో కూడా అబద్దాలు చెప్పి.. రూ. 3లక్షల బిల్లును రూ. 7లక్షలుగా చెప్పి దోపిడికి పాల్పడ్డాడు. విషయం తెలుకున్న మహిళ షాక్‌కు గురైంది. అనంతరం బంజారాహీల్స్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యోపాపం.. ఎవరీమహిళ
ఇక్కడి భాష రాక ఇబ్బందులు పొంతన లేని సమాధానాలు స్టేట్‌హోంకు తరలించేందుకు ఏర్పాట్లు కడియం : ఎవరో తెలీదు.. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పదు.. అడిగిన వారందరికీ ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతూ తికమకపెడుతోంది. కడియం మండలం వేమగిరి పంచాయతీ, పరిసర ప్రాంతాల్లో నెల రోజులుగా సంచరిస్తున్న ఈ యువతి రక్షణ విషయంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఈ విషయాన్ని స్థానిక విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల రోజుల నుంచి పంచాయతీ పక్కనే ఉన్న రామాలయం, ప్రాథమిక పాఠశాల ఆవరణల్లో సుమారు 30 ఏళ్ల మహిళ ఉంటోంది. చుట్టుపక్కల వారు పెట్టిన భోజనం తింటూ కాలం వెళ్లదీస్తోంది. ఆమె వద్ద నల్లరంగు బ్యాగ్, వాటర్ బాటిల్ మాత్రమే ఉన్నాయి. పూర్తిగా హిందీ కాకుండా మాట్లాడుతుండడంతో ఆమె భాష ఏమిటో స్థానికులకు అర్ధం కావడం లేదు. ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించినప్పటికీ కచ్చితమైన సమాచారం చెప్పడం లేదు. రాత్రిపూట ఆకతాయిలు ఆమెను అల్లరి పెడుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాఉండగా శనివారం ఆమెను స్థానిక విలేకరులు పలకరించారు. తమది న్యూఢిల్లీ అని, పేరు శీతల్ అని చెబుతోంది. బంధువులతో పాటు తాను తిరుపతి వచ్చానని ఒకసారి, అన్నవరం అని ఒకసారి అంటోంది. ఈ నేపథ్యంలో దేవాలయ సిబ్బంది, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారుల దృష్టికి ఆ మహిళ పరిస్థితిని విలేకరులు తీసుకువెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను రాజమహేంద్రవరంలోని స్టేట్‌హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
తెలుగునే లాగేస్తే మిగిలేదేంటి?
ఇప్పుడు పట్నాలలో, పల్లెల్లో చదివే అట్టడుగువారికి ఒకే ఒక సౌకర్యముంది. అది వారు సులభంగా అర్థం చేసుకోగలిగే తెలుగు భాషలో విద్య లభించే సౌకర్యం. ఆ కాస్త తెలుగును కూడా లాగేస్తే వారి భవిష్యత్తు ఏంటి? తెలుగు భాష కొన్ని శతాబ్దాలుగా తెలంగాణాలో అందరూ విరివిగా మాట్లాడుతున్న, సగటు పౌరులు అనేకానేక అవ సరాలకు ఉపయోగి స్తున్న ప్రజా భాష, అది బోధనా మాధ్యమంగా గత అరవై ఏళ్లకు పైగా నిలదొక్కుకున్న భాష. మరి అలాంటి భాషను అకస్మాత్తుగా ఇంగ్లిష్ భాషతో భర్తీ చేస్తే అది ఎన్ని సామాజిక సంక్షోభాలకు దారి తీస్తుందో మన ప్రభుత్వం సావధానంగా ఆలోచిస్తు న్నట్లు లేదు. అది మన సమాజంలోని అనేకానేక రంగాలను ఎలా దెబ్బతీస్తుందో, వాటిలో పనిచేసే వారి గతి, వాటిలో పెట్టుబడులు పెట్టిన వారి గతి ఏమి కాబోతోందో ప్రభుత్వమే కాదు, సమాజం కూడా ఆలోచిస్తున్నట్లు లేదు. ఈ భాషా సమస్య ఏ కొందరి సమస్యో కాదు, ఇది ఒక పదేళ్ళలో అందరినీ ముంచే, అందరినీ ముసురుకునే సునామీ లాంటి సమస్య. అనేకా నేకులను అనేకానేక నష్టాలకు కష్టాలకు గురిచేసే సమస్య. అలాంటిదాన్ని అలా నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇపుడు చిన్నాచితకా బడుల్లో, పట్నాలలో, పల్లెల్లో చదివే అట్టడుగువారికి ఒకే ఒక సౌకర్య ముంది. అది వారు సులభంగా, సునాయాసంగా అర్థం చేసుకోగలిగే తెలుగు భాషలో విద్య లభించే సౌకర్యం, తక్కినవన్నీ లోటులూ, లొసుగులే. పాపం.. పసివారికి ఉండే ఒకే ఒక సౌకర్యం ఒక్క తెలుగు మీడియం మాత్రమే. అది కాస్తా లాగేస్తే మిగిలేదేముంది ఆ బడుల్లో? మన విద్యాలయాల ఉద్ధరణను మనం అలాంటి బడుల వసతి సౌకర్యాల ఉద్ధరణతో మొదలెట్టాలి కాని తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కాదు. దాని వలన జరిగేదీ లేదు, ఒరిగేదీ లేదు. పెపైచ్చు వారి విద్య ఇప్పటికన్నా అధ్వానమవుతుంది. అసలు అంత మంది అధ్యాపకులేరీ? ఇంగ్లిష్‌లో అన్ని సబ్జెక్ట్‌లు చెప్పగలిగేవారు ఏరీ?. వచ్చీరాని ఇంగ్లిష్‌లో వచ్చీ రాని వారు వచ్చీరాని విధంగా విద్య బోధిస్తే విద్యార్థులు ఇంటా బయటా దేనికి పనికొస్తారు? వారి పట్టాలు దేనికి పనికొస్తాయి? వారు న్యూనతా భావనకు లోనై ఇప్పటిలాగే భవి ష్యత్తులోనూ ఆత్మహత్యలకు పాల్పడరా? అసలు మీడియం ముఖ్యమా? వనరులు, వసతులు, సౌకర్యాలు, ఉపాధ్యాయులు, సాంకేతిక పరికరాలు, క్రమశిక్షణ, సరైన విద్యా వాతావరణం, కార్యక్రమాలు ముఖ్యమా? విద్యాలయాలు అన్ని విధాలా బాగుంటే విద్యలు బాగుంటాయి, అవి బాగుండకపోతే ఇవి బాగుండవు. ఇతర ముఖ్యాం శాలను సమకూర్చకుండా, ఒక్క మాధ్యమం మాత్రమే ఏ అద్భుతాలనూ సాధించజాలదు. వాటిని గుర్తించి బాగుపరచడానికి ఇప్పటి పరిస్థి తుల్లో కనీసం రెండుమూడు దశాబ్దాలైనా పట్టొచ్చు. అందువలన మీడియంను గభాలున మార్చకుండా కొన్నాళ్ళు తెలుగు మీడియంను కొన సాగిస్తూ ఈలోగా వాటిని మెరుగు పరచుకుంటూ, మెల్లమెల్లగా అడుగులు వేయడం అవసరం. తెలుగు మీడియం విద్యాలయాలు తెలుగు మీడియం వలన వెనకబడలేదు వాటికి ప్రభుత్వ చేయూత సరియైనంత లభించనందునే వెనకబడి పోయాయి. కనుక మొదట ఆ విద్యాలయాల వసతి సౌకర్యాలు, వనరులు మెరుగుపరచండి. గవర్న మెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్‌కు ఈ మాత్రం తీసిపోవని నిరూపించండి. తొందరపడి మూకుమ్మడి కన్వర్షన్‌కు నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తులను పాడుచేని అయ్యో ఇంత మంది భవిష్యత్తులు పాడుచేశామేమిటని ఆ తదుపరి నాలుక కరచుకోకండి. కనీసం అత్యధికులైన బీదవారికి, పల్లెటూరి వారికి, వెనకబడినవారికి చెందిన గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంతవరకే ఉన్న విద్యా విధానాన్ని కొన్నాళ్ళు అలాగే ఉంచి వాటిలో బోధనా అధ్య యన పరిస్థితులను మెరుగుపరచి అటు తదుపరి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదని గ్రహించండి. ఇంతవరకే పాడయిన వారిని ఇంగ్లిష్ మీడియం ద్వారా మరింత పాడు చేయకండి. సదరు సమాజం, స్థానిక ప్రజలు కూడా మొదట వసతులు మెరుగుపర్చడానికి పట్టుబట్టాలి కాని ఇంగ్లిష్ మీడియం కోసం కాదు. వసతులు, వనరులు లేని ఇంగ్లిష్ మీడియం వారి పిల్లలకు ఇప్పటికన్నా ఎక్కువ హాని కలిగిస్తుందని, అలాంటి దాని వలన వారి పిల్లలు పట్నాలలోని మంచి వసతులు గల బడుల్లో చదివే వారితో పోటీపడ లేరని గ్రహించాలి. అలాంటి వనరులు, వసతులే కల్పిస్తే తెలుగు మీడియం స్కూళ్లూ అంతకన్నా బాగుం టాయని తెలుసుకోవాలి. ప్రభుత్వం ఉన్న వాటిని ఉద్ధరించడానికి ఒత్తిడి ఎక్కువ తేవాలి కాని కేవలం ఇంగ్లిష్ మీడియం కోసం కాదు. తెలుగు మీడియం ఒకవిధంగా విద్యారం గంలో వెనకబడిన వారికి ఫార్వర్డ్ క్లాస్ వారితో పోటీ పడడానికి ఒక సబ్సిడీ లాంటిది, రిజర్వేషన్ లాంటిది. దానిని పోగొట్టుకోకండి. ఇంగ్లిష్ మీడి యంలో చేరగానే, చేర్పించినంత మాత్రాన్నే విద్యార్థి ఐ.ఐ.టి.కి పోతాడని, అమెరికాకు పోతా డనీ అనుకోకండి. అలా నెగ్గే వారి సంఖ్య ఆ మీడి యంలో చేరేవారి సంఖ్యలో ఎంతభాగమో తెలుసు కోండి. తక్కినవారు నెగ్గకపోవడానికి ప్రధానమైన కారణం ఇంగ్లిష్ భాష బరువేనని నెగ్గినవారినడి గితే మీకే తెలుస్తుంది. వారినడిగి తెలుసుకోండి. ఇపుడు సులభమైన తెలుగు మీడియం ఉండగానే అనేకానేక గవర్నమెంటు స్కూళ్ళలో పరీక్షా ఫలితాలు దారుణంగా ఉన్నాయి. ఇక ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాక దాని భారం వలన అవి మరింత దారుణంగా తయారవుతాయని అటు ప్రభుత్వమూ, ఇటు తల్లిదండ్రులూ, వారి పిల్లలు, సమాజం కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే తెలు స్తుంది. ఏళ్ళ తరబడి ఇంగ్లిష్ మీడియంలో చది వినా కూడా నూటికి 90 శాతం విద్యార్థులు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడలేకపోవడం, రాయ లేకపోవడం ఆ భాషాభారం వలననే అని తెలుసుకోండి. వ్యాసకర్త వ్యవస్థాపక కన్వీనర్, తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్ మొబైల్: 98481 95959 - డాక్టర్ వెల్చాల కొండలరావు -
ఏ దేశమేగినా... నో ప్రాబ్లమ్!
స్విట్జర్లాండ్: కొత్త ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లినపుడు ఎవరికైనా ఎదురయ్యే ప్రధాన సమస్య భాష. మనం చెప్పేది అవతలి వారికి అర్థం కాదు... వారికేమో స్థానిక భాష తప్పితే ఇంగ్లీషు రాదు. చాలాచోట్ల ఎంతోమందికి ఇది అనుభవంలోకి వస్తుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్లోరియాన్ నాస్ట్, జార్జ్ హార్న్, స్టెఫాన్ స్ట్రీయిట్లకు ప్రపంచదేశాలను చుట్టి రావడం హాబీ. ఇందులో భాగంగా 2013లో వియత్నాం పర్యటనకు వెళ్లారు. అక్కడ వీరు ప్రయాణిస్తున్న బైక్ మొరాయించింది. దాన్ని రిపేర్ చేయించాలి. స్థానికులను మెకానిక్ గురించి అడిగి... వారి నుంచి సమాధానం రాబట్టడం వీరికి తలకు మించిన పనైందట. దాంతో భాషతో పనిలేకుండా బొమ్మలతో సంభాషిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వీరికి వచ్చింది. చివరికి ఓ రెండేళ్లు తర్జనభర్జన పడి అందరికీ పనికొచ్చేలా 40 కామన్ చిహ్నాలతో ఓ టీ షర్టును రూపొందించారు. రెస్టారెంట్, లాడ్జి, బ్యాంకు, డ్రింక్, వాటర్, విమానాశ్రయం... ఇలాంటి 40 చిహ్నాలతో ఓ టీషర్టును రూపొందించారు. దాంతో వీరికి భాష సమస్య తప్పింది. ఎక్కడికెళ్లినా స్థానికులకు తమ టీ షర్టుపై ఉన్న బొమ్మను చూపించి సమాచారం అడుగుతున్నారు. అవతలి వారికి అది సులభంగా అర్థమై దారి చూపిస్తున్నారట. ఇదేదో బాగుంది కదూ... విదేశాలకు వెళ్లేటపుడు మనమూ ఇలాంటి టీషర్టు ఒకటి దగ్గర పెట్టుకుంటే సరి. -
ఇంగ్లిష్ రాని ఇంజనీర్లు
-
ఇంగ్లిష్ రాని ఇంజనీర్లు
► ఆంగ్లం రాకపోవడం వల్లే 51.2 శాతం మందికి ఉద్యోగాలు రావట్లేదు ► హైదరాబాద్‌లో సగానికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంగ్లిష్ రాదు ► ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ సర్వేలో వెల్లడి ► దేశంలో ఏటా ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్నవారు 6 లక్షల మంది.. ► వీరిలో ప్రముఖ కంపెనీలకు తగిన విధంగా ఇంగ్లిష్ మాట్లాడగలిగేది 2.9 శాతమే ► కనీస గ్రామర్‌తో మాట్లాడేది 25 శాతం మందే ► ఇతర ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్, చెన్నై గ్రాడ్యుయేట్ల వెనుకంజ సాక్షి, హైదరాబాద్: ఏళ్లకు ఏళ్లు చదువులు.. పుస్తకాలతో కుస్తీలు.. ఇంజనీరింగ్ పట్టాలు.. కానీ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేందుకు అవసరమైన ఇంగ్లిష్ మాత్రం రాదు. కనీసం ఎదుటివారితో వేగంగా సంభాషించేటంతటి పరిజ్ఞానమే ఉండడం లేదు. ఏటా కాలేజీల నుంచి లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నా... వారిలో ఉద్యోగాలు వస్తున్నది చాలా తక్కువ మందికే. సరిగా ఇంగ్లిష్ భాష రాకపోవడమే దీనికి కారణమని ప్రముఖ కంపెనీలకు ప్లేస్మెంట్ సర్వీసులు నిర్వహించే ఆస్పైరింగ్ మైండ్స్ తమ సర్వేలో తేల్చింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని.. ఇక్కడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో సగం మందికిపైగా సరైన ఇంగ్లిష్ పరిజ్ఞానం లేదని గుర్తించింది. ఇక్కడి వారు తమ స్పోకెన్ ఇంగ్లిష్ సామర్థ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవాలని సూచించింది. దేశంలో ఏటా 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుండగా... అందులో 51.2 శాతం మందికి కేవలం ఇంగ్లిష్‌లో సరిగ్గా మాట్లాడటం రాకపోవడం వల్లే ఉద్యోగాలు లభించడం లేదని ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ సర్వేలో వెల్లడైంది. ప్రముఖ కంపెనీలు, పేరున్న కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్‌లో అన్ని సామర్థ్యాలు (మాట్లాడడం, రాయడం, ప్రభావవంతమైన పదాలు వినియోగించడం, ఉచ్చారణ, స్పష్టత వంటివి) కలిగి, మాట్లాడి మెప్పించగలిగే గ్రాడ్యుయేట్లు కేవలం 2.9 శాతం మందేనని తేలింది. ఇంగ్లిష్‌లో అమ్మాయిలు బాగా రాయగలుగుతుండగా... అబ్బాయిలు బాగా మాట్లాడగలరని వెల్లడైంది. ఇక ఉద్యోగాల్లో చేరిన వారిలోనూ సందర్భానుగుణంగా స్పందించి ఇంగ్లిషులో బాగా కమ్యూనికేట్ చేయగలిగిన, వ్యాకరణానుగుణంగా ఉచ్ఛరించగలిగిన ఇంజనీర్లు 6.8 శాతమేనని సర్వే గుర్తించింది. కనీస పదాలు తెలిసిన వారు 33 శాతం ఉంటే... సాధారణ వ్యాకరణంతో వాక్య నిర్మాణం తెలిసిన వారు 25 శాతం మందేనని తేల్చింది. వివిధ మెట్రో నగరాలు, ప్రముఖ పట్టణాలతో పోల్చితే హైదరాబాద్, చెన్నై గ్రాడ్యుయేట్లు బాగా వెనుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నగరాలకు చెందిన వారు తమ స్పోకెన్ ఇంగ్లిషు సామర్థ్యాలను బాగా మెరుగు పరుచుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేసి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో మాట్లాడి ఈ సర్వే చేసినట్లు ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ వెల్లడించింది. ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 500 కాలేజీలకు చెందిన 30 వేల మంది విద్యార్థులతో మాట్లాడినట్లు తెలిపింది. ఎంపిక చేసుకున్న వారిలో 51.9 శాతం మంది అబ్బాయిలు, 48.1 శాతం అమ్మాయిలు ఉన్నారని పేర్కొంది. వీరితో మాట్లాడినపుడు ఫ్లూయెన్సీ (తప్పులు లేకుండా మాట్లాడడం), యాక్టివ్ లిజనింగ్ (విని అర్థం చేసుకోవడం), పద ఉచ్ఛారణ, స్పోకెన్ ఇంగ్లిషు, వ్యాకరణం, వాక్య నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు - ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉచ్ఛారణ విషయానికి వస్తే 6.6 శాతం మంది బాగా మాట్లాడగ లిగారు, సులభంగా అర్థం చేసుకోగలిగారు. మరో 8.4 శాతం మంది బాగా మాట్లాడగలిగినా కొద్దిగా సమస్య ఎదుర్కొంటున్నారని... 30.6 శాతం మంది మేనేజ్ చేయగలిగినవారని గుర్తించారు. 47.6 శాతం మంది మాత్రం పదాలు కూడా సరిగ్గా ఉచ్ఛరించలేకపోతున్నట్లు తేలింది. మరో 6.8 శాతం మంది అయితే ఇంగ్లిషులో పెద్దగా మాట్లాడడం రావడం లేదని పేర్కొంది. - ఇక ఎదుటివారు చెబుతున్న దానిని బాగా అర్థం చేసుకోగలిగిన వారు 6.1 శాతం మాత్రమే ఉన్నారని సర్వే తేల్చింది. 18.5 శాతం మంది కొద్దిగా ఇబ్బంది పడినా.. బాగానే అర్థం చేసుకోగలిగారని, 28.7 శాతం మంది పరవాలేదని గుర్తించింది. ఇక 27.2 శాతం మంది సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని, 19.6 శాతం మంది అసలు కొంచెమైనా ఇంగ్లిషును అర్థం చేసుకోవడం లేదని వెల్లడైంది. - ఇక పలు ఉద్యోగాల్లో ఉన్నవారినీ సర్వే చేశారు. ఈ ఉద్యోగుల్లో బిజినెస్ కన్సల్టింగ్, కార్పొరేట్ సేల్స్ విభాగంలో 1 శాతం మంది, కార్పొరేట్ సర్వీసింగ్, టీచింగ్ విభాగాల నుంచి 2.9 శాతం మంది, అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 24.9 శాతం మంది, మిగతా రంగాల ఇంజనీర్లు 22 శాతం మంది, ఐటీ ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు 49.2 శాతం మంది ఉన్నారు. వీరిలో కార్పొరేట్ సర్వీసింగ్, టీచింగ్ విభాగాల వారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మాట్లాడగలుగుతున్నారని సర్వే తేల్చింది. ఆ తరువాత పలు రంగాల ఇంజనీర్లు ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణాది గ్రాడ్యుయేట్ల వెనుకంజ - దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా మాతృభాషలోనే చదువుకోవడం వల్ల ఇంగ్లిషు విషయంలో సమస్య ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వే పేర్కొంది. - పదాలను స్పష్టంగా, వేగంగా ఉచ్ఛరించే గలిగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఢిల్లీలో 59.9 శాతం మంది ఉండగా.. బెంగళూరులో 58.3 శాతం మంది, ముంబై, పుణెలో 56.2 శాతం మంది, కోల్‌కతాలో 52 శాతం మంది, హైదరాబాద్‌లో 51 శాతం మంది, చెన్నైలో 46.7 శాతం మంది ఉన్నట్లు వెల్లడైంది. - ఇంగ్లిషులో బాగా మాట్లాడగలిగే వారిలో ముంబై, పుణెకు చెందిన గ్రాడ్యుయేట్లు 60.6 శాతం మంది ఉండగా.. ఢిల్లీ వారు 57.7 శాతం, హైదరాబాద్ వారు 52.6 శాతం, చె న్నైవారు 47.3 శాతం మంది ఉన్నారు. - వ్యాకరణబద్ధంగా ఇంగ్లిషు మాట్లాడేవారు, రాయగలిగే గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఢిల్లీలో 56.4 శాతం, హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్లు 48.6 శాతం, చెన్నైలో 41.5 శాతం ఉన్నారు. - మొత్తంగా ఇంగ్లిషు సరిగా రాకపోవడం వంటి కారణాలతోనే 51.9 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించడం లేదని ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై నగరాలకు చెందిన విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిషు సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకోవాలని సూచించింది. వివిధ నగరాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఇంగ్లిషు సామర్థ్యాలు (శాతాల్లో) నగరం ఉచ్ఛారణ స్పష్టత వినడం మాట్లాడటం పద వినియోగం గ్రామర్ బెంగళూరు 58.3 55 58.1 56 58.9 54.1 చెన్నై 46.7 45.2 49.1 47.3 51.3 41.5 హైదరాబాద్ 51 50.3 53.3 52.6 54.8 48.6 కోల్‌కతా 52 49.5 54.5 53.1 55.2 49 ముంబై, పుణె 56.2 52.9 56.4 60.6 60.8 53.1 న్యూఢిల్లీ 59.9 57.6 59.8 57.7 60.9 56.4 -
ఆ సమస్య తీరిపోయింది!
‘‘కళాకారులు చాలా అదృష్టవంతులు. ఎన్నో రకాల పాత్రల్లో జీవించొచ్చు. ఓ సినిమాలో డాక్టర్‌గా, ఇంకో సినిమాలో లాయర్‌గా, మరో సినిమాలో టీచర్‌గా... ఇలా ఎన్నో రకాలుగా కనిపించొచ్చు. కానీ, నిజజీవితంలో ఈ అన్నిటినీ చేయలేం కదా’’ అంటున్నారు తమన్నా. ఈ మిల్క్బ్యూటీకి ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. సో.. మీరు ప్లాన్ చేసుకున్న ప్రకారమే కెరీర్ వెళుతోందా? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘తెలుగు తర్వాత తమిళ్, ఆ తర్వాత హిందీ అని నేను ప్లాన్ చేయలేదు. ఎందుకంటే, గతంలో ‘ఇలా చేస్తే బాగుంటుంది’ అని నేను ప్లాన్ చేసుకుని, చేసినది ఏదీ జరగలేదు. అందుకే, ప్లాన్ చేయడం మానేశాను. విచిత్రంగా నా కెరీర్ మంచి మలుపులు తీసుకుం టోంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను చాలా టెన్షన్ పడేదాన్ని. భాష సమస్య, కెమెరా అంటే భయంతో ఈజీగా యాక్ట్ చేయలేకపోయేదాన్ని. తెలుగు అర్థం చేసుకుని, కొంచెం మాట్లాడ్డం మొదలుపెట్టిన తర్వాత, ఆ సమస్య తీరిపోయింది. సినిమాలు చేసేకొద్దీ, కెమెరా అంటే భయం పోయి, రిలాక్స్ అయ్యా. కెమెరా ముందు ఎప్పుడైతే రిలాక్స్ అవ్వడం మొదలుపెట్టానో అప్పట్నుంచీ నటన కూడా సులువైంది. ఎలాంటి క్లిష్టమైన పాత్ర అయినా, చేసేయగలుగుతామనే ఆత్మవిశ్వాసం ఏర్పడింది’’ అని చెప్పారు.