ఆ సమస్య తీరిపోయింది!
‘‘కళాకారులు చాలా అదృష్టవంతులు. ఎన్నో రకాల పాత్రల్లో జీవించొచ్చు. ఓ సినిమాలో డాక్టర్‌గా, ఇంకో సినిమాలో లాయర్‌గా, మరో సినిమాలో టీచర్‌గా... ఇలా ఎన్నో రకాలుగా కనిపించొచ్చు. కానీ, నిజజీవితంలో ఈ అన్నిటినీ చేయలేం కదా’’ అంటున్నారు తమన్నా. ఈ మిల్క్‌బ్యూటీకి ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. సో.. మీరు ప్లాన్ చేసుకున్న ప్రకారమే కెరీర్ వెళుతోందా? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘తెలుగు తర్వాత తమిళ్, ఆ తర్వాత హిందీ అని నేను ప్లాన్ చేయలేదు. ఎందుకంటే, గతంలో ‘ఇలా చేస్తే బాగుంటుంది’ అని నేను ప్లాన్ చేసుకుని, చేసినది ఏదీ జరగలేదు.
అందుకే, ప్లాన్ చేయడం మానేశాను. విచిత్రంగా నా కెరీర్ మంచి మలుపులు తీసుకుం టోంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను చాలా టెన్షన్ పడేదాన్ని. భాష సమస్య, కెమెరా అంటే భయంతో ఈజీగా యాక్ట్ చేయలేకపోయేదాన్ని. తెలుగు అర్థం చేసుకుని, కొంచెం మాట్లాడ్డం మొదలుపెట్టిన తర్వాత, ఆ సమస్య తీరిపోయింది. సినిమాలు చేసేకొద్దీ, కెమెరా అంటే భయం పోయి, రిలాక్స్ అయ్యా. కెమెరా ముందు ఎప్పుడైతే రిలాక్స్ అవ్వడం మొదలుపెట్టానో అప్పట్నుంచీ నటన కూడా సులువైంది. ఎలాంటి క్లిష్టమైన పాత్ర అయినా, చేసేయగలుగుతామనే ఆత్మవిశ్వాసం ఏర్పడింది’’ అని చెప్పారు.