సినీ నటి తమన్నా కేసును చైన్నె హైకోర్టు వాయిదా వేసింది. నటి తమన్నా సినిమాల్లో నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అలా ఆమె నటించిన ఓ వాణిజ్య ప్రకటన ప్రసారం గడువు పూర్తి అయినా సదరు సంస్థ ఆ ప్రకటనను ఉపయోగించడంతో తమన్నా దాన్ని వ్యతిరేకిస్తూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను ఒక ప్రముఖ వాణిజ్య సంస్థకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించానని, అయితే ఒప్పందం గడువు పూర్తి అయినా ప్రకటనను వాడుతుండటంతో తాను కోర్టును ఆశ్రయించానని, తన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఆ ప్రకటనపై నిషేధం విధించిందని పేర్కొన్నారు.
అయినప్పటికీ ఆ సంస్థ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ తాను నటించిన ప్రకటనను ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు. ఈ కేసు న్యాయమూర్తులు సెంథిల్ కుమార్, రామమూర్తిల డివిజన్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. దీంతో ఆ వాణిజ్య సంస్థ తరుపున హాజరైన న్యాయవాది ఆర్.కృష్ణ కుమార్ వాదిస్తూ నటి తమన్నా నటించిన తమ వాణిట్య ప్రకటన ప్రసారాన్ని తాము నిలిపి వేశామని, అయితే ప్రైవేట్ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వాడుతుంటే తాము ఎలా బాధ్యులమవుతామని పేర్కొన్నారు.
దీంతో ఈ కేసులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయ మూర్తులు తదుపరి విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. కాగా ఒక సబ్బు ప్రకటన సంస్థపై కూడా తమన్నా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment