న్యూఢిల్లీ: దేశంలో ఈమధ్యకాలంలో నెలకొన్న పరిస్థితులపై, చోటు చేసుకుంటున్న వరుస ఉదంతాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. శ్రీరామ నవమి సందర్భంగా చోటుచేసుకున్న మత ఘర్షణలను హైలైట్ చేస్తూ.. మొత్తం 13 ప్రతిపక్ష పార్టీలు శనివారం రోజున సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
తారతమ్యాలకు, రాగద్వేషాలకు తావులేకుండా దేశం మొత్తం శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన ఆ పార్టీలు.. మత హింసకు కారణమైనవాళ్లను వదలకూడదని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. ఇదిలా ఉండగా.. ఈ ఘర్షణలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ మౌనంగా ఉండడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆ సంయుక్త ప్రకటనలో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. మతోన్మాదాన్ని ప్రచారం చేసే వాళ్ల మాటలను, వాళ్ల చర్యలను ఖండించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఆయన మౌనం.. ఇటువంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుందని, వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచిందని ఆరోపించాయి.
తినేతిండి, కట్టుకునే బట్ట, వాళ్ల వాళ్ల విశ్వాసాలు, పండుగలు, భాషకు..ఇలాంటి విషయాలను పాలక వ్యవస్థలోని వర్గాలు.. మన సమాజాన్ని ధ్రువీకరించడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నతీరుపై చింతిస్తున్నాం. దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన సంఘటనలు పెరిగిపోతున్నాయి. అధికారమనే అండతో రెచ్చిపోతున్నారు. అలాంటి వాళ్లపై అర్ధవంతమైన, బలమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నాం అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది.
హిజాబ్, హిందీ భాష, తిండిపై ఆంక్షలు, మత ఘర్షణలు.. ఇలా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న అంశాలపైనే ఈ పార్టీలు, ప్రధాని మోదీని నిలదీసినట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఐ(ఎం), డీఎంకే, ఆర్జేడీతో పాటు మరికొన్ని ఈ సంయుక్త ప్రకటనలో సంతకాలు చేశాయి. అయితే.. శివసేన, ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రం ఈ లిస్ట్‌లో లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment