అయ్యోపాపం.. ఎవరీమహిళ
-
ఇక్కడి భాష రాక ఇబ్బందులు
-
పొంతన లేని సమాధానాలు
-
స్టేట్‌హోంకు తరలించేందుకు ఏర్పాట్లు
కడియం :
ఎవరో తెలీదు.. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పదు.. అడిగిన వారందరికీ ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతూ తికమకపెడుతోంది. కడియం మండలం వేమగిరి పంచాయతీ, పరిసర ప్రాంతాల్లో నెల రోజులుగా సంచరిస్తున్న ఈ యువతి రక్షణ విషయంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఈ విషయాన్ని స్థానిక విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల రోజుల నుంచి పంచాయతీ పక్కనే ఉన్న రామాలయం, ప్రాథమిక పాఠశాల ఆవరణల్లో సుమారు 30 ఏళ్ల మహిళ ఉంటోంది. చుట్టుపక్కల వారు పెట్టిన భోజనం తింటూ కాలం వెళ్లదీస్తోంది. ఆమె వద్ద నల్లరంగు బ్యాగ్, వాటర్ బాటిల్ మాత్రమే ఉన్నాయి. పూర్తిగా హిందీ కాకుండా మాట్లాడుతుండడంతో ఆమె భాష ఏమిటో స్థానికులకు అర్ధం కావడం లేదు. ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించినప్పటికీ కచ్చితమైన సమాచారం చెప్పడం లేదు. రాత్రిపూట ఆకతాయిలు ఆమెను అల్లరి పెడుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాఉండగా శనివారం ఆమెను స్థానిక విలేకరులు పలకరించారు. తమది న్యూఢిల్లీ అని, పేరు శీతల్ అని చెబుతోంది. బంధువులతో పాటు తాను తిరుపతి వచ్చానని ఒకసారి, అన్నవరం అని ఒకసారి అంటోంది. ఈ నేపథ్యంలో దేవాలయ సిబ్బంది, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారుల దృష్టికి ఆ మహిళ పరిస్థితిని విలేకరులు తీసుకువెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను రాజమహేంద్రవరంలోని స్టేట్‌హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.