
ఇంగ్లిష్ రాని ఇంజనీర్లు
► ఆంగ్లం రాకపోవడం వల్లే 51.2 శాతం మందికి ఉద్యోగాలు రావట్లేదు
► హైదరాబాద్‌లో సగానికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంగ్లిష్ రాదు
► ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ సర్వేలో వెల్లడి
► దేశంలో ఏటా ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్నవారు 6 లక్షల మంది..
► వీరిలో ప్రముఖ కంపెనీలకు తగిన విధంగా ఇంగ్లిష్ మాట్లాడగలిగేది 2.9 శాతమే
► కనీస గ్రామర్‌తో మాట్లాడేది 25 శాతం మందే
► ఇతర ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్, చెన్నై గ్రాడ్యుయేట్ల వెనుకంజ
సాక్షి, హైదరాబాద్: ఏళ్లకు ఏళ్లు చదువులు.. పుస్తకాలతో కుస్తీలు.. ఇంజనీరింగ్ పట్టాలు.. కానీ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేందుకు అవసరమైన ఇంగ్లిష్ మాత్రం రాదు. కనీసం ఎదుటివారితో వేగంగా సంభాషించేటంతటి పరిజ్ఞానమే ఉండడం లేదు. ఏటా కాలేజీల నుంచి లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నా... వారిలో ఉద్యోగాలు వస్తున్నది చాలా తక్కువ మందికే. సరిగా ఇంగ్లిష్ భాష రాకపోవడమే దీనికి కారణమని ప్రముఖ కంపెనీలకు ప్లేస్‌మెంట్ సర్వీసులు నిర్వహించే ఆస్పైరింగ్ మైండ్స్ తమ సర్వేలో తేల్చింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని.. ఇక్కడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో సగం మందికిపైగా సరైన ఇంగ్లిష్ పరిజ్ఞానం లేదని గుర్తించింది. ఇక్కడి వారు తమ స్పోకెన్ ఇంగ్లిష్ సామర్థ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవాలని సూచించింది.
దేశంలో ఏటా 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుండగా... అందులో 51.2 శాతం మందికి కేవలం ఇంగ్లిష్‌లో సరిగ్గా మాట్లాడటం రాకపోవడం వల్లే ఉద్యోగాలు లభించడం లేదని ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ సర్వేలో వెల్లడైంది. ప్రముఖ కంపెనీలు, పేరున్న కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్‌లో అన్ని సామర్థ్యాలు (మాట్లాడడం, రాయడం, ప్రభావవంతమైన పదాలు వినియోగించడం, ఉచ్చారణ, స్పష్టత వంటివి) కలిగి, మాట్లాడి మెప్పించగలిగే గ్రాడ్యుయేట్లు కేవలం 2.9 శాతం మందేనని తేలింది. ఇంగ్లిష్‌లో అమ్మాయిలు బాగా రాయగలుగుతుండగా... అబ్బాయిలు బాగా మాట్లాడగలరని వెల్లడైంది. ఇక ఉద్యోగాల్లో చేరిన వారిలోనూ
సందర్భానుగుణంగా స్పందించి ఇంగ్లిషులో బాగా కమ్యూనికేట్ చేయగలిగిన, వ్యాకరణానుగుణంగా ఉచ్ఛరించగలిగిన ఇంజనీర్లు 6.8 శాతమేనని సర్వే గుర్తించింది.
కనీస పదాలు తెలిసిన వారు 33 శాతం ఉంటే... సాధారణ వ్యాకరణంతో వాక్య నిర్మాణం తెలిసిన వారు 25 శాతం మందేనని తేల్చింది. వివిధ మెట్రో నగరాలు, ప్రముఖ పట్టణాలతో పోల్చితే హైదరాబాద్, చెన్నై గ్రాడ్యుయేట్లు బాగా వెనుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నగరాలకు చెందిన వారు తమ స్పోకెన్ ఇంగ్లిషు సామర్థ్యాలను బాగా మెరుగు పరుచుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేసి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో మాట్లాడి ఈ సర్వే చేసినట్లు ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ వెల్లడించింది. ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 500 కాలేజీలకు చెందిన 30 వేల మంది విద్యార్థులతో మాట్లాడినట్లు తెలిపింది. ఎంపిక చేసుకున్న వారిలో 51.9 శాతం మంది అబ్బాయిలు, 48.1 శాతం అమ్మాయిలు ఉన్నారని పేర్కొంది. వీరితో మాట్లాడినపుడు ఫ్లూయెన్సీ (తప్పులు లేకుండా మాట్లాడడం), యాక్టివ్ లిజనింగ్ (విని అర్థం చేసుకోవడం), పద ఉచ్ఛారణ, స్పోకెన్ ఇంగ్లిషు, వ్యాకరణం, వాక్య నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.
సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు
- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉచ్ఛారణ విషయానికి వస్తే 6.6 శాతం మంది బాగా మాట్లాడగ లిగారు, సులభంగా అర్థం చేసుకోగలిగారు. మరో 8.4 శాతం మంది బాగా మాట్లాడగలిగినా కొద్దిగా సమస్య ఎదుర్కొంటున్నారని... 30.6 శాతం మంది మేనేజ్ చేయగలిగినవారని గుర్తించారు. 47.6 శాతం మంది మాత్రం పదాలు కూడా సరిగ్గా ఉచ్ఛరించలేకపోతున్నట్లు తేలింది. మరో 6.8 శాతం మంది అయితే ఇంగ్లిషులో పెద్దగా మాట్లాడడం రావడం లేదని పేర్కొంది.
- ఇక ఎదుటివారు చెబుతున్న దానిని బాగా అర్థం చేసుకోగలిగిన వారు 6.1 శాతం మాత్రమే ఉన్నారని సర్వే తేల్చింది. 18.5 శాతం మంది కొద్దిగా ఇబ్బంది పడినా.. బాగానే అర్థం చేసుకోగలిగారని, 28.7 శాతం మంది పరవాలేదని గుర్తించింది. ఇక 27.2 శాతం మంది సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని, 19.6 శాతం మంది అసలు కొంచెమైనా ఇంగ్లిషును అర్థం చేసుకోవడం లేదని వెల్లడైంది.
- ఇక పలు ఉద్యోగాల్లో ఉన్నవారినీ సర్వే చేశారు. ఈ ఉద్యోగుల్లో బిజినెస్ కన్సల్టింగ్, కార్పొరేట్ సేల్స్ విభాగంలో 1 శాతం మంది, కార్పొరేట్ సర్వీసింగ్, టీచింగ్ విభాగాల నుంచి 2.9 శాతం మంది, అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు 24.9 శాతం మంది, మిగతా రంగాల ఇంజనీర్లు 22 శాతం మంది, ఐటీ ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు 49.2 శాతం మంది ఉన్నారు. వీరిలో కార్పొరేట్ సర్వీసింగ్, టీచింగ్ విభాగాల వారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మాట్లాడగలుగుతున్నారని సర్వే తేల్చింది. ఆ తరువాత పలు రంగాల ఇంజనీర్లు ఉన్నట్లు వెల్లడించింది.
దక్షిణాది గ్రాడ్యుయేట్ల వెనుకంజ
- దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా మాతృభాషలోనే చదువుకోవడం వల్ల ఇంగ్లిషు విషయంలో సమస్య ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వే పేర్కొంది.
- పదాలను స్పష్టంగా, వేగంగా ఉచ్ఛరించే గలిగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఢిల్లీలో 59.9 శాతం మంది ఉండగా.. బెంగళూరులో 58.3 శాతం మంది, ముంబై, పుణెలో 56.2 శాతం మంది, కోల్‌కతాలో 52 శాతం మంది, హైదరాబాద్‌లో 51 శాతం మంది, చెన్నైలో 46.7 శాతం మంది ఉన్నట్లు వెల్లడైంది.
- ఇంగ్లిషులో బాగా మాట్లాడగలిగే వారిలో ముంబై, పుణెకు చెందిన గ్రాడ్యుయేట్లు 60.6 శాతం మంది ఉండగా.. ఢిల్లీ వారు 57.7 శాతం, హైదరాబాద్ వారు 52.6 శాతం, చె న్నైవారు 47.3 శాతం మంది ఉన్నారు.
- వ్యాకరణబద్ధంగా ఇంగ్లిషు మాట్లాడేవారు, రాయగలిగే గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఢిల్లీలో 56.4 శాతం, హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్లు 48.6 శాతం, చెన్నైలో 41.5 శాతం ఉన్నారు.
- మొత్తంగా ఇంగ్లిషు సరిగా రాకపోవడం వంటి కారణాలతోనే 51.9 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించడం లేదని ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై నగరాలకు చెందిన విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిషు సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకోవాలని సూచించింది.
వివిధ నగరాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఇంగ్లిషు సామర్థ్యాలు (శాతాల్లో)
నగరం ఉచ్ఛారణ స్పష్టత వినడం మాట్లాడటం పద వినియోగం గ్రామర్
బెంగళూరు 58.3 55 58.1 56 58.9 54.1
చెన్నై 46.7 45.2 49.1 47.3 51.3 41.5
హైదరాబాద్ 51 50.3 53.3 52.6 54.8 48.6
కోల్‌కతా 52 49.5 54.5 53.1 55.2 49
ముంబై, పుణె 56.2 52.9 56.4 60.6 60.8 53.1
న్యూఢిల్లీ 59.9 57.6 59.8 57.7 60.9 56.4