అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతోన్న భాష తెలుగు భాషేనని ఓ అమెరికా సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ వాణిజ్య సదస్సు(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) అంచనా ప్రకారం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010–17కాలంలో ఏకంగా 86 శాతానికి పెరిగింది. సెన్సస్ గణాంకాలను సేకరించే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ సంస్థ యూఎస్‌లో మాట్లాడే భాషలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010–17 కాలంలో ఇంగ్లిష్ మినహా అక్కడి ఇళ్ళల్లో మాట్లాడే భాషపై ఈ అధ్యయనం చేశారని బీబీసీ తెలిపింది. 2017లో యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 భాషల్లో ఏడు దక్షిణాసియావే కావడం విశేషం. ఇంత వేగంగా తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి 1990లలో యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఏర్పడిన డిమాండే కారణమని ‘తెలుగు పీపుల్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్ కూనిశెట్టి చెప్పారు.
కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుంచి అధిక సంఖ్యలో యూఎస్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకోసం వెళ్తున్నారని బీబీసీ తెలిపింది. అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.అందులో అధికంగా స్పాని ష్ మాట్లాడే వాళ్లున్నారు. యూఎస్‌లో భారతీ య భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు టాప్‌లో ఉంటే తర్వాతి స్థానాన్ని గుజరాతీ చేజిక్కించుకుంది. బెంగాలీ భాషను తెలుగు అధిగమించింది. అయితే, తెలుగు కంటే తమిళం మాట్లాడే వారు అమెరికా అంతటా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ఇలినాయీస్ స్టేట్, న్యూయార్క్, వాషింగ్టన్, ఓరెగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియాల్లో తెలుగువారు ఎక్కువ. అమెరికాలో తెలుగు మాట్లాడే వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మొదలుకొని మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలు నీనా దావులూరి వరకు ప్రముఖులెందరో ఉన్నారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాదీలే.
Comments
Please login to add a commentAdd a comment