సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. 2010 నుంచి 2017 సంవత్సరం వరకు వీరి సంఖ్య ఊహించనంతగా భారీగా పెరిగి నేడు నాలుగు లక్షలను దాటిందని ‘సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్’ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. దేశంలో ఉంటూ విదేశీ భాష మాట్లాడే వారిలో 86 శాతం మంది తెలుగువారేనని ఆ సర్వే పేర్కొంది. తెలుగు తర్వాత అరబిక్ మాట్లాడే వారి శాతం 42, హిందీ మాట్లాడే వారి శాతం 42, ఉర్దూ మాట్లాడే వారి శాతం 30, చైనీస్ 23 శాతం, గుజరాతీ 22 శాతం, హైతీ మాట్లాడే వారి శాతం 19 అని అధ్యయనంలో తేలింది.
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మాతృ భాషయిన తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 2000 సంవత్సరం నాటికి 87,543 మంది మాత్రమే ఉండగా, వారి సంఖ్య 2010 సంవత్సరం నాటికి 2,22,977కి చేరుకుంది. వీరి సంఖ్య 2017, జూలై నాటికి 4,15,414కు చేరుకుంది. తెలుగు రాష్ట్రా నుంచి టెక్, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా అమెరికాకు రావడం వల్లనే అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు వచ్చారని, వారిలో ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ చదవేవారు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌లు కూడా హైదరాబాదీలవడం విశేషమని అధ్యయనం పేర్కొంది.
ఒక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర తొమ్మిది ఉద్యోగాల్లో ఐదుగురు ఉద్యోగులు తెలుగువారే ఉంటున్నారు. రెండో తెలుగుతరం కుటుంబానికి చెందిన నైనా దవులూరి 2013లో మిస్ ఇండో–అమెరికన్‌గా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి 1980లో అమెరికా డాక్టర్ దంపతుల కూతురు నైనా. స్పెల్లింగ్ బీ పోటీల్లో కూడా ఎక్కువగా తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ప్రతిష్టాకరమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో కూడా తెలుగు విద్యార్థులు టాప్‌లో నిలవడం విశేషం. తెలుగు సంస్కృతిని నిలబెట్టడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలోను తెలుగువారు ముందుంటున్నారు. కొందరు తమ పిల్లలకు సంప్రదాయ సంగీతం, నృత్యంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి విషయంలో చీకటి కోణం కూడా ఉంది. జాతి విద్వేషాలకు, దోపిడీలకు తెలుగువారే ఎక్కువగా బలవుతున్నారు.
బెంగాలీ, తమిళయన్లు తక్కువే!
అమెరికాలో బెంగాలీ మాట్లాడేవారు మూడున్నర లక్షల మంది ఉండగా, తమిళం మాట్లాడే వారి సంఖ్య 2,80,000 మాత్రమే. అయితే ఇటీవలి కాలంలో వారు బాగా పెరుగుతున్నారు. బెంగాలీల్లో పెరుగుదల 57 శాతం కాగా, తమిళయన్లలో 55 శాతం ఉంది. తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే అయినప్పటికీ వివిధ భాషల వారు విస్తృతంగా హిందీ మాట్లాడతారు. దాదాపు 8,63.000 మంది అమెరికాలో హిందీ మాట్లాడతారు. మొత్తంలో అమెరికా జనాభాలో ఇళ్ల వద్ద విదేశీ భాష మాట్లాడే వారి సంఖ్య 21.8 శాతం మందని అధ్యయనంలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment