‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల ప్రశంసలందుకున్న భాష మన తెలుగు భాష. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని వెనీషియన్ యాత్రికుడు నికోలో డి కాంటీ ప్రస్తుతించిన భాష మన తెలుగు భాష. స్వాతంత్య్రం వచ్చి పదేళ్లు పూర్తయ్యే లోగానే భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. అప్పటికి హిందీ తర్వాత తెలుగు భాష దేశంలో ద్వితీయస్థానంలో ఉండేది. మరాఠీ మూడో స్థానంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో అద్వితీయ భాషగా వెలుగొందగలదని తెలుగు ప్రజలందరూ ఆశలు పెంచుకున్నారు. ఆ ఆశలు ఎన్నాళ్లో నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత పట్టుమని పదిహేనేళ్లలోగానే తెలుగు మూడో స్థానానికి పడిపోయింది. బెంగాలీ రెండో స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో తెలుగు పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది.
తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడినా, దేశ భాషల్లో తెలుగు తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం కాదు సరికదా, కనీసం పదిలపరచుకోవడంలోనూ విఫలమై, నాలుగో స్థానానికి పడిపోయింది. హిందీ అప్పటికీ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా బెంగాలీ రెండో స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తుండగా, మరాఠీ మూడో స్థానానికి ఎగబాకింది. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. ఈ లెక్కల కోసం పరిగణనలోకి తీసుకున్న దశాబ్ద కాలంలో– అంటే, 2001–11 కాలంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్యలో 9.63 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో నేపాలీ (1.98 శాతం) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మలయాళం (5.36 శాతం), సింధీ (9.34 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి.
తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్న ఆనందం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలతో ఆవిరైనట్లేనంటూ తెలుగు భాషాభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు విద్యావేత్తలు ఈ లెక్కలను తోసిపుచ్చుతున్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలు పూర్తిగా తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చెబుతున్నారు. ఖరగ్‌పూర్, భిలాయి, ఒడిశా తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే, దేశ భాషల్లో తెలుగు రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో ఉంటుందని, అంతేకాని నాలుగో స్థానంలో కాదని ఆయన మీడియాతో అన్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికను అంతిమంగా స్వీకరించలేమని, దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికపై తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగు భాషాభిమానులు తమ తమ స్థాయిలో స్పందిస్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
హిందీ హవా
అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన దశాబ్ద కాలాన్నే తీసుకుంటే, 2001 –11 మధ్య కాలంలో హిందీ మాతృభాషగా గల వారి జనాభాలో ఏకంగా 10 కోట్ల పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల రెండో స్థానంలో ఉన్న బెంగాలీ మాతృభాషగా గల వారి జనాభా కంటే ఎక్కువే. మన దేశంలో మాట్లాడే చాలా భాషలతో పోల్చుకుంటే హిందీ ఆధునిక భాష. మిగిలిన భాషల కంటే దీనికి గల చరిత్ర చాలా తక్కువ. సంస్కృత భాష నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో పుట్టిన అపభ్రంశ రూపమైన సౌరసేని భాష హిందీకి మూలమని చెబుతారు. ప్రామాణిక రూపంలోని హిందీ రచనలు పదహారో శతాబ్దిలో మొదలయ్యాయి. మొఘల్ సామ్రాజ్యం చివరి దశలో ఉండగా, అంటే పద్దెనిమిదో శతాబ్దిలో మాత్రమే హిందీ ఆస్థాన గౌరవాన్ని అందుకోగలిగింది. బ్రజ్‌భాష, అవధి, మైథిలి వంటి స్థానిక భాషలను, మాండలికాలను కలుపుకొని ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో విస్తరించింది.
తెలుగుతో పాటు ప్రాచీన హోదా అందుకున్న ఆరు భాషల్లో ఏ భాష కూడా ఈ స్థాయిలో విస్తరించలేదు సరికదా, జనాభాలో తమ శాతాన్ని కూడా పెంచుకోలేకపోతున్నాయి. హిందీ మాట్లాడేవారి సంఖ్య 1971 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 161 శాతం మేరకు పెరిగింది. ఇదేకాలంలో తెలుగు సహా దక్షిణాదికి చెందిన ద్రావిడ భాషలు మాట్లాడేవారి జనాభాలో 81 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. మరోవైపు 2001 నుంచి 2011 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేవారి జనాభా దాదాపు రెట్టింపయింది. హిందీ మాట్లాడేవారు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడుతున్నా, వారు తమ మాతృభాషను కాపాడుకోగలుగుతున్నారు.
దేశవ్యాప్తంగా హిందీని మాతృభాషగా చదువుకోగల వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. తెలుగు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటున్నా, ఆ రాష్ట్రాల్లో ఒకటి రెండు తరాలు గడిచే సరికి తెలుగును మాతృభాషగా నిలబెట్టుకోగలుగుతున్న వారి సంఖ్య నానాటికీ పడిపోతూ వస్తోంది. తెలుగులో విద్యావకాశాలు దాదాపు లేకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని తెలుగువారు తప్పనిసరిగా అక్కడి స్థానిక భాషలనే మాతృభాషగా స్వీకరిస్తున్నారు.
సంఖ్య పెరిగినా తగ్గిన జనాభా శాతం
అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1951 నాటితో పోల్చుకుంటే 2011 నాటికి తెలుగు మాట్లాడే వారి జనాభా సంఖ్యపరంగా రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగింది. దేశజనాభాను మొత్తంగా పరిగణనలోకి తీసుకుంటే మాత్రం తెలుగు మాట్లాడే వారి శాతం ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారు 1951 నాటికి 9.24 శాతం ఉంటే, 2011 నాటికి 6.93 శాతానికి పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హిందీ ప్రచారం జరిగినట్లుగా మరే భాషకూ ప్రచారం జరగలేదు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నాలు జరిగినప్పుడు తమిళనాడు నుంచి మాత్రమే గట్టి ప్రతిఘటన ఎదురైంది. బెంగాలీ, తమిళం, మరాఠీ వంటి భాషలు తమ తమ రాష్ట్రాల్లో తమ ఉనికి బలంగా కాపాడుకోగలిగాయి. ఉనికిని కాపాడుకోవడంతో పాటు ప్రాబల్యాన్ని పెంచుకునే చర్యలు చేపట్టడంలో తెలుగు, కన్నడ వంటి భాషలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి.
స్వాతంత్య్రం వచ్చిన నాటికి రెండో స్థానంలో ఉన్న తెలుగు, 1971 నాటికి మూడో స్థానానికి పడిపోయినప్పుడైనా, తాజాగా మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయినప్పుడైనా తెలుగు భాషోద్ధరణ కోసం, కనీసం భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వ వర్గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. తెలుగు భాషోద్ధరణ పేరిట 1975 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినా, వాటి వల్ల తెలుగు ప్రజలకు ఒరిగినదేమీ లేదు. పైగా, తెలుగు రాష్ట్రాల వెలుపల ఉంటున్న తెలుగు విద్యార్థులకు మాతృభాషలో విద్యావకాశాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉంటున్నా, వారిలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య, తెలుగు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇదివరకటి కాలంలో అ‘ద్వితీయం’గా వెలుగొందిన తెలుగు భాష ప్రాభవం ఇప్పుడు క్రమంగా మసకబారుతుండటానికి వెనుకనున్న కారణాలను విశ్లేషించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనే ఉంది.
తెలుగు చరిత్రలో మైలురాళ్లు తెలుగు
భాష క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికే ఉనికిలో ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దికి చెందిన శాతవాహనుల కాలం నాటి ప్రాకృత పద్యసంకలనం ‘గాథాసప్తశతి’లో అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు, ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. తెలుగులోని స్పష్టమైన తెలుగు శిలాశాసనం క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శిలా శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు పదం ‘నాగబు’. శతాబ్దాల తరబడి వాడుక తర్వాత క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో తెలుగులో గ్రంథరచన మొదలైంది. మహాభారత ఆంధ్రీకరణకు నన్నయ శ్రీకారం చుట్టాడు. నన్నయ మహాభారత రచన ప్రారంభించడానికి ముందే తెలుగులో కొన్ని జానపద గీతాలు, పద్యాలు ప్రచారంలో ఉండేవి. నన్నయ ప్రారంభించిన మహాభారత ఆంధ్రీకరణను పదమూడో శతాబ్దికి చెందిన తిక్కన, పద్నాలుగో శతాబ్దికి చెందిన ఎర్రన పూర్తి చేశారు. తెలుగులో గ్రంథరచన మొదలైన దాదాపు మూడు శతాబ్దాల కాలంలో చాలామంది కవులు ఎక్కువగా పురాణాల ఆధారంగానే కావ్యాలు రాశారు.
పదిహేనో శతాబ్ది నుంచి పదహారో శతాబ్ది వరకు గల కాలం తెలుగు సాహిత్య చరిత్రలో ‘శ్రీనాథయుగం’గా ప్రసిద్ధి పొందింది. శ్రీనాథుడు, పోతన, గౌరన, జక్కన, తాళ్లపాక తిమ్మక్క వంటి కవులు తెలుగు ఛందస్సును పరిపుష్టం చేశారు. శ్రీనాథ యుగంలో కూడా సంస్కృత కావ్య, నాటకాల అనువాదం ప్రధానంగా కొనసాగింది. ప్రబంధ ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకుంది. పదహారో శతాబ్ది మన సాహిత్య చరిత్రలో‘రాయలయుగం’గా ప్రసిద్ధి పొందింది. రాయల కాలంలో అత్యధికంగా ప్రబంధ కావ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కాలాన్ని ప్రబంధ యుగం అని కూడా అంటారు. స్వయంగా కవి అయిన శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ కావ్యాన్ని రచించాడు. ఆయన ఆస్థాన కవులైన పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు తదితరులు కూడా ప్రబంధ కావ్యాలు రచించారు. తర్వాతి కాలంలో కర్ణాటక సంగీత సంప్రదాయం పుంజుకుంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్లో చాలామంది తెలుగులో కృతులు, కీర్తనలు రచించారు.
ఆధునిక యుగంలో తెలుగు
తెలుగులో మొట్టమొదటి అచ్చు పుస్తకం 1796లో విడుదలైంది. అయితే, తెలుగు సాహిత్యంలో ఆధునికత మాత్రం పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో మాత్రమే ప్రారంభమైంది. అప్పటికి దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుండటంతో ఇంగ్లిష్ కవిత్వం ప్రభావంతో నాటి యువకవులు భావకవిత్వం పేరిట కొత్తరీతిలో ప్రణయకవిత్వాన్ని విరివిగా రాశారు. బ్రిటిష్ అధికారి అయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై మక్కువ పెంచుకుని, మరుగున పడిపోయిన వేమన పద్యాలను వెలుగులోకి తేవడమే కాకుండా, వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. తొలి ఇంగ్లిష్–తెలుగు నిఘంటువును స్వయంగా పరిష్కరించి, ప్రచురించాడు. తెలుగునాట ఏ విశ్వవిద్యాలయాలూ, సాహితీ సంస్థలూ చేయలేనంతగా తెలుగు భాషోద్ధరణకు సీపీ బ్రౌన్ కృషి చేశాడు. కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ ద్వారా తెలుగులో నవలా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆధునిక యుగంలోని తొలినాటి రచనలు ఎక్కువగా గ్రాంథికభాషలోనే ఉండేవి.
సాహిత్యాన్ని పామరులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కొందరు రచయితలు వ్యావహారిక భాషోద్యమానికి తెరతీశారు. గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమాన్ని ఉధృతంగా సాగించడంతో చాలామంది కవులు, రచయితలు వాడుక భాషలో రచనలు చేయడం ప్రారంభించారు. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని పూర్తిగా వాడుక భాషలోనే రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కట్టమంచి రామలింగారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుడిపాటి వెంకటచలం, శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారు తమ రచనల ద్వారా వ్యావహారిక భాషావ్యాప్తికి కృషి చేశారు. గిడుగు రామమూర్తి శిష్యుడైన తాపీ ధర్మారావు తన సంపాదకత్వంలో వెలువడిన ‘జనవాణి’ పత్రిక ద్వారా పత్రికల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు. ‘జనవాణి’కి ముందునాటి పత్రికల్లో మామూలు వార్తలను కూడా సరళగ్రాంథిక భాషలో రాసేవారు. పత్రికల్లో తాపీ ధర్మారావు తెచ్చిన ఒరవడిని అనతికాలంలోనే మిగిలిన పత్రికలూ అందిపుచ్చుకున్నాయి.
ప్రాచీన హోదాకు వైఎస్ కృషి,
బ్రిటిష్ హయాంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రావిన్స్‌లో అంతర్భాగంగా ఉండేవి. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా నిజాం పాలనలో ఉండేది. తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన దరిమిలా, 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకు తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకొని 1956 నవంబర్ 1న విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం ఫలితంగా 2014లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తెలుగు తన ‘ద్వితీయ’ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ 2006 ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించింది. తెలుగు భాషకు సంబంధించిన మరిన్ని ప్రాచీన ఆధారాలను కూడా సమర్పించడంతో 2008లో తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం తెలుగు ప్రజలకు సంతోషకరమే. అయితే, బోధనలోను, పరిపాలనలోను తెలుగు భాషా వ్యాప్తి, విస్తరణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా కృషి చేస్తేనే తెలుగు తిరిగి అ‘ద్వితీయ’ స్థానంలో వెలుగొందగలుగుతుంది.
– పన్యాల జగన్నాథదాసు
Comments
Please login to add a commentAdd a comment