
గుంటూరు, సాక్షి: రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు. రైతు లోగిళ్ళలో ధాన్యం రాసులు.. పిండి వంటల ఘుమఘుమలు. బంధు మిత్రుల సందళ్ళతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి.
మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లోనే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, గవర్నమెంటు బడి, గవర్నమెంటు ఆసుపత్రిలో నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు, ఒక్క రూపాయి కూడా లంచం, వివక్ష లేకుండా ప్రజలకు అందిన రూ. 2.46 లక్షల కోట్ల డీబీటీ... ఇంటింటికీ, ప్రతి పేద సామాజికవర్గానికి చరిత్రలో ఎన్నడూలేనంతగా అందిన లబ్ధి...ఇవన్నీ పల్లెలు మళ్ళీ కళకళలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ఇంటింటా, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మారుమూల పల్లెలోనూ, ప్రతి ఒక్క సామాజికవర్గంలోనూ... నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని నమ్ముతూ ఆచరిస్తున్న ప్రభుత్వంగా... రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment