తెలుగు భాష అంతరించిపోతుందనో, నేటి చిన్నారులు, రేపటి పౌరులు మాతృభాషకు దూరమవుతారనే దిగులు ఇంకెంతమాత్రం అక్కరలేదు.
*పిల్లలకు అక్షరాలు నేర్పటానికి ‘యాప్’
*రంజిత్ బృందాన్ని మెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ: తెలుగు భాష అంతరించిపోతుందనో, నేటి చిన్నారులు, రేపటి పౌరులు మాతృభాషకు దూరమవుతారనే దిగులు ఇంకెంతమాత్రం అక్కరలేదు. అక్షరాలు కళ్లముందు ప్రత్యక్షమై మనసుకు హత్తుకునే ‘యాప్’ను సృష్టించారు నవ్యాంధ్ర ఇంజనీర్లు రంజిత్ కొల్లు, కిరణ్, వెంకట్. గన్నవరానికి చెందిన కొల్లు రంజిత్ మిత్రులతో కలసి తాను రూపొందించిన కూల్ స్లేట్ యాప్‌ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట ప్రదర్శించారు. దాదాపు పదినిమిషాలు ఈ యాప్ వివరాలను సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మగ్గులు, టీషర్టులు, ఇంట్లో ఉపయోగించే వస్తువులు, ఆట వస్తువులపై ముద్రించవచ్చని రంజిత్ ముఖ్యమంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి స్పందిస్తూ నేర్చుకోవటం కళకాదని, నేర్చించటం కూడా ఒక కళేనని ....అందులో రంజిత్ విజయం సాధించారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుగా ఉపయోగించుకోవాలని తాను తరచూ చెబుతుంటానని సీఎం వ్యాఖ్యానించారు. ఇటువంటి ఆధునిక ఆవిష్కారాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ యాప్‌పై అధ్యయనం చేసి విద్యాసంస్థలలో ఎలా ఉపయోగించుకోవచ్చో తనకు తెలియజేయాలని సీఎంఓ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కాగా కూల్ స్లేట్ యాప్ను మాతృభాషా దినోత్సవమైన ఈనెల 29న ప్రారంభిస్తామని కొల్లు రంజిత్ తెలిపారు. తెలుగు భాషనే గుండె ఘోషగా భావిస్తూ చిన్నారులకు తెలుగు అక్షరాలు నేర్పటానికి కూల్ ఫెబెట్స్.కామ్ పేరుతో వెబ్ సైట్‌ను రూపొందించారు.