
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. ‘ఇంగ్లీష్‌ను వద్దనడం లేదు.. మాతృభాష వదలొద్దు అంటున్నాం’ అంటూ ఆయన నిన్న ట్వీట్ చేశారు. సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున మద్దతు రావడంతో చంద్రబాబు ఇప్పటికే యూటర్న్ తీసుకున్నారు. తాజాగా పవన్ కూడా చంద్రబాబునే అనుసరించారు. ఈ నెల 21వ తేదీన కొమనాపల్లి సభలో సీఎం జగన్ ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలకు జనసేన పార్టీ సమాధానం అంటూ పవన్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ అరవిందరావు ‘తెలుగు వర్దిల్లతేనే వెలుగు’ అన్న పేరు తో తెలుగు భాషా పరిరక్షణ’, గురించి రాసిన వ్యాసం,అన్ని కోణాలలో చాల విశ్లేషణాత్మకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని లోని అంశాలని పరిశీలించాలి’ అంటూ పవన్ బుధవారం మరో ట్వీట్ చేశారు.