నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ విశ్వభూషణ్, కేంద్ర మంత్రి రమేష్ తదితరులు
సాక్షి, నెల్లూరు: ఇంగ్లిష్ మీడియంకు తాను వ్యతిరేకిని కాదని, ముందు మన మాతృభాషను మరిచిపోకుండా ఉంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వాలు మాతృభాషను ప్రోత్సహించాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఏ భాష ఉన్నా ప్రభుత్వం మాత్రం మాతృభాషతో పాటు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలన్నారు. పరాయి భాషలను తానెప్పుడూ వ్యతిరేకించబోనని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో జరిగిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలుగు భాషాభిమానులతో జరిగిన కార్యగోష్టి ముగింపు సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భాష ప్రాచీనతను, విశిష్టతను పరిరక్షించుకోవడం మన ప్రధాన లక్ష్యం కావాలన్నారు. మైసూరు నుంచి ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని రెండు రాష్ట్రాల్లో ఎక్కడికైనా తరలించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిద్ధపడి రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసిందని.. తాను నెల్లూరుకు వచ్చేలా కృషిచేశానని వెంకయ్యనాయుడు అన్నారు.
త్వరలో అన్ని సౌకర్యాలతో కేంద్రం ఏర్పాటు
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ.. తిక్కన పుట్టిన నెల్లూరుకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. శబ్ధాల్లోనే శక్తి ఉంటుందని, ఆ శబ్ధాలను పరిరక్షించుకోవాలన్నారు. భారతీయ భాషలు ఎన్ని ఉన్నాయో వాటిన్నింటినీ పరిరక్షించుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. రాష్ట్రంలో ఈ అధ్యయన కేంద్రం ఏర్పాటు కోసం స్థలం ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ అంగీకరించారని.. త్వరలోనే ఈ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలతో ఏర్పాటుచేస్తామని రమేష్ చెప్పారు. మాతృభాషలోనే ప్రాథమిక శిక్షణ ఉండాలని.. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయమన్నారు. మాతృభాష, మాతృభూమి, మాతృదేశం అనేవి ప్రతిఒక్కరికీ చాలా ముఖ్యమైనవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment