విద్వాన్ బూతపాటి కిరణశ్రీకి తెలుగు భాషంటే ప్రాణం. తెలుగుభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటాలనే దృఢ సంకల్పం. తెలుగు పండితునిగా విద్యార్ధుల్లో ఆయన స్థానం సుస్థిరం. అక్షరాలు సమాజాన్ని మారుస్తాయన్న అచంచల నమ్మకం ఆయనది. రచనలు, అనువాదాలు చేస్తూనే.. నవయుగ కవి చక్రవర్తి, పద్మ విభూషణ్ గుర్రం జాషువా కవిత్వం పట్ల, జీవిత విధానం పట్ల మక్కువతో విశ్రాంత జీవితాన్ని సమాజాన్ని మలిచేందుకు వినియోగిస్తున్నారు. జాషువా పేరిట తొలి ప్రజాగ్రంథాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశారు. జాషువా విగ్రహాన్నీ ప్రతిష్ఠించారు. భవిష్యత్ తరానికి సాహితీ సిరులను అందించడంలో అలుపెరగని అవిశ్రాంత ఉపాధ్యాయుడు కిరణశ్రీ.
జాషువా సేవలో తరించారు
కిరణశ్రీ సొంత ఊరు అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. తల్లిదండ్రులు నాగరత్నమ్మ, జాన్. ఆయన తండ్రి ఆంగ్లేయుల కాలంలోనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు. కిరణశ్రీ ప్రాధమిక విద్య ఉయ్యలవాడలోనే సాగింది. సంజీవరాయునిపేటలో ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తిచేశారు. 1968–71ల మద్య పద్మభూషణ్ గుర్రం జాషువాకు శిష్యునిగా సేవలందించారు. అప్పుడే తెలుగుభాషా మాధుర్యాన్ని చవి చూసి, భాషపై మక్కువ పెంచుకున్నారు. జాషువాతో పాటు జంధ్యాల పాపయ్యశాస్త్రి, అమరేంద్ర, ప్రసాదరాయ కులపతి వంటి మహాపం డితుల సహచర్యం ఆయనకు లభించింది. చిన్నవయస్సులోనే వారితో కవిసమ్మేళనాల్లో పాల్గొన్నారు.
విద్యార్థులపై చెరగని ముద్ర
చదువు పూర్తయ్యాక బెస్తవారిపేట క్రైస్తవ మిషనరీ కళాశాలలో సెకండరీగ్రేడ్ పూర్తిచేశారు కిరణశ్రీ. అనంతరం ద్వితీయశ్రేణి తెలుగు పండిట్‌గా 1973లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఓవైపు బోధిస్తూనే తాను విద్యార్ధిగా మారి డిగ్రీలను సాధించారు. ముప్పైమూడేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. తెలుగు నుడికారాలను, ఉచ్చారణ, పద్యపఠన, చందస్సులను బోధించడంలో ప్రతి విద్యార్థ్ధిపై తనదైన చెరగని ముద్రవేశారు. పదవీ విరమణ అనంతరం వెలుగు ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేశారు. 2012లో రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ తెలుగు అనువాదకునిగా అనేక జీవోలను తెలుగులోకి అనువదించారు.
విగ్రహం ఏర్పాటుకు పదేళ్లు!
నెల్లూరులో జాషువా కవితా పీఠాన్ని 1984లో ప్రారంభించారు కిరణశ్రీ. 2008లో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. పదేళ్లపాటు సుదీర్ఘ పోరాటంతో 2018 సెప్టెంబర్‌లో నెల్లూరు నగరంలో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్, కన్ఫెడరేషన్ అండ్ యునెస్కో క్లబ్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు, జాషువా కవితాపీఠం, అధికారభాషా సంఘం రాష్ట్ర, జాతీయ సంస్థల్లో అనేక కీలక పదవులను నిర్వహిస్తున్న సమయంలో కూడా జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన పలు అవరోధాలను అధిగమించాల్సి వచ్చిందన్నది నిజం.
పురస్కారాలు.. పుస్తకాలు
కిర ణశ్రీ రచించిన పలు పుస్తకాలను ప్రభుత్వం పాఠ్యగ్రంథాలుగా తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడో తరగతి విద్యార్థుల కోసం ‘అణిముత్యాలు’ అనే తెలుగు ఉపవాచక పుస్తకానికి గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. ఆయన రాసిన ‘పిచ్చివాడు’ అనే నాటకం సుమారు యాభై పరిషత్‌ల అవార్డులను అందుకుంది. ‘మడివేలు మాచయ్య’ పద్యనాటకం పండితుల ప్రశంసలు సైతం అందుకుంది. అనువాదకునిగా ఆయన ఎనభైకి పైగా గ్రం«థాలను తెలుగులోకి తెచ్చారు. తెలుగు భాషను సజీవంగా ఉంచాలని, విశిష్టమైన తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాలని నిర ంతరం కృషి చేస్తున్న కిరణశ్రీ వంటి వారి అడుగుజాడల్లో ఈతరం వారు నడవడం ఎంతైనా అవసరం.
– మౌంట్‌బాటన్, సాక్షి, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment