తెలుగును బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని టామ్స్ వ్యస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ పేర్కొన్నారు.
కొరుక్కుపేట: తెలుగును బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని టామ్స్ వ్యస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ పేర్కొన్నారు. నిర్బంధ తమిళ విద్యా చట్టంలో మార్పులు చేసి మాతృభాష తెలుగులో చదువుకునేందుకు ప్రభుత్వం సడలింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జనోదయం, టామ్స్ సంయుక్త ఆధ్వర్యంలో రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్‌టీఈ) -2009 గురించి ప్రత్యేక వర్క్‌షాప్‌ను శుక్రవారం నిర్వహించారు.
దీనికి స్థానిక నుంగంబాక్కంలోని స్టెర్లింగ్ రోడ్డులో ఉన్న బ్రదర్స్ హోలీగ్రాస్ హాలు వేదికైంది. జనోదయం ప్రాజెక్టు డెరైక్టర్, టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నైలోని డీపీఐ ఆవరణలో ఉన్న ఎస్‌సీఈఆర్‌టీ రీడర్ ఎన్ సత్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తి రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి అవగాహన తీసుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో పలురకాల పథ కాలను తీసుకొచ్చారని తెలిపారు.
అయితే ఆ పథకాల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో సద్వినియోగ పరుచుకోలేకపోతున్నార న్నారు. ఆరేళ్ల వయస్సు నుంచి 14 ఏళ్ల వారు ఉచితంగా విద్యను అభ్యసించేలా ఈ చట్టంలో ఉన్నాయని తెలిపారు.
గొల్లపల్లి ఇజ్రాయేల్ మట్లాడుతూ జనోదయం సంస్థ ద్వారా ఆది ఆంధ్రఅరుంధతీ ప్రజల పిల్లలంతా విద్యా వంతులు కావాలని లక్ష్యంతో రాత్రిపూట బడులు, ప్రత్యేక కోచింగ్ నిర్వహించడం చేపట్టామన్నారు. టామ్స్ ద్వారా పారిశుధ్య కార్మికుల పిల్లల విద్యకోసం పనిచేస్తుందని తెలిపారు.
టామ్స్ సంస్థ కృషి ఫలితంగా ఆది ఆంధ్రులకు మూడు శాతం రిజర్వేషన్ సాధించామని అన్నారు. రాష్ట్రంలో తెలుగుభాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందని, దీనిని తెలుగువారంతా ఐకమత్యంతో కృషి చేయాలని అన్నారు. నిర్బంధ తమిళ విద్యా చట్టంతో మాతృభాషను చదువుకోలేక పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తెలుగులో చదువుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. టామ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొలబంటి రవణయ్య స్వాగతోపన్యాసం చేస్తూ ఉద్యోగ సమాచారాన్ని విద్యార్థులకు వివరించారు. వందన సమర్పణను టీఎన్‌సీడబ్యూఎస్ జనరల్ సెక్రటరీ ఎల్ సుందరం చేశారు.
కార్యక్రమంలో గౌరవ అతిథిగా క్లాసికల్ నృత్యకారిణి కాదంబరితోపాటు టామ్స్ అధ్యక్షులు ఎన్.విజయకుమార్, జనోదయం ప్రాజెక్టు ఆఫీసర్ వి.శంకర్‌నారాయణన్, టామ్స్ దేవదానం, జేమ్స్, జయరాజ్, పాల్‌కొండయ్య, జయరామ్,ఆదామ్, నాగరత్నం, మాస్ సంస్థ జగ్గయ్య పాల్గొన్నారు.