సాక్షి, అమరావతి/హైదరాబాద్: ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్ చైతన్యపురిలోని తన గృహంలో శనివారం కన్నుమూశారు. తెలుగు అకాడమీ ఉప సంచాలకునిగా పనిచేసి 1993లో పదవీ విరమణ పొందిన దక్షిణామూర్తి అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘వెలుగు వెన్నెల గోదావరి’ నవలను ఉత్తరాంధ్ర, ‘ముత్యాల పందిరి’ నవలను తెలంగాణ, ‘రంగవల్లి’ నవలను రాయలసీమ మాండలికాల్లో రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సెయింట్’ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి ‘ఒక యోగి ఆత్మకథ’ పేరిట తెలుగులో అనువదించారు.
తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆయన కొండేపూడి సాహితీ సత్కారంతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. దక్షిణామూర్తి 1935 డిసెంబర్ 29న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరంతా చైతన్యపురి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన శనివారం రాత్రి 7.20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం వీవీ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.
సంతాపం ప్రకటించిన సీఎం జగన్
పోరంకి దక్షిణామూర్తి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసిన దక్షిణామూర్తి ఎన్నో ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్నారని, ఆయన అనువదించిన ‘ఒక యోగి ఆత్మకథ’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
తెలుగు భాషావేత్త పోరంకి దక్షిణామూర్తి కన్నుమూత
Published Sun, Feb 7 2021 5:15 AM | Last Updated on Sun, Feb 7 2021 8:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment