Linguists
-
సాహితీవేత్త కేకే రంగనాథాచార్యులు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సాహితీ విమర్శకులు, భాషావేత్త, చరిత్రకారులు ఆచార్య కేకే రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో తార్నాకలో కన్నుమూశారు. కొద్ది రోజులక్రితం ఆయన కరోనా బారిన పడ్డారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శనివారం మృతిచెందారని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య ఊర్మిళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శకులుగా పేరు పొందిన రంగనాథాచార్యులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాసాహిత్యాలు బోధించారు. తెలుగు, సంస్కృత భాషల్లో పలు పరిశోధనలు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలకు ప్రిన్సిపాల్గానూ పనిచేశారు. సాహిత్య విమర్శకులు మాత్రమే కాకుండా సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు కృషి చేశారు. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ల సన్నిహిత మిత్రుడిగా దిగంబర కవుల సంచలనానికి ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు కృషి చేశారు. 1970 జూలై 4వ తేదీన విరసం ఆవిర్భావ ప్రకటనపైన సంతకం చేసిన పద్నాలుగు మందిలో ‘రంగనాథం’అనే సంతకం ఆయనదే. రంగనాథాచార్యులు అనేక గ్రంథాలను రాశారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగులో తొలి సమాజ కవులు, తెలుగు సాహిత్య వికాసం, నూరేళ్ల తెలుగునాడు, రాచకొండ విశ్వనాథశాస్త్రి, తెలుగు సాహిత్యం మరో చూపు, తెలుగు సాహిత్యం వచన రచనా పరిచయం ఆయన కలంనుంచి వెలువడినవే. ఆయన మృతి పట్ల తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ రచయిత కోడం కుమార్ తదితరులు సంతాపం ప్రకటించారు. సీఎం కేసీఆర్ సంతాపం భాషా సాహితీవేత్త, విమర్శకులు ఆచార్య కేకే రంగనాథాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య వికాసానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు సాహిత్య వికాసానికి ఎనలేని సేవలు తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఆచార్య రంగనాథాచార్యులు మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పండితులుగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు, తెలుగు సాహిత్య వికాసానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. వారి కుటుంబానికి హరీశ్‌రావు, గోరటి వెంకన్న ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 57 ఏళ్ల స్నేహబంధం తెగిపోయింది రంగనాథాచార్యులు మరణంతో తమ 57 ఏళ్ల ఆత్మీ య స్నేహబంధం తెగిపోయిందని ప్రముఖ సాహితీవేత్త నిఖిలేశ్వర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు. సంస్కృతం, తెలుగు, హిందీ భాషాశాస్త్రాల్లో ఆయ న విద్వత్తు సాధించారని, దిగంబరకవులుగా ఆయ న తాత్విక సాహిత్యయాత్ర కొనసాగిందని తెలి పారు. విప్లవ, సాహిత్య, సామాజిక ఉద్యమాల్లో దశాబ్దాల పాటు వెంట నడిచిన సన్నిహిత మిత్రులు జ్వాలాముఖి మరణం తర్వాత తమకు ఇదే పెద్ద విషాదమని నిఖిలేశ్వర్ ఆవేదన వెలిబుచ్చారు. చదవండి: బ్లాక్ ఫంగస్‌తో అప్రమత్తం! -
దక్షిణామూర్తి కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్ చైతన్యపురిలోని తన గృహంలో శనివారం కన్నుమూశారు. తెలుగు అకాడమీ ఉప సంచాలకునిగా పనిచేసి 1993లో పదవీ విరమణ పొందిన దక్షిణామూర్తి అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘వెలుగు వెన్నెల గోదావరి’ నవలను ఉత్తరాంధ్ర, ‘ముత్యాల పందిరి’ నవలను తెలంగాణ, ‘రంగవల్లి’ నవలను రాయలసీమ మాండలికాల్లో రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సెయింట్’ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి ‘ఒక యోగి ఆత్మకథ’ పేరిట తెలుగులో అనువదించారు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆయన కొండేపూడి సాహితీ సత్కారంతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. దక్షిణామూర్తి 1935 డిసెంబర్ 29న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరంతా చైతన్యపురి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యం బారినపడిన ఆయన శనివారం రాత్రి 7.20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం వీవీ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. సంతాపం ప్రకటించిన సీఎం జగన్ పోరంకి దక్షిణామూర్తి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసిన దక్షిణామూర్తి ఎన్నో ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్నారని, ఆయన అనువదించిన ‘ఒక యోగి ఆత్మకథ’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
హింసాత్మక చర్యలకు పాల్పడకండి
అహ్మదాబాద్: హిందీ మాట్లాడే వలసదారుల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించామనీ, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన హిందీ భాషీయులు తిరిగి గుజరాత్‌కు రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞప్తి చేసింది. హిందీ మాట్లాడేవారిపై దాడులకు పాల్పడిన 431 మందిని ఇప్పటికే అరెస్టు చేశామంది. ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడొద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రజలను కోరారు. గుజరాత్లో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల అక్కడక్కడ జరిగిన దాడుల నేపథ్యంలో దాదాపు 20 వేల మంది హిందీ మాట్లాడే వలస కూలీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే గత 48 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని రూపానీ తెలిపారు. వలస కూలీల భద్రత కోసం పరిశ్రమల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా తెలిపారు. సెప్టెంబర్ 28న గుజరాత్‌లోని సాబర్కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం జరిగింది. రూపానీతో మాట్లాడిన నితీశ్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై జరుగుతున్న దాడుల విషయమై సీఎం విజయ్ రూపానీతో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మాట్లాడారు. ఈ దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడిని ఖండించారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, అయితే ఒక్కరు చేసిన తప్పునకు మొత్తం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడుల చేయడం సరికాదన్నారు. దాడుల గురించి గుజరాత్ సీఎంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి మాట్లాడారు. వారి భద్రతపై అక్కడి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చిందని యోగి చెప్పారు. -
తపాలా బిళ్ల ఉన్నట్టా లేనట్టా?
ప్రత్యేక సందర్భాల్లో ఇలా తపాలా బిళ్లలను ముద్రించటం సహజం. మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి ప్రపంచ తెలుగు మహాసభలను ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఈసారి తపాలా బిళ్లపై ఏ చిత్రాన్ని ఎంపిక చేసింది? భాగవతాన్ని తెలుగులో అమృతమయంగా మలిచిన పోతనదా, తెలంగాణ సంప్రదాయానికి చిహ్నంగా భాసిల్లుతున్న బతుకమ్మదా? త్వరలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కాబోతున్నా ఇప్పటి వరకు తపాలా శాఖకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదు. గతంలో బతుకమ్మ చిత్రాన్ని పోస్టల్ స్టాంపుగా తేవాలని తెలంగాణ భావించింది. ఇప్పుడు తెలుగు మహాసభలకు గుర్తుగా దాన్ని ప్రతిపాదిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ తెలుగు సాహితీ అభిమానులు మాత్రం బమ్మెర పోతన చిత్రంపై మక్కువ చూపుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోతన సమాధిని దర్శించి ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించిన నేపథ్యంలో తపాలా అధికారులు కూడా పోతన చిత్రాన్నే ఎంపిక చేస్తారని భావిస్తూ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించారు. కానీ అక్కడ్నుంచి వారికి ఎలాంటి స్పష్టత అందలేదు. దీంతో అసలు తపాలా బిళ్ల ముద్రణ ఉంటుందా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఏపీ, కర్ణాటక ప్రతిపాదనలతో తపాలా బిళ్లలు ఇటీవల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రతిపాదనలతో తపాలా శాఖ మూడు తపాలా బిళ్లలను ముద్రించింది. ఆదికవి నన్నయ, ద్రాక్షారామం భీమేశ్వరాలయం ప్రతిపాదనలను ఏపీ, మహాకవి ముద్దన ప్రతిపాదనను కర్ణాటక సమర్పించటంతో గత నవంబర్ ఒకటిన వాటిని తపాలా శాఖ ఆవిష్కరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురజాడ, కందుకూరి, కవయిత్రి మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ, తరిగొండ వెంగమాంబ లాంటి వైతాళికుల స్టాంపులు విడుదలయ్యాయి. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినవారి చిత్రాలతో రూపొందలేదు. మరి ఇప్పటి వరకు తెలంగాణ వైతాళికులతో తపాలాబిళ్లలు రూపొందించనందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదిస్తే బాగుంటుందని తెలంగాణ తెలుగు భాషాభిమానులు కోరుతున్నారు. –గౌరీభట్ల నరసింహమూర్తి ఇది తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్ల. 1975 ఉగాది రోజున హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో మొదలైన తెలుగు మహాసభల్లో లక్ష మంది భాషాభిమానుల సాక్షిగా నాటి ముఖ్యమంత్రి ఈ స్టాంపును ఆవిష్కరించారు. ‘దేశభాషలందు తెలుగు లెస్స... ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. పంచదార కన్న, పనస తొనలకన్న, కమ్మని తేనెకన్న తెలుగు మిన్న’ అని తెలుగు భాష వైభవాన్ని సూచించే వాక్యాల మధ్య సాక్షాత్కరించిన సరస్వతీదేవి రూపాన్ని ఈ తపాలా బిళ్లలో ముద్రించారు. అప్పట్లో 25 పైసల ధరతో ముద్రించిన ఈ స్టాంపులు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలుగువారు ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ తపాలాబిళ్లనే అతికించేందుకు ఇష్టపడటంతో మార్కెట్లో అప్పట్లో వాటికి కొరత ఏర్పడింది. -
కాలగర్భంలో 400 భాషలు!
తెలుగుకు ముప్పు లేదు భాషకు ముప్పొచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల భాషలు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచంలో మొత్తంగా 6000 భాషలున్నట్లు అంచనా. వాటిలో 2050 ఏడాదికల్లా 4000 భాషలు క్రమేపీ మూగబోయే ప్రమాదం ఉందని భాషాశాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వీటిలో పదిశాతం భారతీయ భాషలున్నాయి. ప్రస్తుతం దేశంలో 780 భాషలను మాట్లాడుతుండగా రాబోయే 35 ఏళ్లలో వాటిలో 400 వరకు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఒక పరిశీలన. భాషను కోల్పోవడమంటే పెద్ద ఎత్తున మానవ, సాంస్కృతిక పెట్టుబడిని కోల్పోయినట్టే. ఒక భాష పుట్టడానికి వేలాది ఏళ్లు పడుతుండగా, ఎంతో మానవ సంఘర్షణ తర్వాతే ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ విషయంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠి, కన్నడ, మలయాళం, గుజరాతి, పంజాబీ భాషలకు అటువంటి బెంగ ఏమీ లేదని, ఈ భాషలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉండడంతో ఈ జాబితాలోకి రావంటున్నారు. వీటిపై ఇంగ్లిష్ భాష ›ప్రభావమున్నా ఇవి క్షీణిస్తాయన్న భయం అవసరం లేదని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పీఎల్ఎస్ఐ) భరోసా ఇస్తోంది. ఈ సంస్థ 27 రాష్ట్రాల్లోని 780 భాషలపై 3000 మందితో అధ్యయనం నిర్వహించింది. ఈ ఏడాది చివరినాటికి సిక్కిం, గోవా, అండమాన్, నికోబార్‌లలోనూ పరిశీలన పూర్తి చేసే ఆలోచనతో ఉంది. ఈ పరిశోధనకు సంబంధించిన 11 సంపుటాలను ఇటీవల ఢిల్లీలో విడుదల చేసింది. తీరప్రాంత భాషలకే ఎక్కువ ముప్పు తీరప్రాంతాల్లో మాట్లాడుతున్న భాషలే ప్రమాదంలో ఉన్నాయని పీఎల్ఎస్ఐ చైర్మన్ గణేష్ ఎన్.దేవి చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి దొరకక సంప్రదాయ మత్స్యకార వర్గాలు తీరానికి దూరమవుతున్నాయి. అధునాతన జీవనశైలి అలవడి క్రమేణా తమ మాతృభాషను వదులుకోవాల్సి వస్తోంది’ అని ఆయన అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మాట్లాడే సంతాలి, గోండి, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లలోని భేలి, మిజోరాంలోని మిజో, మేఘాలయాలోని ఖాసి, త్రిపురలోని కోట్బారక్ భాషలు పుంజుకోవడం శుభపరిణామం. ఈ తెగల్లోని విద్యావంతులు భావ వ్యక్తీకరణకు, రచనలకు విరివిగా ఈ భాçషను ఉపయోగిస్తున్నారు. తమ భాషల్లోనే కవితలు, నాటకాలను రాసి ప్రదర్శిస్తుండడం, గోండి వంటి భాషల్లో సినిమాలను కూడా తీస్తుండడం కలిసివస్తోంది. చిత్రపరిశ్రమ పురోభివృద్ధితో భోజ్‌పురి దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న భాషగా నిలుస్తోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రెడ్ చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న భాషా పండితులు గ్రేడ్–2 ఉపాధ్యాయులపై వేతనంలోను, హోదాలోను వివక్ష కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆరోపించింది. పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్ చేయాలని కోరుతూ గురువారం కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఉన్నత పాఠశాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులే ఉండాలన్నారు. చేసే పనిలో తేడా లేకుండా హోదా, వేతనాలలో ఈ ఉపాధ్యాయులపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పండిట్, పీఈటీ పోస్టులకు వారితో సమానంగా వేతనాలను అందజేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పీఈటీ, పండిట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం జేసీ భారతీ హోలికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొండల్రావు, రవీందర్, సంజీవ, మల్లయ్య, దేవదాస్ పాల్గొన్నారు.