కాలగర్భంలో 400 భాషలు!
తెలుగుకు ముప్పు లేదు
భాషకు ముప్పొచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల భాషలు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచంలో మొత్తంగా 6000 భాషలున్నట్లు అంచనా. వాటిలో 2050 ఏడాదికల్లా 4000 భాషలు క్రమేపీ మూగబోయే ప్రమాదం ఉందని భాషాశాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వీటిలో పదిశాతం భారతీయ భాషలున్నాయి. ప్రస్తుతం దేశంలో 780 భాషలను మాట్లాడుతుండగా రాబోయే 35 ఏళ్లలో వాటిలో 400 వరకు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఒక పరిశీలన. భాషను కోల్పోవడమంటే పెద్ద ఎత్తున మానవ, సాంస్కృతిక పెట్టుబడిని కోల్పోయినట్టే. ఒక భాష పుట్టడానికి వేలాది ఏళ్లు పడుతుండగా, ఎంతో మానవ సంఘర్షణ తర్వాతే ఒక రూపాన్ని సంతరించుకుంటుంది.
ఈ విషయంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠి, కన్నడ, మలయాళం, గుజరాతి, పంజాబీ భాషలకు అటువంటి బెంగ ఏమీ లేదని, ఈ భాషలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉండడంతో ఈ జాబితాలోకి రావంటున్నారు. వీటిపై ఇంగ్లిష్ భాష ›ప్రభావమున్నా ఇవి క్షీణిస్తాయన్న భయం అవసరం లేదని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎస్‌ఐ) భరోసా ఇస్తోంది. ఈ సంస్థ 27 రాష్ట్రాల్లోని 780 భాషలపై 3000 మందితో అధ్యయనం నిర్వహించింది. ఈ ఏడాది చివరినాటికి సిక్కిం, గోవా, అండమాన్, నికోబార్‌లలోనూ పరిశీలన పూర్తి చేసే ఆలోచనతో ఉంది. ఈ పరిశోధనకు సంబంధించిన 11 సంపుటాలను ఇటీవల ఢిల్లీలో విడుదల చేసింది.
తీరప్రాంత భాషలకే ఎక్కువ ముప్పు
తీరప్రాంతాల్లో మాట్లాడుతున్న భాషలే ప్రమాదంలో ఉన్నాయని పీఎల్‌ఎస్‌ఐ చైర్మన్ గణేష్ ఎన్.దేవి చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి దొరకక సంప్రదాయ మత్స్యకార వర్గాలు తీరానికి దూరమవుతున్నాయి. అధునాతన జీవనశైలి అలవడి క్రమేణా తమ మాతృభాషను వదులుకోవాల్సి వస్తోంది’ అని ఆయన అంటున్నారు.
అయితే ఇటీవలి కాలంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మాట్లాడే సంతాలి, గోండి, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లలోని భేలి, మిజోరాంలోని మిజో, మేఘాలయాలోని ఖాసి, త్రిపురలోని కోట్‌బారక్ భాషలు పుంజుకోవడం శుభపరిణామం. ఈ తెగల్లోని విద్యావంతులు భావ వ్యక్తీకరణకు, రచనలకు విరివిగా ఈ భాçషను ఉపయోగిస్తున్నారు. తమ భాషల్లోనే కవితలు, నాటకాలను రాసి ప్రదర్శిస్తుండడం, గోండి వంటి భాషల్లో సినిమాలను కూడా తీస్తుండడం కలిసివస్తోంది. చిత్రపరిశ్రమ పురోభివృద్ధితో భోజ్‌పురి దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న భాషగా నిలుస్తోంది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్