
కారు చెరువులో బోల్తా పడిన ప్రదేశంలో తరచూ దుర్ఘటనలు
అసలే ఇరుకు రోడ్డు.. ప్రమాదకరంగా మలుపు.. ఆ పక్కనే చెరువు
ఇప్పటికైనా సరిదిద్దాలని గ్రామస్తుల డిమాండ్
భూదాన్ పోచంపల్లి: అసలే ఇరుకు రోడ్డు.. దానిపై ప్రమాదకరంగా మూల మలుపు.. దాని పక్కనే చెరువు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పురంలో శనివారం కారు చెరువులో బోల్తా కొట్టిన ప్రాంతం దుస్థితి ఇది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, పక్క నే చెరువు ఉన్నట్టు ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక, ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాహనాలు చెరువులోకి దూసుకెళ్లాయి. పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాహనాలతో నిత్యం రద్దీ ఉన్నా..
పోచంపల్లి పర్యాటక కేంద్రం, చేనేతకు ప్రసిద్ధికావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేవారు వస్తుంటారు. వాహనాల రద్దీ ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై జలాల్‌పురం చెరువు కట్ట వద్దకు రాగానే ఇరువైపులా పెద్ద మూల మలుపులు ఉన్నాయి. ఇరువైపులా చెట్లు, పొదలు పెరిగి, ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేంత వరకు సరిగా కనిపించవు. చెరువుకు రక్షణ గోడ కూడా లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి మూల మలుపుల సమీపంలో సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని... చెట్లు, పొదలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శనివారం ధర్నా కూడా చేశారు. చెరువు సమీపంలో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఎన్నో ప్రమాదాలు జరిగినా ఎవరికీ పట్టింపులేదని జలాల్‌పురం గ్రామానికి చెందిన పాలకూర్ల జంగయ్య మండిపడ్డారు.
చెరువులోకి దూసుకెళ్తున్న వాహనాలు
⇒ ఈ ఏడాది జూలై 17న ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
⇒2023 జూలై 24న చెరువు కట్టపై పండ్ల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ అనే యువకుడు మృతిచెందాడు.
⇒ 2020 జూలై 24న హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌కు చెందిన జింక వంశీ, తన స్నేహితులతో కలిసి పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని బంధువులకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తుండగా... ఇదే మలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. వంశీ మృతిచెందగా, మిగతావారు బయటపడ్డారు.
⇒ 2020 జూన్ 26న చెరువు కట్ట మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్ ఢీకొన్నాయి. కారు చెరువులోకి దూసుకెళ్లింది.
ఇక పదుల సంఖ్యలో ద్విచక్రవాహనలు అదుపుతప్పి చెరువులో పడి చాలా మంది గాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment