కుర్చీ వ్యాయామాలతో ఫిట్‌గా ఉండొచ్చు!
డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చునే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోతుంటుంది. చెయిర్‌లో కూర్చుని చేసే అనుకూలమైన వ్యాయామాలను సాధన చేయడం వల్ల పొట్ట భాగం ఫిట్‌గా అవుతుంది. దీంతో పాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు ఇవి...
సీటెడ్ లెగ్ లిఫ్ట్స్: కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలకు అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలును కూడా అదే విధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది.
చెయిర్‌కు ఉన్న హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్ల పాటు అదే పొజిషన్‌లో ఉంచాలి. దీని వల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది.
ఆబ్లిక్యూ ట్విస్ట్: చెయిర్‌లో నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది.
సీటెడ్ క్రంచెస్: చెయిర్ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్ మీద నుంచి కొద్దిగా అదే భంగిమలో పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది.
టో టచెస్: చెయిర్ మీద కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది.
సీటెడ్ బైస్కిల్ పెడల్స్: చెయిర్‌లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్ చూసుకొని, కాళ్లను సైకిల్ పెడల్ తొక్కినట్టుగా కదలికలు చేయాలి. ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు.
Comments
Please login to add a commentAdd a comment