sedentary lyfestyle
-
డెస్క్ జాబ్ చేస్తున్నారా, ప్రమాదం పొంచివుంది : ఈ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయండి!
డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చునే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోతుంటుంది. చెయిర్లో కూర్చుని చేసే అనుకూలమైన వ్యాయామాలను సాధన చేయడం వల్ల పొట్ట భాగం ఫిట్‌గా అవుతుంది. దీంతో పాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు ఇవి...సీటెడ్ లెగ్ లిఫ్ట్స్: కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలకు అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలును కూడా అదే విధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది. చెయిర్‌కు ఉన్న హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్ల పాటు అదే పొజిషన్లో ఉంచాలి. దీని వల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది. ఆబ్లిక్యూ ట్విస్ట్: చెయిర్లో నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. సీటెడ్ క్రంచెస్: చెయిర్ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్ మీద నుంచి కొద్దిగా అదే భంగిమలో పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది. టో టచెస్: చెయిర్ మీద కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది.సీటెడ్ బైస్కిల్ పెడల్స్: చెయిర్లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్ చూసుకొని, కాళ్లను సైకిల్ పెడల్ తొక్కినట్టుగా కదలికలు చేయాలి. ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు. -
అదేపనిగా టీవీ చూస్తే..
లండన్ : రోజులో అత్యధిక సమయం టీవీ చూస్తూ గడిపే వారి అకాల మరణానికి గురవడం లేదా క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు లేకుండా అధిక సమయం టీవీ ముందు, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు అస్వస్థతకు లోనవడం, జీవన శైలి కారణంగా మృత్యువాతన పడే ముప్పుందని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. స్క్రీన్ల ఎదుట గంటలకొద్దీ సమయం గడిపే వారు అకాల మరణానికి గురవుతారని, శారీరకంగా చురుకుగా ఉండేవారిలో ఈ ముప్పు తక్కువని తెలిపారు. జీవనశైలి సమస్యలతో బాధపడే వారికి అందించే చికిత్సలో తమ అథ్యయనంలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 3,90,000 మంది ప్రజల జీవనశైలిని విశ్లేషించిన పరిశోధకులు వీరిలో అత్యధికంగా టీవీ, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు ఊబకాయం, డయాబెటిస్, హైబీపీలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరిలో పొగతాగడం, అధిక కొవ్వు, ప్రాసెస్డ్ మాంసం తినడం వంటి అలవాట్లు పేరుకుపోయాయని కనుగొన్నారు. శారీరక కదలికలు లేకపోవడంతో వీరిలో క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదం పొంచిఉందని హెచ్చరించారు. శారీరకంగా ఫిట్‌గా ఉండి, చురుకుగా ఉన్న వారు అంతే సమయం టీవీ స్క్రీన్ల వద్ద గడిపినా ఎలాంటి దుష్ర్పభావాలు కనిపించలేదని అథ్యయనంలో గుర్తించారు. -
ఎక్కువ గంటలు కూర్చునే వారికి పెనుముప్పు
లండన్ : ఎక్కువ సేపు డెస్క్ పనుల్లో కుర్చీలో కూరుకుపోవడం, సోఫోకు అతుక్కుని టీవీ చూడటంలో నిమగ్నమవడం తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు తక్కువగా ఉన్నవారి మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసకునే ప్రదేశం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చిచెప్పారు. ఎక్కువ గంటలు కూర్చునే వారికి పెనుముప్పు తప్పదని అథ్యయనాన్ని చేపట్టిన లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు. బద్ధకంగా గడిపే వారికి గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల క్యాన్సర్లు వంటి జీవన శైలి వ్యాదులు ముంచుకొస్తాయని ఇప్పటికే వెల్లడవగా తాజా అథ్యయనం మరికొన్ని వ్యాధులూ చురుకైన జీవన శైలి లేని వారిని చుట్టుముడతాయని పేర్కొంది. వీరి మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకునే ప్రదేశం చిన్నగా ఉండటంతో అల్జీమర్, డిమెన్షియా వంటి వ్యాధులు ప్రబలవచ్చని తెలిపింది. అల్జీమర్ ముప్పు అధికంగా ఉన్న వారిలో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చురుకైన జీవనశైలిని అలవరుచుకోవడం కీలకమని బయోస్టాటిస్టీషియన్ డాక్టర్ ప్రభా సిద్ధార్ధ్ సూచించారు. -
రెండువారాలు అలా గడిపితే..
లండన్ : ఆధునిక సౌకర్యాలు మనిషి జీవితాన్ని సుఖమయం చేసినా అదే సమయంలో లేజీనెస్ పెరగడం మన శరీరాలను ఛిద్రం చేస్తోంది. రోజంతా డెస్క్‌కు అంకితమవడం, అదేపనిగా డ్రైవింగ్, వారాంతాల్లో సోఫాల్లో అతుక్కుపోవడం ఇలా ఓ రెండు వారాలు గడిచినా అనారోగ్యానికి దారితీస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. నిత్యం బద్ధకంతో గడిపితే కొన్నేళ్లలోనే శరీరం వ్యాధుల కుప్పగా మారుతుందని హెచ్చరించింది. దీర్ఘకాలంలో ఇది టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, స్ర్టోక్ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. అయితే చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ పరిస్థితిని నివారించవచ్చని చెబుతున్నారు. లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం, ఆన్లైన్ షాపింగ్‌కు ప్రత్యామ్నాయంగా సూపర్ మార్కెట్‌కు వెళ్లడం, రోజుకు అరగంట పాటు నడవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. శరీరాన్ని చురుకుగా ఉంచకపోతే భవిష్యత్ వ్యాధులకు పునాదులు వేసినట్టేనని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ డేనియల్ కూత్బెర్ట్స్న్ హెచ్చరించారు. ఆధునిక జీవితంతో సమాజం యాంత్రిక జీవనశైలిలో మగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కదలికలు లేని జీవనశైలి ప్రమాదకరమని..ఇది దీర్ఘకాలం కొనసాగితే శరీరం వ్యాధులకు నిలయమవుతుందన్నారు. -
చర్మకాంతి కోసం సహజ పద్ధతులు..
న్యూఢిల్లీః మీ చర్మం కాంతివంతంగా ఉండాలనుకుంటున్నారా? ముఖంలో అందం మరింత ఇనుమడించాలనుకుంటున్నారా? అయితే నిపుణుల సూచనలు పాటించాల్సిందే. శరీరంలో ఆరోగ్యం నశించినప్పుడు.. చర్మంపై ఎంతటి ఖరీదైన క్రీములు పూసినా ప్రయోజనం ఉండదంటున్నారు కాస్మెటిక్ అండ్ ఈస్తటిక్ నిపుణులు. సరైన జీవనశైలికి తోడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సహజసిద్ధమైన మార్గాలను పాటించడంతో ముఖంలో కాంతి పెరుగుతుందని చెప్తున్నారు. కాస్మెటిక్, ఈస్తటిక్ సర్జన్.. సీనియర్ కంన్సల్టెంట్ అనూప్ ధీర్.. చర్మసౌందర్యానికి కొన్ని సులభమైన చిట్కాలను అందించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, ముఖంలో కాంతి కనిపించాలన్నా కేవలం ఈ చిన్నపాటి జాగ్రత్తలను ఫాలో అయిపోతే చాలంటున్నారు. ఎప్పుడూ బద్ధకంగా కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం వంటివి చర్మం పొడిబారేందుకు, ముడుతలు, చారలు పడేందుకు దోహద పడతాయని, జీవన శైలిని నియమబద్ధంగా ఉంచుకోవడం ఎంతో అవసం అని అనూప్ చెప్తున్నారు. అలాగే రాత్రీ పగలూ తేడా లేకుండా చర్మానికి పూసే క్రీములను, నూనెతో వండిన, జంక్ ఫుడ్ తినడాన్నిమానుకుని.. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు తినడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చని చెప్తున్నారు. అలాగే మెరిసే చర్మానికి హైడ్రేషన్ ఎంతో అవసరమని, అందుకు నీటిని కూడా అధిక మొత్తంలో తాగడం అవసరమంటున్నారు. నీరు శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించి, చర్మంలోపల ఉండే టాక్సిన్ ను బయటకు పంపి, పోషకాలను చేర్చేందుకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చర్మకాంతికోసం వ్యాయామంలో తప్పనిసరిగా కార్డియోను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియో వర్కవుట్ ముఖానికి చేసే ఫేషియల్ వంటిదని, ఈ వ్యాయామంతో వచ్చే చెమట ద్వారా చర్మంలో చిక్కుకున్న నూనె, ధూళి వంటివి బయటకు వచ్చి, చర్మం కాంతివంతంగా మారుతుందని చెప్తున్నారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో టమోటా, ఆకుకూరలు, స్ట్రాబెర్రీ, చియా విత్తనాలతోపాటు పెరుగును జోడిస్తే మంచి ఫలితాలు పొందొచ్చన్నారు. అలాగే బ్యూటీపార్లర్లకు భారీగా డబ్బును వెచ్చించే బదులు.. ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వేసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. ఖరీదైన బ్రాండ్లు, ఫేస్ వాష్ లకు బదులుగా రోజ్ వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే చర్మం మరింత కాంతివంతంగా తయారౌతుందని అనూప్ ధీర్ సూచిస్తున్నారు.