చర్మకాంతి కోసం సహజ పద్ధతులు.. | Sakshi
Sakshi News home page

చర్మకాంతి కోసం సహజ పద్ధతులు..

Published Wed, Sep 14 2016 2:40 PM

Take natural route for glowing skin

న్యూఢిల్లీః మీ చర్మం కాంతివంతంగా ఉండాలనుకుంటున్నారా? ముఖంలో అందం మరింత ఇనుమడించాలనుకుంటున్నారా? అయితే నిపుణుల సూచనలు పాటించాల్సిందే. శరీరంలో ఆరోగ్యం నశించినప్పుడు.. చర్మంపై ఎంతటి ఖరీదైన క్రీములు పూసినా ప్రయోజనం ఉండదంటున్నారు  కాస్మెటిక్ అండ్ ఈస్తటిక్ నిపుణులు. సరైన జీవనశైలికి తోడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సహజసిద్ధమైన మార్గాలను పాటించడంతో ముఖంలో కాంతి పెరుగుతుందని చెప్తున్నారు.

కాస్మెటిక్, ఈస్తటిక్ సర్జన్.. సీనియర్ కంన్సల్టెంట్ అనూప్ ధీర్.. చర్మసౌందర్యానికి కొన్ని సులభమైన చిట్కాలను అందించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, ముఖంలో కాంతి కనిపించాలన్నా కేవలం ఈ చిన్నపాటి జాగ్రత్తలను ఫాలో అయిపోతే చాలంటున్నారు. ఎప్పుడూ బద్ధకంగా కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం వంటివి చర్మం పొడిబారేందుకు, ముడుతలు, చారలు పడేందుకు దోహద పడతాయని, జీవన శైలిని నియమబద్ధంగా ఉంచుకోవడం ఎంతో అవసం అని అనూప్ చెప్తున్నారు. అలాగే రాత్రీ పగలూ తేడా లేకుండా చర్మానికి పూసే క్రీములను, నూనెతో వండిన, జంక్ ఫుడ్ తినడాన్నిమానుకుని.. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు తినడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చని చెప్తున్నారు. అలాగే మెరిసే చర్మానికి హైడ్రేషన్ ఎంతో అవసరమని, అందుకు నీటిని కూడా అధిక మొత్తంలో తాగడం అవసరమంటున్నారు. నీరు శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించి, చర్మంలోపల ఉండే టాక్సిన్ ను బయటకు పంపి, పోషకాలను చేర్చేందుకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు.

ముఖ్యంగా చర్మకాంతికోసం వ్యాయామంలో తప్పనిసరిగా కార్డియోను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియో వర్కవుట్ ముఖానికి చేసే ఫేషియల్ వంటిదని, ఈ వ్యాయామంతో వచ్చే చెమట ద్వారా చర్మంలో చిక్కుకున్న నూనె, ధూళి వంటివి బయటకు వచ్చి, చర్మం కాంతివంతంగా మారుతుందని చెప్తున్నారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో టమోటా, ఆకుకూరలు, స్ట్రాబెర్రీ, చియా విత్తనాలతోపాటు పెరుగును జోడిస్తే మంచి ఫలితాలు పొందొచ్చన్నారు. అలాగే బ్యూటీపార్లర్లకు భారీగా డబ్బును వెచ్చించే బదులు.. ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వేసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. ఖరీదైన బ్రాండ్లు, ఫేస్ వాష్ లకు బదులుగా రోజ్ వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే చర్మం మరింత కాంతివంతంగా తయారౌతుందని అనూప్ ధీర్ సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement