అహ్మదాబాద్ నుంచి వెళ్లిపోతున్న యూపీ, బిహార్ వలస కార్మికులు
అహ్మదాబాద్: హిందీ మాట్లాడే వలసదారుల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించామనీ, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన హిందీ భాషీయులు తిరిగి గుజరాత్‌కు రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞప్తి చేసింది. హిందీ మాట్లాడేవారిపై దాడులకు పాల్పడిన 431 మందిని ఇప్పటికే అరెస్టు చేశామంది. ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడొద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రజలను కోరారు. గుజరాత్‌లో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల అక్కడక్కడ జరిగిన దాడుల నేపథ్యంలో దాదాపు 20 వేల మంది హిందీ మాట్లాడే వలస కూలీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే గత 48 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని రూపానీ తెలిపారు. వలస కూలీల భద్రత కోసం పరిశ్రమల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా తెలిపారు. సెప్టెంబర్ 28న గుజరాత్‌లోని సాబర్‌కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం జరిగింది.
రూపానీతో మాట్లాడిన నితీశ్
గుజరాత్‌లో హిందీ మాట్లాడేవారిపై జరుగుతున్న దాడుల విషయమై సీఎం విజయ్ రూపానీతో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మాట్లాడారు. ఈ దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడిని ఖండించారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, అయితే ఒక్కరు చేసిన తప్పునకు మొత్తం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడుల చేయడం సరికాదన్నారు. దాడుల గురించి గుజరాత్ సీఎంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి మాట్లాడారు. వారి భద్రతపై అక్కడి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చిందని యోగి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment