Migrates
-
ఒక్కరోజు ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు!
గంభీరావుపేట (సిరిసిల్ల): ఆ ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది. జనసమ్మర్ధంతో ఉండే ఊరు.. నిర్మానుష్యంగా మారింది. ఒక్కసారిగా ఊళ్లో నిశ్శబ్దం ఆవరించింది. కరోనా మహమ్మారి నుంచి ఊరును కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ జనం ఊరు వదిలి వనంబాట పట్టారు. ముందు ఊరంతా కలసి గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి భోజనాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు వివరాలిలా ఉన్నాయి.. లింగన్నపేటలో సుమారు ఆరు వేల జనాభా ఉంటుంది. 1,400 నివాసాలు ఉంటాయి. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుతూ గ్రామదేవతలకు పూజలు చేద్దామని, ఒకరోజంతా ఊరు వదిలి అడవుల్లోకి వెళ్లాలని అన్ని కుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అందరి సమ్మతం మేరకు ఆదివారం దానిని అమలు చేశారు. దీనికి ముందు రెండురోజులుగా ఊళ్లోని ప్రతీవీధి, రహదారిని శుభ్రం చేశారు. అలాగే తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఊర్లోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన గ్రామదేవతల ప్రతిమలకు అంతా కలసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, రోగాలు దరిచేరకుండా కాపాడాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని దేవతలను వేడుకున్నారు. అనంతరం ఉదయం ప్రతీ ఇంటి నుంచి అందరూ ఆహార సామగ్రి, ఇతర వస్తువులు పట్టుకొని పొలాలు, అడవుల్లోకి పయనమయ్యారు. ఎవరికి వారుగా అక్కడ వంటలు చేసుకొని భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత మళ్లీ గ్రామంలోకి అడుగుపెట్టారు. లింగన్నపేట వాసులు చేసిన ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. -
భారత్ నుంచి పెరుగుతున్న వలసలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశం దినదినం పురోభివద్ధి చెందుతోందని మన రాజకీయ నాయకులు ఉదరగొడుతున్నప్పటికీ రోజురోజుకు మన దేశం నుంచి విదేశాలకు వలసలు పెరుగుతూనే ఉన్నాయి. అలా వలసపోయిన వారి సంఖ్య 1990లో 66 లక్షలు ఉండగా, అది 2019 సంవత్సరం నాటికి 175 లక్షలకు చేరుకుంది. ఈ డేటాను ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడిదుల చేసింది. మొత్తం అంతర్జాతీయంగా 2, 720 లక్షల మంది విదేశాలకు వలసపోతుండగా వారిలో 175 లక్షల మంది భారతీయులు ఉన్నారని, అయితే భారతీయులు వలసపోతున్న దేశాలు గత 30 ఏళ్లుగా గణనీయంగా మారుతూ వస్తున్నాయని డేటా వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అదే విదేశాల నుంచి భారత్‌కు వలసలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అక్రమ వలసలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే చట్టబద్ధంగా భారత్‌లో శరణార్థులుగా ఆశ్రయం కోరుతున్న వారి సంఖ్య గత 30 ఏళ్లలో స్థిరంగా రెండు లక్షలే ఉంటోంది. భారత్‌కు వలసవస్తున్న వారి సంఖ్య 1990లో భారత జనాభాలో 0.9 శాతం ఉండగా, ప్రస్తుతానికి అది దేశ జనాభాలో 0.4 శాతానికి తగ్గింది. మరోపక్క ప్రపంచ జానాభాలో ప్రపంచ వలసల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2000 సంవత్సరంలో ప్రపంచ జనాభాలో ప్రపంచ వలసల సంఖ్య 2.8 శాతం ఉండగా, అది ప్రస్తుతానికి 3.5 శాతానికి చేరుకుంది. ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది అమెరికాకు వెళుతుండగా, ఆ తర్వాత జర్మనీ, సౌదీ అరేబియాకు ఎక్కువ మంది వలస పోతున్నారు. ఇక విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న వారిలో బంగ్లాదేశీయులు ప్రథమ స్థానంలో ఉండగా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, చైనా దేశీయులు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. -
అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు. అమెరికాకు వలస రావాలనుకునేవారు వారెవరైనా ఇకపై ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందేనన్నారు. అంతేకాదు అమెరికా చరిత్ర, సమాజం గురించిన ప్రాథమిక వాస్తవాలను కూడా తెలుసుకోవాలి. అమెరికా వలస విధానాన్ని తిరగరాసి కొత్త రూపు ఇచ్చేందుకు ఉద్దేశించిన సంస్కరణల ప్రతిపాదనల్లో ఈ అంశాలను పొందుపరిచినట్లు ట్రంప్ ప్రకటించారు. అడ్మిషన్‌కు ముందు దరఖాస్తుదారులు పౌరశాస్త్ర (సివిక్స్) పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా స్కిల్డ్ వర్కర్ల కోటా పెరిగేలా ప్రతిపాదనలు రూపొందించారు. స్కిల్డ్ వర్కర్ల వలసను 12 నుంచి 57 శాతానికి పెంచడం తాము చేస్తున్న పెద్ద మార్పు అని ట్రంప్ చెప్పారు. అయితే వీరంతా ప్రతిభ, నైపుణ్యం ఆధారంగానే రావలసి ఉంటుందని గురువారం వైట్‌హౌస్‌లో ఆయన వివరించారు. -
హింసాత్మక చర్యలకు పాల్పడకండి
అహ్మదాబాద్: హిందీ మాట్లాడే వలసదారుల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించామనీ, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన హిందీ భాషీయులు తిరిగి గుజరాత్‌కు రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞప్తి చేసింది. హిందీ మాట్లాడేవారిపై దాడులకు పాల్పడిన 431 మందిని ఇప్పటికే అరెస్టు చేశామంది. ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడొద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రజలను కోరారు. గుజరాత్లో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల అక్కడక్కడ జరిగిన దాడుల నేపథ్యంలో దాదాపు 20 వేల మంది హిందీ మాట్లాడే వలస కూలీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే గత 48 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని రూపానీ తెలిపారు. వలస కూలీల భద్రత కోసం పరిశ్రమల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా తెలిపారు. సెప్టెంబర్ 28న గుజరాత్‌లోని సాబర్కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం జరిగింది. రూపానీతో మాట్లాడిన నితీశ్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై జరుగుతున్న దాడుల విషయమై సీఎం విజయ్ రూపానీతో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మాట్లాడారు. ఈ దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడిని ఖండించారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, అయితే ఒక్కరు చేసిన తప్పునకు మొత్తం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడుల చేయడం సరికాదన్నారు. దాడుల గురించి గుజరాత్ సీఎంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి మాట్లాడారు. వారి భద్రతపై అక్కడి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చిందని యోగి చెప్పారు. -
గుజరాత్ విడిచి వెళ్తున్న వలస కార్మికులు
-
ప్రాంతీయ చిచ్చు.. స్థానికేతరులపై దాడులు
గాంధీనగర్ : అల్లర్లకు గుజరాత్ మరోసారి వేదికైంది. ఇతర రాష్ట్రాల నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చి గుజరాత్లో ఉపాధి పొందుతున్న వారిపై స్థానికుల దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి చాలా మంది ఉపాధి కోసం వచ్చి అహ్మదాబాద్, సూరత్, గాంధీనగర్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిపై గతవారం రోజులుగా గుజరాతీయులు మూకుమ్మడిగా దాడికి దిగుతున్నారు. వారి వేధింపులను తట్టుకోలేక చాలా మంది సొంత గ్రామాలకు తిరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడిన 350మందిని పోలీసులు అరెస్ట్ చేసి.. ప్రమాదకరమైన ఏడు జిల్లాల్లో సిబ్బందిని మోహరించారు. దాడులకు అసలు కారణం.. గుజరాత్లో ఇటీవల ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బిహార్, యూపీ నుంచి వచ్చిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ మహిళలపై అత్యాచారాలకు దిగుతున్న వారు ఇక్కడ ఉండడానికి వీళ్లేదని.. వారందరిని ఇక్కడి నుంచి తరిమికొట్టాలని కొంతమంది గుజరాతీ యువకులు నిర్ణయించుకున్నారు. దీని కోసం సోషల్ మీడియాతో ప్రేత్యేక గ్రూప్‌ను తయారుచేసుకుని దాడులకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించారు. దీంతో గతవారం రోజులకు స్థానికేతరులపై దాడులకు దిగుతూ.. తమ రాష్ట్రం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తమపై గుజరాతీయులు దాడులకు పాల్పడుతున్నారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 42 ఫిర్యాదు అందాయని.. దాడులకు పాల్పడిన 350 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వారు పండగలకు సొంత గ్రామాల వెళ్తున్నారని, తాము ఎవ్వరిపై దాడులకు పాల్పడలేదంటూ అరెస్ట్ అయిన వారు చెపుతున్నారు. -
ఊరు ఖాళీ!
నాగిరెడ్డిపేట: కరువు ప్రభావంతో చెరువులు, పంట పొలాలే కాదు.. ఊళ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వర్షాభావం, అడుగంటిన భూ గర్భ జలాలు, ఎండిన ప్రాజెక్టులు.. వెరసి సాగునే నమ్ముకున్న పల్లెలు వలస పోతున్నాయి. పని కోసం పట్నానికి తరలి వెళ్తున్నాయి. రెండేళ్లుగా వానల్లేక రైతు బతుకు బరువైంది. ఇన్నేళ్లు ఆధారంగా ఉన్న సాగు భారమైంది. ఉపాధి ‘కరువైం ది’. దీంతో పని కోసం వలస పోవడం తప్పనిసరైంది. మూట ముల్లె సర్దుకొని భార్య, పిల్లలతో పట్నం బాట పట్టారు నాగిరెడ్డిపేట గ్రామస్తు లు. తీవ్ర కరువు నేపథ్యంలో ఊరు దాదాపు ఖా ళీ అయింది. ఏ వీధికెళ్లినా కొన్నిళ్లకు తాళాలు కనిపిస్తుంటే, వృద్ధులు కాపలాగా ఉన్న ఇళ్లు కొ న్ని దర్శనిస్తున్నాయి. నాగిరెడ్డిపేట గ్రామంలో సుమారు 1,100 కుటుంబాలుండగా, సగం కుటుంబాలు వలస వెళ్లాయి. కాలువ, చెరువుల కింద వ్యవసాయ భూములున్నప్పటికీ కరువు కారణంగా చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. వేసిన పంటలు ఎండిపోయాయి. పంటల సాగుకు వెచ్చించిన పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తప్పనిసరై పొట్టచేత బట్టుకొని హైద్రాబాద్, ఆర్మూర్ ప్రాంతాలకు వలస వెళ్లారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లగా.. మరికొందరు వృద్ధాప్యంలో ఉన్న తల్ల్లిదండ్రులను ఇంటికి కాపలాగా ఉంచి వెళ్లారు. చిన్నపిల్లలను, వృద్ధులను ఇంటి వద్దనే ఉంచి భార్య, భర్త మాత్రమే వెళ్లిన వారున్నారు. అయితే, హైదరాబాద్‌లో వలసవాదుల తాకిడి ఎక్కువ కావడం, సరైన పని దొరకక పోవడంతో కొంత మంది తిరిగి వస్తున్నారు. వారంలో 3-4 రోజులకు మించి పని దోరకడం లేదని, దొరికిన పనితో వచ్చిన రుక్కం పట్నంలో ఖర్చులకు సరిపోక తిరిగి వచ్చేశామని వలస వెళ్లొచ్చిన వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు నాగిరెడ్డిపేటకు చెందిన మ్యాకల సాయిలుది. ఆయన కుటుంబం రెండేళ్ల క్రితం వలస వెళ్లడంతో ఊడ్చేవారు సైతం లేక ఇల్లు, వాకిలి చిన్నబోయింది. సాయిలుకు ఉన్న కొద్దిపాటి భూమి కరువు కారణంగా రెండేళ్లుగా పడావుగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో సుమారు ఇల్లు, జాగా వదిలి భార్య, కొడుకు, కూతురుతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. కుటుంబ సభ్యులందరూ అక్కడే పని చేసుకుంటూ బతుకుతున్నారు. పండగలకు ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఈ వృద్ధురాలి పేరు ఎరుపుల అనసూయ. గ్రామం నాగిరెడ్డిపేట. ఈమెకు కొడుకు గోపాల్, కోడలు మమత, కూతురు నిర్మల ఉన్నారు. వీరికి కొద్దిపాటి భూమి కూడా ఉంది. కానీ రెండేళ్లుగా వర్షాలు కురవక సాగు చేయలేదు. దీంతో అనసూయ కొడుకు, కోడలు, కూతురు ఆర్నెళ్ల కిత్రం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అక్కడి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న అనసూయకు వితంతు పింఛన్ రావడం లేదు. వలస వెళ్లిన కొడుకు, కోడలు, కూతురు అప్పుడప్పుడూ పంపుతున్న డబ్బులతోనే నెట్టుకొస్తుంది. పని దొరకక వచ్చేశాం.. కుటుంబ సభ్యులంద రం కలిసి సుమారు మూడేళ్ల క్రితం షాపూర్‌కు వలస వెళ్లాం. కొ న్నిరోజులుగా హైద్రాబాద్‌కు చాలా మంది బతకడానికి రావడంతో మాకు పని దొరకడం కష్టమయింది. వారంలో మూడు రోజులే పని దొరుకుతుంది. దీంతో చేసేదేమి లేక ఇంటికి వచ్చేశాం. ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని బతుకుదామనుకుంటున్నాం. - రుక్కవ్వ, నాగిరెడ్డిపేట మస్తు తిప్పలైతుంది ఊర్లే సరైన పనిలేక, పంటలు పండక మేమందరం ఏడాది కింద పట్నంకు వలస పోయినం. అక్కడ వారానికి 4 రోజులకు మించి పని దొరకడం లేదు. మేస్త్రీ చేతి కింద పనికి వెళితే రోజుకు రూ.200-250ఇస్తున్నారు. పట్నంలో బతకడానికి ఆ డబ్బులు సరిపోక ఇంటికి చేరుకున్నాం. - చంద్రకళ, నాగిరెడ్డిపేట అయ్య, అవ్వలను సూడనికొచ్చిన... కాలం కాకపోవడంతో పాటు ఊర్లే పని దొరకక తప్పనిసరై పట్నం పోయినం. ఇంటికాడ అయ్య, అవ్వను కాపాలాగా ఉంచి నా భార్య, పిల్లలతో రెండేళ్ల కింద హైద్రాబాద్ వెళ్లా. నెలకోమారు ఇంటి కి వచ్చి మా అయ్య, అవ్వను సూశిపోతున్నా. పట్నంల ఎంత పనిచేసినా పైస మిగుల్తలేదు. కానీ పని కోసం తప్పనిసరై పట్నం బాట వట్టినం. - తెనుగు రమేశ్, నాగిరెడ్డిపేట -
వలస జీవితాలంటే అలుసా!
వలసలు, అవి సృష్టిస్తున్న సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడనాడటం లేదు. వలస కార్మికుల దుర్భర స్థితిగతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఆదేశించి ఏడాదిన్నర దాటుతున్నా ఏమాత్రం కదలిక ప్రదర్శించని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలపై నాలుగు రోజుల క్రితం అందుకే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఉన్న ఊళ్లో బతుకు తెరువు కరువై జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్తున్న వలస కార్మికులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు పరారు కావడానికి ప్రయత్నించారన్న ఆగ్రహంతో కాంట్రాక్టర్లు 2013 డిసెంబర్లో వారి చేతులను నరికిన ఉదంతంపై మీడియాలో వెలువడిన వార్తలను సుమోటోగా తీసుకుని అప్పట్లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వారి స్థితిగతుల మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, ఈ మాదిరి ఉదంతాలు భవిష్యత్తులో జరగకుండా ఏమి చేయదల్చుకున్నారో చెప్పాలని కోరింది. అయితే ప్రభుత్వాలు ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ‘సరైన రీతి’లో అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. దాదాపు 40 కోట్లమంది జనం దేశంలో ఒకచోటు నుంచి మరో చోటుకు వలస పోతున్నారని 2011 జనాభా గణాంకాలు వెల్లడించాయి. ఇది ఇప్పుడు మరింత పెరిగి ఉంటుంది. అంటే జనాభాలో మూడో వంతు మంది వలస జీవితాలు గడుపుతున్నారు. ఇందులో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లోని బక్క రైతులు, రైతు కూలీలే! సాగులో వస్తున్న నష్టాలను తట్టుకోలేక, తీసుకున్న ప్రైవేటు రుణాలు తీర్చలేక గత్యంతరం లేని స్థితిలో రైతులు వెట్టి చాకిరీకి సిద్ధపడుతుంటే, కూలి పనులు దొరక్క రైతు కూలీలు వలస పోతున్నారు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని కాంట్రాక్టర్లు వారికి అరచేతిలో వైకుంఠాన్ని చూపుతారు. ఎంతో కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇస్తారు. ఈ వ్యవహారంలో ఎలాంటి ఒప్పందాలు, కాగితాలు ఉండవు. ఆ తర్వాత అడుగడుగునా వారికి నరకమే కనిపిస్తుంది. వలసపోయేవారితోపాటు ఉండే పిల్లల సంఖ్య కోటిన్నర పైమాటేనని యునిసెఫ్ నివేదిక చెబుతోంది. ఆ కుటుంబాలకు రేషన్ కార్డు ఉండదు కనుక దాని ద్వారా లభించే అరకొర సదుపాయాలైనా అందుబాటులో ఉండవు. ఓటర్లుగా గుర్తింపు ఉండదు కనుక వారిని పట్టించుకునే పార్టీలుండవు. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లడం సాధ్యపడదు. కాంట్రాక్టర్ కల్పించే అరకొర వైద్య సదుపాయమే దిక్కు. ఊరికి దూరంగా ఉండి పనిచేయాలి కనుక వారి పిల్లలకు చదువుసంధ్యలుండవు. సరిహద్దులు దాటి వేరే దేశాలకు వెళ్లేవారికి సమకూరేపాటి రక్షణ అయినా ఈ వలస కార్మికులకు ఉండదు. వారికి నిత్యం ఛీత్కారాలే ఎదురవుతాయి. మహిళా కార్మికులైతే అదనంగా లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. పని మనుషులుగా, వాచ్మన్లుగా, రిక్షా కార్మికులుగా, ముఠా కార్మికులుగా, నిర్మాణ పనుల్లో, క్వారీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి శ్రమ దోపిడీతోనే మహా నగరాలు నిత్యం వెలిగిపోతుంటాయి. ఇలాంటివారి విషయంలో ప్రభుత్వాలన్నీ శ్రద్ధ వహించి, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని యునిసెఫ్ సంస్థ రెండేళ్లక్రితం ఇచ్చిన నివేదికలో హితవు పలికింది. కానీ ఆ విషయంలో తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటుక బట్టీల్లో పనిచేసేవారి బతుకులు అత్యంత దుర్భరం. వారికి నిర్దిష్టమైన పనిగంటలుండవు. బంక మన్నులో, బురదలో పనిచేయాల్సి ఉంటుంది గనుక చెప్పులు ధరించడం సాధ్యంకాదు. దాదాపు 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఫర్నేస్‌ల దగ్గర ఉండాల్సివస్తుంది. కనీస వేతనాల చట్టంగానీ, ఇతర కార్మిక చట్టాలుగానీ వారి దరిదాపులకు కూడా రావు. మహిళా కూలీలకు రోజుకు రూ.10 నుంచి రూ.12 లభిస్తే... మగ కూలీలకు రూ.15 నుంచి రూ.20 వరకూ దక్కుతుంది. ఇలాంటి పని పరిస్థితుల్ని తట్టుకోలేక పరారవడానికి ప్రయత్నించినందుకే రెండేళ్లక్రితం ఒడిశాకు చెందిన కార్మికులిద్దరికీ కాంట్రాక్టర్లు కుడి చేతులు నరికారు. వలసపోయే కార్మికులు రెండు నెలలనుంచి ఏడాది వరకూ కాంట్రాక్టర్ల దగ్గర ఉండాల్సి వస్తుంటుంది. ఇలా వెళ్లేవారిలో అనివార్యంగానే అత్యధికులు ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు. వలస కార్మికుల కోసమని 1979లో చట్టం తీసుకొచ్చినా దాని అమలుకు ఎవరూ శ్రద్ధ పెట్టరు. సంఘటిత రంగంలోని కార్మికులకైతే కనీసం ఏదో మేరకు సంఘాలుంటాయి. నిలదీస్తాయి. వలస కార్మికులకు అలాంటి అవకాశం కూడా ఉండదు. అక్కడక్కడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వలస కార్మికుల పని పరిస్థితుల గురించి ఆరా తీసి, వారి హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆ కార్మికుల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలపై దృష్టి పెడుతున్నాయి. కానీ వలస కార్మికుల సంఖ్యతో పోలిస్తే ఈ సంస్థల సేవలు ఏమూలకూ సరిపోవు. ప్రభుత్వాలకు ఎటూ తోచడం లేదు. కనీసం సుప్రీంకోర్టు దృష్టి పెట్టి నిలదీశాక అయినా శ్రద్ధగా పనిచేయాలన్న ఉద్దేశం కలగడం లేదు. కనుకనే వలస కార్మికుల జీవితాలను ప్రభుత్వాలు ధూళికన్నా హీనంగా చూస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను ఇప్పటికైనా ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోనట్టయితే వాటి చేతగానితనాన్ని తామే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇన్ని చీవాట్లు తిన్నాకైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ మేల్కొనాలి. సర్వోన్నత న్యాయస్థానం కోరిన విధంగా వలస కార్మికుల కోసం సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వారి రక్షణకు చర్యలు తీసుకోవాలి. పల్లె సీమల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, ఉపాధి హామీ పథకం వంటివి సమర్థవంతంగా అమలు చేయడంవంటి చర్యల ద్వారా వలసలను అరికట్టడానికి కృషి చేయాలి.