వలస జీవితాలంటే అలుసా! | Why don't care about migrants | Sakshi
Sakshi News home page

వలస జీవితాలంటే అలుసా!

Published Thu, Sep 24 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

Why don't care about migrants

వలసలు, అవి సృష్టిస్తున్న సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడనాడటం లేదు. వలస కార్మికుల దుర్భర స్థితిగతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఆదేశించి ఏడాదిన్నర దాటుతున్నా ఏమాత్రం కదలిక ప్రదర్శించని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలపై నాలుగు రోజుల క్రితం అందుకే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఉన్న ఊళ్లో బతుకు తెరువు కరువై జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్తున్న వలస కార్మికులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు పరారు కావడానికి ప్రయత్నించారన్న ఆగ్రహంతో కాంట్రాక్టర్‌లు 2013 డిసెంబర్‌లో వారి చేతులను నరికిన ఉదంతంపై మీడియాలో వెలువడిన వార్తలను సుమోటోగా తీసుకుని అప్పట్లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వారి స్థితిగతుల మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, ఈ మాదిరి ఉదంతాలు భవిష్యత్తులో జరగకుండా ఏమి చేయదల్చుకున్నారో చెప్పాలని కోరింది. అయితే ప్రభుత్వాలు ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ‘సరైన రీతి’లో అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది.
 
  దాదాపు 40 కోట్లమంది జనం దేశంలో ఒకచోటు నుంచి మరో చోటుకు వలస పోతున్నారని 2011 జనాభా గణాంకాలు వెల్లడించాయి. ఇది ఇప్పుడు మరింత పెరిగి ఉంటుంది. అంటే జనాభాలో మూడో వంతు మంది వలస జీవితాలు గడుపుతున్నారు. ఇందులో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లోని బక్క రైతులు, రైతు కూలీలే! సాగులో వస్తున్న నష్టాలను తట్టుకోలేక, తీసుకున్న ప్రైవేటు రుణాలు తీర్చలేక గత్యంతరం లేని స్థితిలో రైతులు వెట్టి చాకిరీకి సిద్ధపడుతుంటే, కూలి పనులు దొరక్క రైతు కూలీలు వలస పోతున్నారు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని కాంట్రాక్టర్లు వారికి అరచేతిలో వైకుంఠాన్ని చూపుతారు. ఎంతో కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇస్తారు. ఈ వ్యవహారంలో ఎలాంటి ఒప్పందాలు, కాగితాలు ఉండవు. ఆ తర్వాత అడుగడుగునా వారికి నరకమే కనిపిస్తుంది. వలసపోయేవారితోపాటు ఉండే పిల్లల సంఖ్య కోటిన్నర పైమాటేనని యునిసెఫ్ నివేదిక చెబుతోంది.
 
 ఆ కుటుంబాలకు రేషన్ కార్డు ఉండదు కనుక దాని ద్వారా లభించే అరకొర సదుపాయాలైనా అందుబాటులో ఉండవు. ఓటర్లుగా గుర్తింపు ఉండదు కనుక వారిని పట్టించుకునే పార్టీలుండవు. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లడం సాధ్యపడదు. కాంట్రాక్టర్ కల్పించే అరకొర వైద్య సదుపాయమే దిక్కు. ఊరికి దూరంగా ఉండి పనిచేయాలి కనుక వారి పిల్లలకు చదువుసంధ్యలుండవు. సరిహద్దులు దాటి వేరే దేశాలకు వెళ్లేవారికి సమకూరేపాటి రక్షణ అయినా ఈ వలస కార్మికులకు ఉండదు. వారికి నిత్యం ఛీత్కారాలే ఎదురవుతాయి. మహిళా కార్మికులైతే అదనంగా లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. పని మనుషులుగా, వాచ్‌మన్‌లుగా, రిక్షా కార్మికులుగా, ముఠా కార్మికులుగా, నిర్మాణ పనుల్లో, క్వారీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి శ్రమ దోపిడీతోనే మహా నగరాలు నిత్యం వెలిగిపోతుంటాయి. ఇలాంటివారి విషయంలో ప్రభుత్వాలన్నీ శ్రద్ధ వహించి, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని యునిసెఫ్ సంస్థ రెండేళ్లక్రితం ఇచ్చిన నివేదికలో హితవు పలికింది. కానీ ఆ విషయంలో తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
 
  ఇటుక బట్టీల్లో పనిచేసేవారి బతుకులు అత్యంత దుర్భరం. వారికి నిర్దిష్టమైన పనిగంటలుండవు. బంక మన్నులో, బురదలో పనిచేయాల్సి ఉంటుంది గనుక చెప్పులు ధరించడం సాధ్యంకాదు. దాదాపు 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఫర్నేస్‌ల దగ్గర ఉండాల్సివస్తుంది. కనీస వేతనాల చట్టంగానీ, ఇతర కార్మిక చట్టాలుగానీ వారి దరిదాపులకు కూడా రావు. మహిళా కూలీలకు రోజుకు రూ.10 నుంచి రూ.12 లభిస్తే... మగ కూలీలకు రూ.15 నుంచి రూ.20 వరకూ దక్కుతుంది. ఇలాంటి పని పరిస్థితుల్ని తట్టుకోలేక పరారవడానికి ప్రయత్నించినందుకే రెండేళ్లక్రితం ఒడిశాకు చెందిన కార్మికులిద్దరికీ కాంట్రాక్టర్లు కుడి చేతులు నరికారు.
 
 వలసపోయే కార్మికులు రెండు నెలలనుంచి ఏడాది వరకూ కాంట్రాక్టర్ల దగ్గర ఉండాల్సి వస్తుంటుంది. ఇలా వెళ్లేవారిలో అనివార్యంగానే అత్యధికులు ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు. వలస కార్మికుల కోసమని 1979లో చట్టం తీసుకొచ్చినా దాని అమలుకు ఎవరూ శ్రద్ధ పెట్టరు. సంఘటిత రంగంలోని కార్మికులకైతే కనీసం ఏదో మేరకు సంఘాలుంటాయి. నిలదీస్తాయి. వలస కార్మికులకు అలాంటి అవకాశం కూడా ఉండదు. అక్కడక్కడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వలస కార్మికుల పని పరిస్థితుల గురించి ఆరా తీసి, వారి హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆ కార్మికుల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలపై దృష్టి పెడుతున్నాయి. కానీ వలస కార్మికుల సంఖ్యతో పోలిస్తే ఈ సంస్థల సేవలు ఏమూలకూ సరిపోవు.
 
 ప్రభుత్వాలకు ఎటూ తోచడం లేదు. కనీసం సుప్రీంకోర్టు దృష్టి పెట్టి నిలదీశాక అయినా శ్రద్ధగా పనిచేయాలన్న ఉద్దేశం కలగడం లేదు. కనుకనే వలస కార్మికుల జీవితాలను ప్రభుత్వాలు ధూళికన్నా హీనంగా చూస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను ఇప్పటికైనా ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోనట్టయితే వాటి చేతగానితనాన్ని తామే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇన్ని చీవాట్లు తిన్నాకైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ మేల్కొనాలి. సర్వోన్నత న్యాయస్థానం కోరిన విధంగా వలస కార్మికుల కోసం సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వారి రక్షణకు చర్యలు తీసుకోవాలి. పల్లె సీమల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, ఉపాధి హామీ పథకం వంటివి సమర్థవంతంగా అమలు చేయడంవంటి చర్యల ద్వారా వలసలను అరికట్టడానికి కృషి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement