Migrates workers
-
వలసలపై డేటా భేష్!
దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికెళ్లే వలస కార్మికులు, ఇతరుల డేటా రూపొందించడానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సంకల్పించడం మంచి పరిణామం. ఈ డేటా రూప కల్పన కోసం ఇతర మంత్రిత్వ శాఖల సహాయసహకారాలు తీసుకోవాలని కార్మిక శాఖ నిర్ణయిం చింది. వచ్చే జూన్‌కు డేటా సిద్ధమవుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభుత్వా లకూ, పౌరులకూ చాలా గుణపాఠాలు నేర్పింది. వలస వచ్చేవారి విషయంలో ఖచ్చితమైన డేటా వుండాలని అంతక్రితం ఏ ప్రభుత్వమూ అనుకోలేదు. కానీ లాక్డౌన్ అమలు ప్రారంభించాక ఆ వివరాలు లేకపోవడం ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో అనుభవపూర్వకంగా అర్థమైంది. వలస కార్మికుల్లో అత్యధికులు అసంఘటిత రంగంలో వుంటారు. లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించి, రవాణా సౌకర్యాలు నిలిపేయడంతో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మికులను, కూలీలను పనిలో పెట్టుకున్నవారే లాక్డౌన్ ఎత్తేసేవరకూ వారి బాగోగులు పట్టించుకోవాలని కేంద్రం సూచిం చినా కొద్దిమంది మినహా అత్యధికులు పట్టించుకోలేదు. పైగా వారికి ఇవ్వాల్సిన బకాయిలు ఎగ్గొట్టిన ఘనులు కూడా వున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన సాయమైనా, ఇటు స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయమైనా అందనివారెందరో వున్నారు. ఉన్నచోటే వుంటే ఆకలిదప్పులతో చనిపోవడం ఖాయమన్న నిర్ణయానికొచ్చినవారు కుటుంబాలతో సహా స్వస్థలాలకు నడక మొదలుపెట్టారు. అలా వెళ్లినవారి సంఖ్య కోటి పైమాటేనని కార్మిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఉపాధి హామీ, ఒకే దేశం–ఒకే రేషన్‌వంటి పథకాల కోసం... ఈపీఎఫ్, ఈఎస్ఐ తదితర ప్రయోజనాలు వర్తింపజేయడానికి డేటా సేకరిస్తారు. అలాగే ఆధార్ డేటా సరేసరి. ఇలా భిన్న రంగాలకు చెందిన ప్రభుత్వ విభాగాలు సేకరించే డేటాను సమన్వయపరిస్తే అది కొంతవరకూ ఉపయోగపడొచ్చు. అలాగే ఒక రాష్ట్రం నుంచి వేరేచోట్లకు వెళ్లేవారు రిజిస్టర్ చేసుకోవడానికి అనువైన విధానాన్ని రూపకల్పన చేయాలి. మన దేశంలో వలస కార్మికులు ఎంతమంది వుంటారన్న విషయంలో స్పష్టమైన గణాంకాలు లేవు. వలస కార్మికుల సంఖ్య 45 కోట్ల వరకూ వుండొచ్చని 2011 జనాభా లెక్కలు తేల్చాయి. మన దేశంలో ఏటా సగటున 4.5 శాతం మేర అంతర్గత వలసలు పెరుగుతుంటాయని ప్రపంచ ఆర్థిక ఫోరం నివేదిక అంచనా వేసింది. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుంచే వేరే రాష్ట్రాలకు వలసలుంటాయి. వీరంతా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు వెళ్తుంటారని 2017నాటి ఆర్థిక సర్వే తెలిపింది. తాము వున్నచోట ఉపాధి లేకపోవడం, తక్కువ వేతనాలు లభించడం, కరువుకాటకాలు తలెత్తటం, మెరు గైన వైద్య సౌకర్యాలు కొరవడటం, శాంతిభద్రతలు లేకపోవటం వగైరా సమస్యల వల్ల చాలామంది వలసపోవడానికి సిద్ధపడతారు. తమ ప్రాంతం, భాష కానిచోట మనుగడ సాగించడం కష్టమని తెలిసినా వారికి అంతకన్నా గత్యంతరం వుండదు. కుటుంబాల్లోని పిల్లలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు లభించాలంటే... కనీసం బ్యాంకు ఖాతా ప్రారంభించాలంటే ఏదో రకమైన గుర్తింపు కార్డు వుండాలి. చాలా సందర్భాల్లో అది అసాధ్యమవుతుంది. దేశంలోని వలస కార్మికుల్లో 22 శాతంమందికి ఎలాంటి గుర్తింపు కార్డు వుండదని 2011లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భాష రాకపోవటం వల్ల, స్థానికులు కాకపోవటం వల్ల వారికి పనులు చూపించే దళారులు వలస కార్మికులను నిలువుదోపిడీ చేస్తుంటారు. మెరుగైన వేతనాలు, ఇతరత్రా ప్రయోజనాలు రాబట్టు కోవటం వలస కార్మికులకు సులభం కాదు. పనిచేసేచోట సమస్యలేర్పడితే వారిని ఆదుకునే వారుండరు. వలస కార్మికులు సృష్టించే సంపద తక్కువేమీ కాదు. మహా నగరాల్లో ఆకాశాన్నంటే భవంతుల నిర్మాణం మొదలుకొని చిన్న చిన్న పారిశుద్ధ్య పనుల వరకూ అన్నింటా వారి ప్రమేయం వుంటుంది. అయినా ఇన్ని దశాబ్దాలుగా వారికి సంబంధించిన సమగ్రమైన డేటా ప్రభుత్వాల దగ్గర లేదు. ఇది వలస కార్మికులకు, కూలీలకు మాత్రమే కాదు... ప్రభుత్వాలకు సైతం సమస్యే. ఏ ప్రాంతంలో జనాభా సాంద్రత ఎంతవుందో నిర్దిష్టమైన అంచనా కొరవడటంతో మంచినీరు, డ్రయి నేజ్ వంటి సౌకర్యాల అమలు తలకిందులవుతుంది. వారికి సరైన వేతనాలు లభిస్తున్నాయో లేదో, వారి సంక్షేమానికి ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలేమిటో నిర్ధారించుకోవడం అసాధ్యమవుతుంది. వలస కార్మికులకు కూడా కార్మిక చట్టాలు వర్తిస్తాయి. వాటికింద నిర్దిష్టమైన పనిగంటలు, వేతనం, ఇతర భత్యాలు అందాలి. అలాగే వారికి తగిన ఆవాసం, వైద్య సౌకర్యాలు కల్పించాలి. అనుకోని ప్రమాదం సంభవించినా, ఉన్నట్టుండి పని నుంచి తొలగించినా, మరెలాంటి సమస్య తలెత్తినా ఫిర్యాదు చేసే హక్కు వారికుంటుంది. వలస కార్మికుల ఉపాధి, పని పరిస్థితుల క్రమబద్ధీకరణ కోసమంటూ 1979లో చట్టం తీసుకొచ్చారు. దానికి మరింత పదును పెడుతూ 2011లో సవరణలు చేశారు. ఆ చట్టంకింద అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది ఇతర రాష్ట్రాలవారిని పనిలో పెట్టుకునే కాంట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన రిజిస్టర్ నిర్వహిస్తూండాలి. కానీ ఈ చట్ట నిబంధనలు ఎలా అమలవుతున్నాయో చూసేవారు కరువయ్యారు. అందుకే లాక్డౌన్ అనంతర పరిస్థితులపై ప్రభుత్వాలకు అంచనా లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా సేకరణకు నడుం కట్టింది గనుక అలాంటి సమస్యలు తీరుతాయని ఆశించాలి. వలస కార్మికుల సామాజిక భద్రతకు, సంక్షేమానికి తగిన చర్యలు తీసుకొనేందుకు ఈ డేటా తోడ్పడాలి. అలాగే వలస కార్మికులకు సంబంధించిన నిర్వ చనం అన్ని చట్టాల్లోనూ ఒకేలా లేదు. ఆ లోపాన్ని కూడా సరిచేయాలి. డేటా ఆధారంగా గుర్తింపు కార్డులు జారీచేసి, వలస కార్మికులకు సకల ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకొచ్చేలా చర్యలు తీసుకోవాలి. -
వలస కూలీలు: కీలక మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలకు సంబంధించి కేంద్రహోంశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి పలు రంగాలకు సడలింపు ఇచ్చినా.. వలస కూలీలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నారో అక్కడే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వలస కూలీలు ఉన్నచోటనే వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధిహామీలో పని కల్పించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వలస కూలీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతి ఇవ్వకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రం దాటి మరో రాష్ట్రానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ కోరింది. అయితే ప్రస్తుతం వలస కూలీలు ఎక్కడున్న ఉపాధి పొందేలా స్థానిక అధికారులతో పేరు నమోదు చేయించుకోవాలని కేంద్ర సూచించింది. అలాగే అవసరమైనతే వారికి ప్రత్యేక క్యాంపులు సైతం ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకోవాలని కోరింది. కాగా ఏప్రిల్ 20 తరువాత నిర్మాణ, గ్రామీణ ఉపాధి, పరిశ్రమల్లో కార్యాకలాపాలకే అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వలస కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. పలు చోట్ల తింటానికి కూడా తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. -
వైరల్ వీడియో : వలస కార్మికుడు దీనస్థితి
భోపాల్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధిలేక, తింటానికి తిండిలేక పొట్టచేతపట్టుకుని సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వలసదారులు తమ కాళ్లకి పని చెబుతున్నారు. నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగుల్లో సామాన్లతో వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్తాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు వలస వచ్చిన ఓ కార్మికుడి పరిస్థితి కన్నీరు తెప్పిస్తోంది. ఇంటికెళ్లే మార్గంలేకపోవడంతో కాలుకున్న సిమెంట్ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడనక స్వస్థలానికి బయలేదేరాడు. (200 కిమీ నడక.. మధ్యలోనే ఆగిన ఊపిరి) వివరాల ప్రకారం భన్వరాల్ అనే కార్మికుడు మధ్యప్రదేశ్‌లోని హుస్నాగాబాద్ ప్రాంతం నుంచి ఉపాధి కోసం రాజస్తాన్‌కు వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే పని ప్రదేశంలో ప్రమాదశాత్తు కాలు ఫ్యాక్చర్ కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఓవైపు ఉపాధిలేక, మరోవైపు ఇంటికి పంపేందుకు డబ్బులులేక అవస్థలు పడుతున్నాడు. స్వస్థలానికి వెళ్లడానికి వాహన సదుపాయం కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడపుతున్నాడు. ఇక చేసేందేమీ లేక కాలుకున్న సిమెంట్ కట్టును స్వయంగా తొలగించుకుని కాలి నడకన స్వస్థలానికి బయలేదేరాడు. సుమారు 245 కిలోమీటర్లు నడక ద్వారా రాజస్తాన్‌లోని తన నివాసానికి వెళ్లాడానికి సిద్ధమయ్యాడు. రోడ్డుపై దీనిని చూసిన వారంతా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా కాలి నడకన వెళ్తున్న కొందరు కార్మికులు మార్గం మధ్యలోనే మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. రాజస్తాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు బయలుదేరిన ఓ కార్మికుడు ఆగ్రా సమయంలో గుండెపోటుతో మరణించారు. పలుప్రాంతాల్లో తిండిదొరక్క అలమటిస్తున్న వారికి స్థానికులు అండగా నిలిస్తున్నారు. కాగా ఉత్తర భారతం నుంచి వచ్చిన కొంతమంది తెలంగాణలోనూ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వారందరినీ ఆదుకుంటామని ఇక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటన
సాక్షి, హైదరాబాద్ : కుటుంబాల పోషించడానికి పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలను తిరిగి రాష్ట్రానికి రప్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన గురించి ఆయన మాటల్లోనే.. ‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మిగిలిన తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రజలు పని వెతుక్కుంటూ ఎడారి దేశాలకు పెద్ద ఎత్తున వలస వెళ్లారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి జీతాలు కూడా తక్కువే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇక్కడే చేసుకోవడానికి చాలా పనుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి స్థానికంగా కార్మికులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అందుకోసం గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారిని రప్పించి న్యాక్‌లో శిక్షణనిప్పించాలని నిర్ణయించాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో, బిల్డర్లతో సంప్రదించి నిర్మాణ రంగంలో వారికి పని కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదే విషయాన్ని గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ బిడ్డలకు చెప్పడానికి స్వయంగా నేనే అక్కడికి వెళ్తున్నా’నన్నారు. పర్యటనకు ముందు వలస వెళ్లిన వారు ఎక్కువగా నివసించే నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలో కేసీఆర్ సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నారై పాలసీ అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆధార్ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళలో పర్యటించనుంది. -
వలస జీవితాలంటే అలుసా!
వలసలు, అవి సృష్టిస్తున్న సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని విడనాడటం లేదు. వలస కార్మికుల దుర్భర స్థితిగతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఆదేశించి ఏడాదిన్నర దాటుతున్నా ఏమాత్రం కదలిక ప్రదర్శించని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలపై నాలుగు రోజుల క్రితం అందుకే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఉన్న ఊళ్లో బతుకు తెరువు కరువై జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్తున్న వలస కార్మికులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు పరారు కావడానికి ప్రయత్నించారన్న ఆగ్రహంతో కాంట్రాక్టర్లు 2013 డిసెంబర్లో వారి చేతులను నరికిన ఉదంతంపై మీడియాలో వెలువడిన వార్తలను సుమోటోగా తీసుకుని అప్పట్లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వారి స్థితిగతుల మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, ఈ మాదిరి ఉదంతాలు భవిష్యత్తులో జరగకుండా ఏమి చేయదల్చుకున్నారో చెప్పాలని కోరింది. అయితే ప్రభుత్వాలు ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ‘సరైన రీతి’లో అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. దాదాపు 40 కోట్లమంది జనం దేశంలో ఒకచోటు నుంచి మరో చోటుకు వలస పోతున్నారని 2011 జనాభా గణాంకాలు వెల్లడించాయి. ఇది ఇప్పుడు మరింత పెరిగి ఉంటుంది. అంటే జనాభాలో మూడో వంతు మంది వలస జీవితాలు గడుపుతున్నారు. ఇందులో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లోని బక్క రైతులు, రైతు కూలీలే! సాగులో వస్తున్న నష్టాలను తట్టుకోలేక, తీసుకున్న ప్రైవేటు రుణాలు తీర్చలేక గత్యంతరం లేని స్థితిలో రైతులు వెట్టి చాకిరీకి సిద్ధపడుతుంటే, కూలి పనులు దొరక్క రైతు కూలీలు వలస పోతున్నారు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని కాంట్రాక్టర్లు వారికి అరచేతిలో వైకుంఠాన్ని చూపుతారు. ఎంతో కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇస్తారు. ఈ వ్యవహారంలో ఎలాంటి ఒప్పందాలు, కాగితాలు ఉండవు. ఆ తర్వాత అడుగడుగునా వారికి నరకమే కనిపిస్తుంది. వలసపోయేవారితోపాటు ఉండే పిల్లల సంఖ్య కోటిన్నర పైమాటేనని యునిసెఫ్ నివేదిక చెబుతోంది. ఆ కుటుంబాలకు రేషన్ కార్డు ఉండదు కనుక దాని ద్వారా లభించే అరకొర సదుపాయాలైనా అందుబాటులో ఉండవు. ఓటర్లుగా గుర్తింపు ఉండదు కనుక వారిని పట్టించుకునే పార్టీలుండవు. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లడం సాధ్యపడదు. కాంట్రాక్టర్ కల్పించే అరకొర వైద్య సదుపాయమే దిక్కు. ఊరికి దూరంగా ఉండి పనిచేయాలి కనుక వారి పిల్లలకు చదువుసంధ్యలుండవు. సరిహద్దులు దాటి వేరే దేశాలకు వెళ్లేవారికి సమకూరేపాటి రక్షణ అయినా ఈ వలస కార్మికులకు ఉండదు. వారికి నిత్యం ఛీత్కారాలే ఎదురవుతాయి. మహిళా కార్మికులైతే అదనంగా లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. పని మనుషులుగా, వాచ్మన్లుగా, రిక్షా కార్మికులుగా, ముఠా కార్మికులుగా, నిర్మాణ పనుల్లో, క్వారీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి శ్రమ దోపిడీతోనే మహా నగరాలు నిత్యం వెలిగిపోతుంటాయి. ఇలాంటివారి విషయంలో ప్రభుత్వాలన్నీ శ్రద్ధ వహించి, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని యునిసెఫ్ సంస్థ రెండేళ్లక్రితం ఇచ్చిన నివేదికలో హితవు పలికింది. కానీ ఆ విషయంలో తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటుక బట్టీల్లో పనిచేసేవారి బతుకులు అత్యంత దుర్భరం. వారికి నిర్దిష్టమైన పనిగంటలుండవు. బంక మన్నులో, బురదలో పనిచేయాల్సి ఉంటుంది గనుక చెప్పులు ధరించడం సాధ్యంకాదు. దాదాపు 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఫర్నేస్‌ల దగ్గర ఉండాల్సివస్తుంది. కనీస వేతనాల చట్టంగానీ, ఇతర కార్మిక చట్టాలుగానీ వారి దరిదాపులకు కూడా రావు. మహిళా కూలీలకు రోజుకు రూ.10 నుంచి రూ.12 లభిస్తే... మగ కూలీలకు రూ.15 నుంచి రూ.20 వరకూ దక్కుతుంది. ఇలాంటి పని పరిస్థితుల్ని తట్టుకోలేక పరారవడానికి ప్రయత్నించినందుకే రెండేళ్లక్రితం ఒడిశాకు చెందిన కార్మికులిద్దరికీ కాంట్రాక్టర్లు కుడి చేతులు నరికారు. వలసపోయే కార్మికులు రెండు నెలలనుంచి ఏడాది వరకూ కాంట్రాక్టర్ల దగ్గర ఉండాల్సి వస్తుంటుంది. ఇలా వెళ్లేవారిలో అనివార్యంగానే అత్యధికులు ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు. వలస కార్మికుల కోసమని 1979లో చట్టం తీసుకొచ్చినా దాని అమలుకు ఎవరూ శ్రద్ధ పెట్టరు. సంఘటిత రంగంలోని కార్మికులకైతే కనీసం ఏదో మేరకు సంఘాలుంటాయి. నిలదీస్తాయి. వలస కార్మికులకు అలాంటి అవకాశం కూడా ఉండదు. అక్కడక్కడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వలస కార్మికుల పని పరిస్థితుల గురించి ఆరా తీసి, వారి హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆ కార్మికుల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలపై దృష్టి పెడుతున్నాయి. కానీ వలస కార్మికుల సంఖ్యతో పోలిస్తే ఈ సంస్థల సేవలు ఏమూలకూ సరిపోవు. ప్రభుత్వాలకు ఎటూ తోచడం లేదు. కనీసం సుప్రీంకోర్టు దృష్టి పెట్టి నిలదీశాక అయినా శ్రద్ధగా పనిచేయాలన్న ఉద్దేశం కలగడం లేదు. కనుకనే వలస కార్మికుల జీవితాలను ప్రభుత్వాలు ధూళికన్నా హీనంగా చూస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను ఇప్పటికైనా ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోనట్టయితే వాటి చేతగానితనాన్ని తామే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇన్ని చీవాట్లు తిన్నాకైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ మేల్కొనాలి. సర్వోన్నత న్యాయస్థానం కోరిన విధంగా వలస కార్మికుల కోసం సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వారి రక్షణకు చర్యలు తీసుకోవాలి. పల్లె సీమల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, ఉపాధి హామీ పథకం వంటివి సమర్థవంతంగా అమలు చేయడంవంటి చర్యల ద్వారా వలసలను అరికట్టడానికి కృషి చేయాలి.