సాక్షి, హైదరాబాద్ : కుటుంబాల పోషించడానికి పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలను తిరిగి రాష్ట్రానికి రప్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన గురించి ఆయన మాటల్లోనే.. ‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మిగిలిన తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రజలు పని వెతుక్కుంటూ ఎడారి దేశాలకు పెద్ద ఎత్తున వలస వెళ్లారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి జీతాలు కూడా తక్కువే.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇక్కడే చేసుకోవడానికి చాలా పనుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి స్థానికంగా కార్మికులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అందుకోసం గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారిని రప్పించి న్యాక్‌లో శిక్షణనిప్పించాలని నిర్ణయించాం.
రియల్ ఎస్టేట్ వ్యాపారులతో, బిల్డర్లతో సంప్రదించి నిర్మాణ రంగంలో వారికి పని కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదే విషయాన్ని గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ బిడ్డలకు చెప్పడానికి స్వయంగా నేనే అక్కడికి వెళ్తున్నా’నన్నారు. పర్యటనకు ముందు వలస వెళ్లిన వారు ఎక్కువగా నివసించే నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలో కేసీఆర్ సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నారై పాలసీ అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆధార్ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళలో పర్యటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment