
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశం దినదినం పురోభివద్ధి చెందుతోందని మన రాజకీయ నాయకులు ఉదరగొడుతున్నప్పటికీ రోజురోజుకు మన దేశం నుంచి విదేశాలకు వలసలు పెరుగుతూనే ఉన్నాయి. అలా వలసపోయిన వారి సంఖ్య 1990లో 66 లక్షలు ఉండగా, అది 2019 సంవత్సరం నాటికి 175 లక్షలకు చేరుకుంది. ఈ డేటాను ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడిదుల చేసింది. మొత్తం అంతర్జాతీయంగా 2, 720 లక్షల మంది విదేశాలకు వలసపోతుండగా వారిలో 175 లక్షల మంది భారతీయులు ఉన్నారని, అయితే భారతీయులు వలసపోతున్న దేశాలు గత 30 ఏళ్లుగా గణనీయంగా మారుతూ వస్తున్నాయని డేటా వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
అదే విదేశాల నుంచి భారత్‌కు వలసలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అక్రమ వలసలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే చట్టబద్ధంగా భారత్‌లో శరణార్థులుగా ఆశ్రయం కోరుతున్న వారి సంఖ్య గత 30 ఏళ్లలో స్థిరంగా రెండు లక్షలే ఉంటోంది. భారత్‌కు వలసవస్తున్న వారి సంఖ్య 1990లో భారత జనాభాలో 0.9 శాతం ఉండగా, ప్రస్తుతానికి అది దేశ జనాభాలో 0.4 శాతానికి తగ్గింది. మరోపక్క ప్రపంచ జానాభాలో ప్రపంచ వలసల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2000 సంవత్సరంలో ప్రపంచ జనాభాలో ప్రపంచ వలసల సంఖ్య 2.8 శాతం ఉండగా, అది ప్రస్తుతానికి 3.5 శాతానికి చేరుకుంది. ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది అమెరికాకు వెళుతుండగా, ఆ తర్వాత జర్మనీ, సౌదీ అరేబియాకు ఎక్కువ మంది వలస పోతున్నారు. ఇక విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న వారిలో బంగ్లాదేశీయులు ప్రథమ స్థానంలో ఉండగా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, చైనా దేశీయులు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment