
ఓకే మణీ బంగారం!
భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కొంతమంది తారలకు బోలెడంత క్రేజ్. కేరళ కుట్టి నిత్యా మీనన్ సంగతి అక్షరాలా అదే! అమ్మడికి ఇప్పుడు మలయాళంలోనే కాదు... తమిళ, తెలుగు భాషల్లోనూ ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కాస్తంత బొద్దుగా, పొట్టిగా ఉన్నప్పటికీ, అందంతో పాటు, కళ్ళతోనే కోటి భావాలు పలికించగల నేర్పు ఆమె సొంతం. అందుకే, ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అయితే, పారితోషికం కన్నా కథ, తన పాత్ర నచ్చడం మీదే నిత్య దృష్టి అంతా! అలా చాలా సెలక్టివ్‌గా ఉండే ఈ యువ హీరోయిన్ ఆ మధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలోని ‘రుద్రమదేవి’లో కనిపించనున్నారు.
తాజాగా ఆమె మణిరత్నం కొత్త సినిమాకు ఓ.కె. చెప్పారు. ఆ మధ్య ‘ఓ.కె. బంగారం’ సినిమాలో మణి డెరైక్షన్‌లో చేసిన నిత్యకు ఆయన డెరైక్షన్‌లో వరసగా ఇది రెండో సినిమా. ఇంకా పేరు పెట్టని పగ, ప్రతీకారాల కథ ఈ డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. తమిళంలో తీస్తూ, తెలుగులో కూడా విడుదల చేయనున్న ఈ చిత్రంలో కార్తీ, ‘ఓ.కె. బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ ఎంపికయ్యారు. కథానుసారం ఈ హీరోలిద్దరూ ఒకరితో మరొకరు తలపడతారు.
‘‘ఇప్పటికే కీర్తీ సురేష్‌ను ఒక నాయికగా ఎంపిక చేశాం. ఇప్పుడు నిత్యా మీనన్ కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటి స్తాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు చెప్పాయి. మొత్తానికి, మణిరత్నం ‘ఓ.కె. బంగారం’లో మొన్న సమ్మర్‌కి అందరినీ ఆకర్షించిన నిత్య ఇప్పుడు రవివర్మ కెమేరా, రెహమాన్ సంగీతంలో మళ్ళీ తెరపై వెలిగిపోనుంది.