
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్ ఫలితాల్లో ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు ఎక్కువగా బోల్తా కొట్టారు. సైన్స్ గ్రూప్ విద్యార్థులతో పోల్చితే వీరు ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక శాతం ఫెయిలయ్యారు. ముఖ్యంగా కామర్స్‌లో కంగు
తినగా.. సివిక్స్‌లో చేతులెత్తేశారు. ఎకనామిక్సలో తికమకపడ్డారు. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ ఇదే పరిస్థితి. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు చతికిలబడగా.. సైన్స్ గ్రూప్ విద్యార్థులు మాత్రం దూసుకెళ్లారు. సాధారణంగా సైన్స్ గ్రూపు విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
ప్రథమ సంవత్సరం ఆర్ట్స్ గ్రూప్‌లో పరిస్థితి మరింత దయనీయంగా కనిపిస్తోంది. ద్వితీయ సంవత్సరం కంటే.. ఫస్టియర్ ఆర్ట్స్‌లోనే ఎక్కువ శాతం మంది ఫెయిలయ్యారు. కామర్స్‌లో ఏకంగా 40.53 శాతం మంది విద్యార్థులు చేతులెత్తేశారు. ఆ తర్వాత సివిక్స్‌లో. ఈ సబ్జెక్టులో దాదాపు 37.56 శాతం మంది అనుత్తీర్ణత సాధించారు. ఇక ఎకనామిక్స్‌లోనూ విద్యార్థులు ఇదే వరుసకట్టారు. 36.58 శాతం మంది ఫెయిలయ్యారు. కీలకమైన ఈ మూడు సబ్జెక్టుల్లో నెగ్గడానికి కష్టపడ్డ విద్యార్థులు.. హిస్టరీ విషయానికి వస్తే కాస్త మెరుగ్గా కనిపించారు. ఈ సబ్జెక్టులో 14.20 శాతం మందే పాసకాలేకపోయారు.
మాతృభాషలోనూ..
ప్రధాన సబ్జెక్టుల విషయాన్ని పక్కనబెడితే మాతృభాష తెలుగులోనూ ఆశించిన స్థాయిలో విద్యార్థులు నెగ్గలేకపోయారు. ఇంగ్లిష్, సంస్కృతం, హిందీ భాషల్లో కంటే తెలుగులోనే అధిక శాతం మంది ఫెయిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో ఇదే వరుస కనిపించింది. ఫస్టియర్‌లో దాదాపు 20 శాతం మంది చేతులెత్తేయడం.. తెలుగు భాషపై విద్యార్థులకు పట్టు ఏపాటిదో అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment