విజయవాడలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాసభలలో తెలుగు భాష ప్రాశస్త్యం, చిన్నతనం నుంచే తెలుగు నేర్చుకోవల్సిన అవసరం తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. తెలుగు భాష వికసించాలని కోరుకోవడం తప్పు కాదు. మంచిదే. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్.వి.రమణ తదితర ప్రముఖులు ఈ సభలలో పాల్గొని తమ సందేశాలు అందించారు. వెంకయ్య నాయుడు అయితే శ్వాస ఆగితే, భాష ఆగితే అంటూ ప్రాసతో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ప్రముఖులిద్దరని కాదు.. అక్కడ మాట్లాడినవారిలో పలువురు పరోక్షంగా ఎపిలో వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మాట్లాడారా అన్న అనుమానం వస్తుంది.
ఏపీలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్దులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపద్యంలో దానిని ఏదో రకంగా వ్యతిరేకిస్తున్నవారు ఈ సభలో తెలుగు గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. అయితే ఎపి ప్రభుత్వం తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేసిందన్న సంగతిని వీరు విస్మరిస్తున్నారు. తెలుగుదేశం నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ పాలకులు ఇకనైనా మారాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని వెంకయ్య నాయుడు తదితరులు అభిప్రాయపడ్డారు.
తెలుగు భాష మృతభాష అవుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ వక్తల కుటుంబాలకు చెందినవారు ఎంతమంది తెలుగులో ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగు సంస్కృతి కోసం సభలు పెట్టవచ్చు. కానీ తెలుగు భాషకు ఏదో అయిపోతోందన్న భావన కలిగించే యత్నమే బాగోలేదు. ఏ భాష ఎప్పుడూ మరణించదు. అందులోను కోట్ల మంది మాట్లాడే భాష అంత తేలికగా పోయేటట్లయితే, ఈ పాటికి చాలా భాషలు కనుమరుగు అయి ఉండేవి. వెంకయ్య నాయుడు కాని, రమణకాని, లేదా బుద్ద ప్రసాద్ కాని, ఇలాంటి ప్రముఖులంతా తమ మనుమలు, మనుమరాళ్లను సభకు తీసుకు వచ్చి వీరిని తెలుగు భాషలోనే తాము చదివిస్తున్నామని చెప్పగలిగి ఉంటే వారిని అంతా మరింతగా మెచ్చుకునేవారు. వెంకయ్య నాయుడు కుమార్తె ఆధ్వర్యంలోని స్వర్ణభారతి ట్రస్టులో తెలుగులోనే పాఠశాల నడుపుతున్నామని చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఒకవేళ అలా జరుగుతుంటే అభినందించాల్సిందే.
తెలుగుకు సంబంధించి ఏ వార్త వచ్చినా పూనకం పూనినట్లు వార్తా కధనాలు, బానర్లు పెట్టే ఈనాడు అధినేత రామోజీరావు నడిపే రమాదేవి పబ్లిక్ స్కూలలో తెలుగు మీడియంలోనే ప్రాధమిక విద్యను చెబుతామని ప్రకటించి ఉంటే గొప్పగా ఉండేది కదా? పోనీ రామోజీరావు లేదా, ఆయన వద్ద పనిచేస్తున్న ఎడిటర్లు, జర్నలిస్టులు ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారో, చదివిస్తున్నారో తెలపగలిగి ఉంటే ఎవరైనా విశ్వసించవచ్చు. తెలుగు భాషపై అంత ప్రేమ ఉన్న ప్రవాసాంధ్రులు తమ పిల్లలను అమెరికాలో కూడా తెలుగులోనే చదివిస్తున్నారా? లేదా వారిని ఇండియాకు తీసుకు వచ్చి స్వరాష్ట్రంలో తెలుగు స్కూళ్లలో చదివిస్తున్నారా? అమెరికాలో మనవాళ్లు తమ పిల్లలకు తెలుగు నేర్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచిదే. ఇళ్ల వద్ద తెలుగు మాట్లాడిస్తే స్వాగతించవలసిందే. కొంతమంది కళలపట్ల ఆసక్తికలిగిన తల్లిదండ్రులు తెలుగులో పద్యపఠనం తదితర ప్రక్రియలను బోధిస్తున్నారు. ఇది సంతోషించవలసిన అంశమే. కాని అత్యధిక శాతం తెలుగువారి పిల్లలు ఇంగ్లీష్ లోనే మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారు. తెలుగు మర్చిపోతున్నారు. వచ్చినా ఏదో పొడి, పొడి మాటలు మాట్లాడుతున్నారు.
ముందుగా వారికి ఎలా తెలుగు నేర్పించాలా అన్నదానిపై తానా లేదా ఇతర తెలుగు సంస్థలు దృష్టి పెడితే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు గురించి వారు సభలు పెట్టి విమర్శలు చేస్తే మొత్తం మారిపోతుందా? ఎపిలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు. దానికి స్పష్టమైన కారణం ఉంది. ఆంగ్ల మీడియం ఉన్న స్కూళ్లకే 90 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తున్నారు.దాంతో ప్రభుత్వ స్కూళ్లు కేవలం పేదలకు, ఆర్థికంగా స్తోమత లేని బలహీనవర్గాలకే పరిమితం అవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన వైసిపి ప్రభుత్వం కాని, కెసిఆర్ ప్రభుత్వం కాని ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టాయి. కెసిఆర్‌కు ఈ విషయంలో ఇబ్బంది రాలేదు కాని, ఎపిలో జగన్ ను మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన, వామపక్షాలు చాలా ఇబ్బంది పెట్టే యత్నం చేశాయి.
తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా చేసినా ఏదో రకంగా జగన్ ముందుకు వెళ్లకూడదని చివరికి కోర్టులను కూడా అడ్డం పెట్టుకుని టిడిపి చేసిన యాగీ ఇంతా ,అంతా కాదు. ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు నానా రభస చేశాయి. పోనీ ఈ మీడియా సంస్థల యజమానుల పిల్లలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా తెలుగులో చదువుతున్నారా అంటే అదేమీ లేదు. వీరిలో అత్యధికులు హైదరాబాద్, ముంబై వంటి నగరాలలో కార్పొరేట్ స్కూళ్లలో ఆంగ్ల మీడియంలో చదివించుకుంటున్నారు. ఎపిలో మాత్రం ఆంగ్ల మీడియం పెట్టకూడదని యాగీ చేశారు. వీరెవరూ ప్రైవేటు స్కూళ్లు ఆంగ్ల మీడియం మాత్రమే అమలు చేస్తున్నప్పుడు నోరు మెదపలేదు. అంతదాకా ఎందుకు! తెలుగు గురించి చంద్రబాబు గారు చాలా ఉపన్యాసాలు చేశారు కదా? ఆయన కుమారుడు లోకేష్‌ను ఏ మీడియంలో చదివించారు? ప్రస్తుతం ఆయన మనుమడు దేవాన్ష్‌ను కాని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? బుద్ద ప్రసాద్ వంటి వారు ముందుగా ఈ విషయంలో సలహా ఇవ్వవలసింది వీరికి కదా!
ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరగాలని చెబుతున్న ఈ పెద్దలు, తమ వాళ్లు మాత్రం ఆంగ్లంలో చదివినా బాగా చదవగలరని, మిగిలినవారు అర్ధం చేసుకోలేరని ఎలా భావిస్తున్నారో అర్ధం కాదు. వీరంతా ఒక్కసారి కాకినాడ జిల్లా బెండపూడిలోని ప్రభుత్వ స్కూల్‌కుకు వెళ్లి, అక్కడ పిల్లలు, ఆంగ్లంతో పాటు, తెలుగు భాషలో కూడా ఎలా రాణిస్తున్నది తెలుసుకుంటే బాగుంటుంది. వారిని ఇలాంటి సంఘాలు ప్రోత్సహించి, ఏ సందేశం ఇచ్చినా వినబుద్ది అవుతుంది. చిన్నతనంలోనే ఏమి నేర్పినా పిల్లలకు బాగా వంటపడుతుందని అంటారు. తెలుగు గురించి ఇంతలా బాధ పడుతున్నవారు పాటించి చూపిస్తే కదా మిగిలినవారు ఆచరించే అవకాశం ఉండేది. చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రవాసాంద్రులు తెలుగు భాష గురించి ఏ కార్యక్రమం చేసినా సంతోషమే. దానికి ముందుగా అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించగలిగితే , అప్పుడు వారు ఏమి చెప్పినా విలువ పెరుగుతుంది కదా!
- హితైషి
Comments
Please login to add a commentAdd a comment