
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్) వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అంశంపై కడియం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న తెలుగు ప్రపంచ మహాసభల కంటే ముందుగానే తెలుగును అధికార భాషగా, 12వ తరగతి వరకు ప్రతీవిద్యార్థి తెలుగును ఒక సబ్జెక్టుగా చదివేలా రూపొందించాలని సూచించారు.
ఆ విధానాన్ని ప్రపంచ మహాసభల్లో సీఎం కేసీఆర్ ప్రకటించేలా సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎం స్పెషల్ ఆఫీసర్ దేశపతి శ్రీనివాస్, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నవంబర్ 15వ తేదీలోగా విధానాన్ని రూపొందించి, చట్టంలో తేవాల్సిన మార్పులపై ప్రతిపాదనలు అందజేయాలని అన్నారు.
విద్యా సంస్థలు, స్టేట్, సెంట్రల్, ఐసీఎస్‌ఈ సిలబస్, మీడియంతో సంబంధం లేకుండా 12వ తరగతి వరకు తెలుగును సబ్జెక్టుగా చదివేలా చట్టంలో మార్పులు చేస్తామని తెలిపారు. 2018 జూన్ నుంచి దీనిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, రాష్ట్ర సాంస్కృతిక, మీడియా సలహాదారు రమణాచారి, అధికార భాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.