
పావగడ కోట
అనంతపురం: ప్రస్తుత కాలంలో మాతృభాషకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ పట్టణంలో కన్నడ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి ఒక్కరూ కన్నడతో పాటు తెలుగు మాట్లాడతారు. కొత్తగా వచ్చిన ఉద్యోగులు, కొత్త వారితో తప్ప వ్యవహార శైలి తెలుగులోనే ఉంటుంది. తెలుగు భాషతో పాటు తెలుగు పండుగలు, సంప్రదాయాలు కూడా అనుసరిస్తారు. పావగడ చుట్టూ ఆంధ్ర సరిహద్దు ఉంటుంది. కేవలం పశ్చిమ వైపు మాత్రమే చిత్రదుర్గం వెళ్లే మార్గం ఉంటుంది. మిగతా ఎటు వెళ్లినా ఆంధ్ర టచ్ చేయాల్సిందే. ఫలితంగా వివాహ సంబంధాలన్నీ ఆంధ్ర వాళ్లతోనే ఉండటంతో తెలుగు భాష ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది.
జిల్లా సరిహద్దుగా..
పావగడ తాలూకా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉంది. పశ్చిమ వైపు మినహా ఎటు వెళ్లినా 10 నుంచి 15 కిలోమీటర్ల లోపు ఆంధ్ర సరిహద్దు వస్తుంది. పావగడ జనాభా (2011 ప్రకారం) 30 వేలు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుమకూరు జిల్లాలోని శిరా, మధుగిరి ప్రాంతాలు సమీపంలో ఉంటాయి. అయితే ఆ ప్రాంతాలకు వెళ్లాలన్నా మధ్యలో ఆంధ్ర పల్లెలు దాటాల్సిందే.
మైసూరు రాష్ట్రం నుంచి..
పాత మైసూరు రాష్ట్రంలో పావగడ అంతర్భాగం. అప్పటి నుంచి తాలూకా కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీగానూ ఉంది. పావగడ తాలూకా పరిధిలో 150 గ్రామాలు ఉన్నాయి. చారిత్రకంగానూ పావగడకు పేరుంది. శనేశ్వరాలయం ప్రసిద్ధి. చుట్టుపక్కల ప్రజలు శనేశ్వరాలయ సందర్శన కోసం భారీగా వస్తుంటారు. పావగడలో ప్రాచీన కాలంలో కట్టిన కోట (700 మీటర్ల ఎత్తులో) ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

శనేశ్వరాలయం

గూగుల్ మ్యాప్‌లో పావగడ
Comments
Please login to add a commentAdd a comment