ఆంగ్లమా... తెలుగా | AP Govt has taken the referendum from Parents of Students For English Medium Issue | Sakshi
Sakshi News home page

ఆంగ్లమా... తెలుగా

Published Sat, Apr 25 2020 3:58 AM | Last Updated on Sat, Apr 25 2020 4:10 AM

AP Govt has taken the referendum from Parents of Students For English Medium Issue - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండాలన్న అంశంపై తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది. వారి మనోభావాలకు అనుగుణంగా బోధనా మాధ్యమం ఉండాలన్న ఉద్దేశంతో లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గ్రామ, వార్డు  సచివాలయ కార్యదర్శుల నుంచి ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఈఓలను అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. తమ పిల్లలు ఏ భాషా మాధ్యమంలో చదువుకుంటారో తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్‌లో టిక్‌ చేసి సంతకం చేసి ఇవ్వాలి.   

► హైకోర్టు సూచనల మేరకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి మాధ్యమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఈనెల 21న జీవో 20 జారీ చేశారు. దీన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. 

► 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1–6వ తరగతి విద్యార్థులకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో వారి తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు అందచేసే ఆప్షన్‌ ఫార్మాట్ల ద్వారా తెలియచేయాలి. 
► అమ్మ ఒడి కార్యక్రమం కోసం పాఠశాలలు, గ్రామం, మండలాల వారీగా సేకరించిన విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులు మాధ్యమంపై తల్లిదండ్రుల నుంచి ఫార్మాట్‌లో లిఖిత పూర్వకంగా సేకరించాలి. కోవిడ్‌ నేపథ్యంలో తగిన ప్రోటోకాల్‌ను పాటించాలి. 

► మాధ్యమంపై తల్లిదండ్రుల సంతకాలతో సేకరించిన ఫార్మాట్‌ హార్డ్‌ కాపీలను పాఠశాల, మండలాల వారీగా జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో భద్రపరచాలి. 
► మండల విద్యాధికారులు ఈ సమాచారాన్ని ఫారం–1 ద్వారా  క్రోడీకరించాలి. జిల్లా స్థాయిలో క్రోడీకరించిన సమాచారాన్ని ఫారం–2లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపించాలి. 
► ఈ మేరకు కలెక్టర్లు సంబంధిత విభాగాల అధికారులందరికీ ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేశారు. 

ప్రొఫార్మాలో సమాచారం ఇలా ఇవ్వాలి... 
► జిల్లా విద్యాధికారిని ఉద్దేశిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రొఫార్మా ద్వారా తెలియచేయాలి. 
► తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మీడియం కావాలో ఎంచుకుని పత్రంలో టిక్‌ చేయాలి. 
► 2020–21 విద్యా సంవత్సరంనుంచి తమ కుమారుడు/కుమార్తెకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలిపేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 3 ఆప్షన్లను ఇచ్చింది. 

మూడు ఆప్షన్లు ఇవీ.. 
1. తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడియం 
2.  తెలుగు మీడియం 
3. ఇతర భాషా మీడియం 

► ఎంపిక చేసుకున్న మాధ్యమానికి ఎదురుగా టిక్‌ చేయాలి 
► ఎంపిక చేసుకోని వాటికి ఎదురుగా ఇంటూ గుర్తు పెట్టాలి 
► తల్లి/తండ్రి/సంరక్షుకుడు∙సంతకం తప్పనిసరిగాచేయాలి. 
► కుమారుడు/కుమార్తె పేరు, ఏ గ్రామం, పాఠశాల, ఏ తరగతి, ఏ మాధ్యమం కావాలో స్పష్టం చేస్తూ తేదీతో సంతకం చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement