తిరుపతి నుంచే ఉద్యమం | telugu, aavedana deeksha | Sakshi
Sakshi News home page

తిరుపతి నుంచే ఉద్యమం

Published Mon, Aug 29 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

సబ్‌కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేపట్టిన యార్లగడ్డ

సబ్‌కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేపట్టిన యార్లగడ్డ

తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమం మళ్లీ మొదలైంది. ఇందుకు తిరుపతి వేదికైంది.

– తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘ఆవేదన దీక్ష’
– సబ్‌కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేపట్టిన యార్లగడ్డ
– మద్దతు పలికిన ప్రజాసంఘాలు, కవులు, రచయితలు, కళాశాలలు
 
తిరుపతి: తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమం మళ్లీ మొదలైంది. ఇందుకు తిరుపతి వేదికైంది. తెలుగు భాషా వికాసం కోసం అవిరళ కృషి సల్పిన గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటోన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయంపై నిరసలు పెల్లుబుకుతున్నాయి. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా భాష గురించి పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన భాషా కోవిదులు, సాహితీవేత్తలు భాషా పరిరక్షణ కోసం ఉద్యమమే శరణ్యమన్న నిర్ణయానికి వచ్చారు. సోమవారం తిరుపతి సబ్‌కలెక్టరేట్‌ ఎదుట ‘తెలుగు ఆవేదన దీక్ష’ పేరిట పలువురు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. తెలుగు భాషా పరిరక్షణ నేత, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆవేదన దీక్షను ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా జరిపే ఉద్యమానికి తిరుపతి నుంచే శ్రీకారం చుట్టారు. 
 
హామీలను గాలికొదిలిన సర్కారు...
2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు గుప్పించింది. ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ రెండో భాషగా తెలుగును తప్పనిసరి చేస్తామనీ, తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామనీ, తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు, తెలుగు భాషా పీఠం ఏర్పాటు వంటి 20కి పైగా హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రెండేళ్లు గడిచినా వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. పైగా అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలోనూ శిలాఫలకాలను ఆంగ్లంలో సిద్ధం చేశారు. దీంతో రాష్టంలోని తెలుగు భాషాభిమానులకు రక్తం ఉడికింది. వెంటనే తెలుగులో శిలాఫలకాలను తయారు చేయించి సీఆర్‌డీఏ అధికారులకు అందజేశారు. టీడీపీ ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధి కోసం చేసేదేమీ లేదన్న విషయాన్ని అర్థం గుర్తించిన వీరు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటమే మార్గమని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ముందుకొచ్చారు. తిరుపతిలో ఆవేదన దీక్ష నిర్వహించిన తరువాత జిల్లాల వారీగా పర్యటనలు జరిపి భాషాభిమానులను చైతన్యవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు కూడా ఇందుకు మద్దతు పలికారు. తిరుపతిలోని రాయలసీమ, చైతన్య కాలేజీలతో పాటు పలు స్వచ్చంద సంస్థలు, అభ్యుదయ రచయితల సంఘం, తెలుగు భాషోద్యమ సమితి నిర్వాహకులు, ఎక్స్‌ టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా బాసటగా నిలిచారు. తెలుగు భాషను పరిరక్షించుకుంటామని సామూహికంగా శపథం చేశారు. 
 
 తెలుగు జాతి ఆత్మగౌరం కాపాడాలి...
 ప్రభుత్వ ప్రకటించిన విధంగా  విద్యా రంగంలో, పరిపాలనా రంగంలో  తెలుగు అమలు చేసి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ప్రభుత్వ పరంగా తెలుగు భాష మనుగడ వికాసం కోసం చేయాల్సిన కార్యకలాపాలు తక్షణం చేపట్టాలి. మాతృభాష అయిన తెలుగు భాష పట్ల తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం బాధాకరం. తెలుగు భాష దెబ్బతింటే భాష చుట్టూ పెనవేసుకున్న   జాతి, సంస్కృతి, సాహిత్యం, కళలు, ఆచారాల మనుగడకు ప్రమాదమే.
–– గంగవరం శ్రీదేవి, తెలుగు భాషోద్యమ సమతి అధ్యక్షురాలు.
 
భాషా వికాసంతోనే మాతృభాష పరిరక్షణ
భాషా వికాసంతోనే మాతృభాష పరిరక్షణ సాధ్యం. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష నిరీర్యం అయ్యే పరిస్థితి కలగడం  దౌర్భాగ్యం. ఆయా రాష్ట్రాలు తమ మాతృభాషాభివృద్దికి విశేష కృషి చేస్తుంటే ఇక్కడ పాలకులు  నిర్లక్ష్యం చేయడం  అమానుషం.  కనుమరగుతున్న మాతృభాష వికాసం  కోసం  ప్రభుత్వం తక్షణం స్పందించాలి.  రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగాలి. తెలుగు మాద్యంలో చదివిన వారికి 5 శాతం మార్కులు అదనంగా ఇవ్వాలి. గాంధీ మొదలు, గిడుగు వరకు వారి మాతృభాషను భాగా నేర్చుకున్నారు కాబట్టే  ఆంగ్లం ఇతర  భాషలు భాగా నేర్చుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు అమలు చేయాలి.
–పేరూరు బాలసుబ్రమణ్యం, రచయిత
 
ప్రాచీన పీఠాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలి
మైసూరులోనున్న ప్రాచీన తెలుగు భాషా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలి. తమిళ, కన్నడ రాష్ట్రాల్లో వారి భాషా మాద్యం చదివి వారికి ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించి వారి మాతృభాషను పరిరక్షిస్తున్నారు. ఇదే తరహాలో  రాష్ట్రంలో సైతం   తెలుగు మాద్యం చదివిన వారికి ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలి. అధికార భాషా సంఘానికి అధికారాలు, నిధులు పెంచాలి. ప్రత్యేకంగా  తెలుగు భాషామంత్రిత్వ శాఖాను నియమించాలి.
– శ్రీమన్నారాయణ, అధ్యాపకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement