
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2018 అక్టోబర్ 31న గుజరాత్‌లో ‘ఐక్యతా ప్రతిమ’ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ను ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని ఐక్యతకు ప్రతీకగా ప్రతిష్టించారు. అక్టోబర్ 31 పటేల్ జయంతి కాగా, 182 అనే సంఖ్య గుజరాత్ రాష్ట్రంలోని 182 నియోజక వర్గాలకు సంకేతం. విగ్రహ నిర్మాణ పనులు 2013 అక్టోబర్ 31న మొదలయ్యాయి.
నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్‌కు అభిముఖంగా ఉండేలా 19 వేల చదరపు కిలో మీటర్ల వ్యాసార్థంలో, 2989 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ఐక్యతా ప్రతిమను నిర్మించారు. ఇందుకోసం 75 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్, 5 వేల 700 టన్నుల ఉక్కు, 18 వేల 500 టన్నుల స్టీల్ రాడ్లు, 22 వేల 500 టన్నుల రాగి పలకలు అవసరం అయ్యాయి.
దాదాపు 2,500 మంది కార్మికులు పని చేశారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతల ఎత్తులో నిర్మించిన ఈ సర్దార్ పటేల్ ఐక్యత స్మారక ప్రతిమను ఆ ఒక్క ఏడాదిలోనే (2018–2019) 2 కోట్ల 80 లక్షల మంది దేశ విదేశీయులు సందర్శించారు.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
- అటల్ బిహారి వాజ్‌పేయి, నటి శ్రీదేవి, జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య, ఎం. కరుణానిధి, సోమనాథ్ చటర్జీ, మృణాల్‌సేన్.. కన్నుమూత.
- మహిళల్ని శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు.
- నానాపటేకర్‌పై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఫిర్యాదుతో ఇండియాకూ విస్తరించిన మీటూ మహిళా ఉద్యమం.
- ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ 24 ఏళ్ల అవని చతుర్వేది.
(చదవండి: చైతన్య భారతి: చరిత్రకు సమకాలీనుడు! మామిడిపూడి వెంకటరంగయ్య)
Comments
Please login to add a commentAdd a comment