అహ్మదాబాద్: ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో గిరిజన కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారన్న అనుమానంతో నర్మదా జిల్లాలో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. భిలిస్తాన్ టైగర్ సేన(బీటీఎస్) జిల్లా అధ్యక్షుడు మహేశ్ గాగుభాయ్, ఉపాధ్యక్షుడు మహేంద్ర వాసవతో పాటు మరో రెండు సంఘాలకు చెందిన సభ్యులు అరెస్టైన వారిలో ఉన్నారు.
గాంధీయవాది చునీ వైద్య కుమార్తెలు నీతా విరోధి, మోదితా విరోధిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సోషల్ మీడియా ద్వారా ఆందోళనలకు జనాన్ని పోగు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) చెందిన ఝగదియా ఎమ్మెల్యే చోటూభాయ్ వాసవ కుమారుడు మహేశ్ వాసవ 2017లో బీటీఎస్‌ను స్థాపించారు. అత్యంత ఎత్తైన పటేట్ విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునివ్వడంతో తాపీ జిల్లాలోని య్యరా ప్రాంతానికి చెందిన 10 మంది శిరోముండనం చేయించుకుని మద్దతు తెలిపారు.
విగ్రహంతో ఒరిగేదేంటి?
‘సర్దార్ పటేల్‌కు మేము వ్యతిరేకం కాదు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం. గుజరాత్‌లో గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాసింది. రాజ్యాంగంలోని 244(1) ఆర్టికల్‌ను ప్రభుత్వం అమలు చేయాలన్న మా ప్రధాన డిమాండ్. దీన్ని అమలు చేసిన తర్వాత పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోండి. ‘ఐక్యతా విగ్రహం’తో గిరిజనులకు ఏవిధంగా మేలు జరుగుతుంది? గిరిజనుల సమస్యలపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. గిరిజనుల హక్కుల సాధన కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం. ఫలితంగా ఎంతో మంది గిరిజనుల మద్దతు పొందగలిగామ’ని చోటూభాయ్ వాసవ పేర్కొన్నారు. తన కుమారుడు మహేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనాజీ గమిత్, ఆనంద్ చౌదరితో కలిసి సూరత్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
మోదీకి బహిరంగ లేఖ
కాగా, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఆవిష్కరణను వ్యతిరేకిస్తూ నర్మదా సరోవర్ డ్యామ్‌కు సమీపంలోని 22 గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుతో సహజ వనరులను నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై 22 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు సంతకాలు చేశారు. స్థానిక గిరిజన నాయకులు కూడా ఐక్యతా విగ్రహావిష్కరణను వ్యతిరేకించారు. ‘ఈ రోజును బ్లాక్ డే పాటించాలని గిరిజనులు నిర్ణయించారు. ప్రతి గ్రామంలోని గిరిజనులు ఈరోజు నిరహారదీక్ష చేయనున్నారు. మా ఆందోళన ఒక్కరోజుతో ఆగదు. మరిన్ని రోజుల పాటు పోరాటం కొనసాగిస్తాం. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీటి సమస్యలపై కూడా ఆందోళన కొసాగుతుంద’ని చోటూభాయ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment