స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ: వారికి వచ్చిన నష్టం ఏమిటి? | Why Adivasis protesting Against Statue OF Unity | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 3:03 PM | Last Updated on Thu, Nov 1 2018 5:09 PM

Why Adivasis protesting Against Statue OF Unity - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలు వ్యాపించి దిగంతాలకు తాకేలా అత్యంత ఎల్తైన అద్భుత కళాఖండంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వాతంత్య్ర సమర యోధుడు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తే ఆ పరిసరాల్లోని దాదాపు 20 గ్రామాల ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? విగ్రహావిష్కరణ సభను అడ్డుకునేందుకు సిద్ధమైన వారిలో దాదాపు మూడు వందల యాభై మంది ఆదివాసీ రైతులను ముందుగానే అరెస్ట్‌ చేసి పోలీసులు ఎందుకు 20 గంటల పాటు నిర్బంధించారు ? వారికి వచ్చిన నష్టం ఏమిటీ?

వారికి బుధవారం నాడు విగ్రహావిష్కరణ రోజే తక్షణం ముంచుకొచ్చిన నష్టం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సరోవర్‌ డ్యామ్‌ గేట్లు తెరవడం. సర్దార్‌ సరోవర్‌ పటేల్‌ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో సర్మదా నది నీళ్లతో నిండుగా కనిపించడం కోసం సరోవర్‌ డ్యామ్‌ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ కారణంగా సమీపంలో మూడు గ్రామాల్లోని దాదాపు 30 మంది రైతుల పంటలు పూర్తిగా నీటిలో మునిగి పోయాయని పిపాలయ పోలీసు స్టేషన్‌ నిర్బంధం నుంచి బుధవారం సాయంత్రం విడుదలైన రైతు నాయకుడు లఖాన్‌ ముసాఫిర్‌ తెలిపారు. ఆయనతోపాటు 24 మంది ఆదివాసీలను పిపాలయ పోలీసు స్టేషన్‌లో 20 గంటలపాటు నిర్బంధించారు. నర్మదా జిల్లా అంతటా దాదాపు 350 మంది ఆదివాసీ రైతులను పోలీసులు నిర్బంధించారని పటేల్‌ విగ్రహానికి 8 కిలోమీటర్ల దూరంలోని గురుదేశ్వర్‌ గ్రామానికి చెందిన లఖాన్‌ తెలిపారు. పటేల్‌ విగ్రహం ఉన్న పరిసర ప్రాంతాలను టూరిస్ట్‌ జోన్‌గా అభివద్ధి చేయడం వల్ల ఇల్లు వాకిలినే కాకుండా పచ్చటి పంట పొలాలను కూడా కోల్పోతున్నామని ఆదివాసీ రైతులు ఆందోళన చేస్తున్నారు.

నీటిలో మునుగుతున్న 13 గ్రామాలు
సర్దార్‌ పటేల్‌ విగ్రహం పరిసరాల్లో టూరిజం అభివద్ధిలో భాగంగా ‘వాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’ను, ‘టెంట్‌ సిటీ’ నిర్మాణ పనులు చేపట్టారు. టెంట్‌ సిటీలో ప్రతి రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ అతిథి గహంతోపాటు పర్యాటక శాఖల గెస్ట్‌హౌజ్‌లు, ప్రైవేటు, ప్రభుత్వ రిస్టారెంట్లు నిర్మిస్తారు. బోటు షికార్ల కోసం ఓ సరస్సు నిర్మాణం పనులు కూడా చేపడుతున్నారు. ఈ పనుల సాకారం కోసం పటేల్‌ విగ్రహం ఉన్న కెవాడియాకు సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో, గురుదేశ్వర్‌ గ్రామానికి సమీపంలో ఓ చిన్న డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత సరోవర్‌ డ్యామ్‌ నుంచి నీళ్లను విడుదల చేసి చిన్న డ్యామ్‌ వరకు నీళ్లు నిండుగా ఉండేలా చేస్తారు. దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిన్న డ్యామ్‌ నిర్మాణం వల్ల ఇప్పటికే ఆరు గ్రామాలు నీటిలో మునిగిపోగా, డ్యామ్‌ నిర్మాణం పూర్తయి, నీటిని విడుదల చేస్తే మరో ఏడు గ్రామాలు నీటిలో మునిగిపోతాయి. పటేల్‌ ప్రాజెక్ట్‌ పూర్తయితే ప్రత్యక్షంగా దాదాపు 20 గ్రామాలు నష్టపోతుంటే పరోక్షంగా పరిసరాల్లో 70 ఆదివాసీ గ్రామాలు నష్టపోతున్నాయి. అందుకనే ఆ గ్రామాల ప్రజలంతా బుధవారం నాడు అన్నం వండుకోకుండా పస్తులుండి నిరసన తెలిపారు.
 

22 గ్రామాల సర్పంచ్‌ల లేఖ
భారత దేశ కీర్తి ప్రతిష్టల కోసం తరతరాలుగా ఇక్కడే జీవిస్తున్న తమ కడుపులు కొట్టవద్దంటూ ఇటీవల 22 గ్రామాల ప్రజలు తమ సర్పంచ్‌ల సంతకాలతో ప్రధాని పేరిట ఓ బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘మా పరిసర గ్రామాల ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని పలు గ్రామాలకు పాఠశాల, వైద్యశాలల వసతులే కాకుండా కనీసం మంచి నీటి సౌకర్యం కూడా లేదు. ప్రజలు కష్టపడి సంపాదించి పన్నులు కడితే ఆ సొమ్మును మీరు ఇలా వధా చేయడం భావ్యం కాదు. పటేల్‌ ప్రాజెక్టు పూర్తయితే మా వ్యవసాయానికే కాదు, మాకు మంచినీటి కూడా సరోవర్‌ నది నుంచి ఒక్క చుక్కా దొరకదు. సరోవర్‌ కెనాల్‌ నెట్‌వర్క్‌ను (20 వేల కిలోమీటర్ల కెనాల్‌ను పూర్తి చేయాల్సి ఉంది) పూర్తి చేయడానికి నిధులు లేవనే సర్కార్, పటేల్‌ ప్రాజెక్టుకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి ? అందుకనే మిమ్మల్ని 31వ తేదీన అతిథిగా ఆహ్వానించడం లేదు. అయినా మీరొస్తే మీ కార్యక్రమాన్ని మేం బహిష్కరిస్తాం’ అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

నష్టపరిహారం ఊసేలేదు!
పటేల్‌ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న ప్రజలకు నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని గుజరాత్‌ ప్రభుత్వం ఇంకా తేల్చడం లేదు. ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ నష్టపరిహారం కోసం ఆర్జీలు పెట్టుకుంటే పరిశీలిస్తాంగానీ, ప్రాజెక్టు వద్దూ నష్టపరిహారం వద్దంటే తాము మాత్రం ఏం చేయగలమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 1990 దశకంలో సరోవర్‌ డ్యామ్‌ను నిర్మించడం వల్ల గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని 42 వేల కుటుంబాలు, దాదాపు రెండు లక్షల మంది నిర్వాసితులకు ఎక్కడో దూరాన పట్టాలిచ్చారని, వ్యవసాయం చేసుకునే భూమికి, ఇళ్ల స్థలాలకు మధ్య కొన్ని కిలోమీటర్ల దూరం ఉందని ఆదివాసీ రైతులు తెలిపారు. దేశాన్నే కుదిపేసేలా ఆందోళన చేస్తే వారికి దక్కింది ఆ మాత్రం నష్టపరిహారమని, ఇక తమకు ఏపాటి పరిహారం దొరకుతుందని వారు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement