![PM Narendra Modi renames 3 islands of Andaman Nicobar - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/31/MODI-7.jpg.webp?itok=nwqsyQSe)
ఆదివారం ఉదయం పోర్ట్‌బ్లెయర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా సానుకూల(పాజిటివ్) విషయాలను వైరల్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతికూల అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభమని వ్యాఖ్యానించారు. ప్రజల ఉమ్మడి కృషి కారణంగా భారత్ 2018లో పలు అద్భుతాలను సాధించిందన్నారు. ఆశయం బలంగా ఉంటే ఎదురయ్యే అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతాయని తెలిపారు. 2019లో కూడా భారత అభివృద్ధి, పురోగతి ఇలాగే సాగాలని ..సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. 2018లో చివరి మాసాంతపు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ పలు అంశాలపై ముచ్చటించారు.
ఏడాదిలో అనేక విజయాలు...
‘మనమంతా కలిసి సానుకూల అంశాలను వైరల్ చేద్దాం. ఇలా చేయడం వల్ల చాలామంది ప్రజలు సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు, మహనీయుల గురించి తెలుసుకుంటారు. ప్రతికూల వార్తలు, అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభం. కానీ చుట్టూ సానుకూల విషయాలను వ్యాప్తిచేసే ప్రయత్నం నిజంగానే జరుగుతోంది. చాలా వెబ్‌సైట్లు ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నాయి. ఇలాంటి వార్తల లింక్స్‌ను విస్తృతంగా పంచుకోండి. తద్వారా సానుకూలతను వైరల్ చేయవచ్చు’ అని మోదీ సూచించారు. 2018లో ఎన్డీయే ప్రభుత్వ సాధించిన కీలక విజయాలపై మాట్లాడుతూ..‘ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమైన ఆయుష్మాన్ భారత్‌ను ఆవిష్కరించాం.
దేశంలోని ప్రతీపల్లెకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రజల దృఢ సంకల్పంతో పరిశుభ్రత అన్నది 95 శాతం దాటింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి త్రివర్ణ పతాకాన్ని ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోటపై ఎగురవేస్తున్నారు. కానీ స్వతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశచరిత్రలో తొలిసారి అక్టోబర్ 21న ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించాం. తొలి భారత హోంమంత్రి సర్దార్ పటేల్ గౌరవార్థం ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఏర్పాటుచేశాం. ఈ ఏడాదే భూ, జల, వాయు మార్గాల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది’ అని మోదీ వెల్లడించారు.
యువతకు గొప్ప అవకాశం...
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాపై స్పందిస్తూ..‘ఈ కార్యక్రమం సందర్భంగా భక్తితో పాటు పరిశుభ్రత కూడా పరిఢవిల్లుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి యువతకు కుంభమేళా గొప్ప అవకాశం’ అని పేర్కొన్నారు. అలాగే ఈసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరవుతారని తెలిపారు. దక్షిణాఫ్రికాలో∙గాంధీ జాతి వివక్షపై మొదటిసారి పోరాడి, మహాత్ముడిగా మారారని గుర్తుచేశారు.
అండమాన్ ప్రజలు దేశానికే ఆదర్శం
అండమాన్ దీవుల్లో మోదీ పర్యటన
కార్ నికోబార్ / పోర్ట్‌బ్లెయర్ : 2004లో విరుచుకుపడ్డ సునామీ దుష్ప్రభావం నుంచి అండమాన్ ప్రజలు శరవేగంగా కోలుకున్నారని ప్రధాని కితాబిచ్చారు. అండమాన్ దీవుల్లో ఉంటున్న ప్రజల సంక్షేమానికి, భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కార్ నిరోబార్ దీవుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రశంసించిన మోదీ, ఈ విషయంలో అండమాన్ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సాధారణంగా ప్రజలు ప్రధాన భూభాగాన్ని, ద్వీపాలను వేరుగా చూస్తారనీ, తనకు మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల కంటే పోర్ట్‌బ్లెయరే ప్రధాన భూభాగమని అన్నారు. స్థానికుల డిమాండ్ మేరకు సముద్రపు అలల తాకిడికి నేల కోతకు గురికాకుండా రూ.50 కోట్లతో గోడను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్ నికోబార్‌లోని బీజేఆర్ స్టేడియంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. కొబ్బరి పొట్టు కనీస మద్దతు ధరను రూ.7 వేల నుంచి రూ.9 వేలకు పెంచామన్నారు. ఈ సందర్భంగా సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.
సావార్కర్ గదిలో ధ్యానం..
పర్యటనలో భాగంగా పోర్ట్‌బ్లెయర్‌లోని సెల్యూలర్ జైలును సందర్శించిన ప్రధాని.. బ్రిటిష్ పాలనలో స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన వీరులకు నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న హిందుత్వవాది వీర సావార్కర్‌ను బంధించిన గదిలో నేలపై ధ్యాన ముద్రలో కూర్చున్నారు. ఆతర్వాత జైలు సెంట్రల్ టవర్ వద్ద గోడపై చెక్కిన అమరుల పేర్లను పరిశీలించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి వెనుదిరిగారు. కాలాపానీగా పిలిచే ఈ జైలును 1896–1906లో నిర్మించారు. ఈ పర్యటనలో భాగంగా చెన్నై–పోర్ట్‌బ్లెయర్ మధ్య ఫైబర్ కేబుల్, 7 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు, సోలార్ మోడల్ గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. అలాగే అండమాన్ దీవుల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రితో పాటు 50 మెగావాట్ల ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్‌ను స్థాపిస్తామని తెలిపారు.
మూడు ద్వీపాలకు కొత్త పేర్లు..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 వసంతాలు పూర్తయిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి రోస్ ఐలాండ్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా, నీల్ ఐలాండ్‌ను షహీద్(అమరుల) ద్వీపంగా, హేవ్‌లాక్ ఐలాండ్‌ను స్వరాజ్య ద్వీపంగా నామకరణం చేస్తున్నట్లు పోర్ట్‌బ్లెయర్‌లోని నేతాజీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్మారక స్టాంపును, రూ.75 నాణేన్ని ఆయన ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ..‘స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి ప్రస్తావించాల్సి వస్తే నేతాజీ పేరును గర్వంగా ప్రకటిస్తాం. ఆయన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి తొలి ప్రధాని. ఆయన అండమాన్ గడ్డపై భారత్ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేశారు. అండమాన్ నుంచి దేశం స్ఫూర్తి పొందుతోంది. 1943లో ఇదే రోజున అండమాన్, నికోబార్ దీవులను షహీద్, స్వరాజ్ దీవులుగా గుర్తించాలని నేతాజీ సూచించారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా నేతాజీకి గౌరవంగా మొబైల్ ఫోన్ల ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయాలని కోరడంతో స్టేడియం ఒక్కసారిగా వెలుగుజిలుగులతో కాంతులీనింది. అనంతరం మెరీనా పార్క్‌లో 150 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను మోదీ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment