ఆ విగ్రహానికి ఖర్చు.. రూ. 2979 కోట్లు!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ఖర్చు దాదాపు 2979 కోట్ల రూపాయలుగా తేలింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని మోడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహ ఏర్పాటు కాంట్రాక్టును లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)కి అప్పగించారు. భారత తొలి హోం మంత్రి అయిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని 182 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విగ్రహం వివరాలను గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది పటేల్ ఓ కార్యక్రమంలో వివరించారు.
నాలుగేళ్ల వ్యవధిలో రూ. 2979 కోట్ల వ్యయంతో విగ్రహ నిర్మాణం మొత్తం పూర్తవుతుందని, దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఎల్అండ్టీ కంపెనీకి దీని కాంట్రాక్టును ఇస్తున్నామని ఆమె చెప్పారు. ప్రధాన విగ్రహం ఏర్పాటుకు రూ. 1347 కోట్లు, ఎగ్జిబిషన్ హాలు, కన్వెన్షన్ సెంటర్లకు రూ. 235 కోట్లు, మెమోరియల్ నుంచి గట్టుమీదకు వచ్చేందుకు వంతెన కోసం రూ. 83 కోట్లు, నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు దాని నిర్వహణకు రూ. 657 కోట్లు ఖర్చవుతాయని సీఎం పటేల్ వివరించారు. న్యూయార్క్ నగరంలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 93 మీటర్లు కాగా, దానికి రెట్టింపు పరిమాణంలో.. అంటే 182 మీటర్ల ఎత్తున పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.