sardar patel statue
-
ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ సేవలు..!
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్‌పోర్టు లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కారు నిర్ణయానికి వచ్చింది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)–ఉడాన్ పథకంలో కొత్త ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని యోచిస్తోంది. సీ ప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖ కోరాయి. అలాగే నదుల్లో కాంక్రీట్ జెట్టీల(వాటర్ ఏరోడ్రోమ్) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు నౌకాయాన శాఖ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ సీ ప్లేన్ సేవలకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్లో నర్మదా నదిలో, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏఐ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ కేవలం 40 నిమిషాల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్‌లో ప్రయాణించారు. -
ఏకం చేసిన ఘనత పటేల్‌దే
న్యూఢిల్లీ: దేశవిభజన తర్వాత వందలాది స్వతంత్ర రాజ్యాలుగా మిగిలిపోయిన భారత్‌ను ఏకం చేసిన ఘనత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. అప్పటి హోంమంత్రిగా ఉన్న పటేల్ సరైన సమయంలో ప్రతిస్పందించడంతో జమ్మూకశ్మీర్‌ను విదేశీ దురాక్రమణ నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్టోబర్ మాసాంతపు ’మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రసంగించిన మోదీ.. ఈ నెల 31 సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ‘రన్ ఫర్ యూనిటీ’ మారథాన్‌లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు మనం భారత్‌ను ఒక దేశంగా చూస్తున్నామంటే సర్దార్ పటేల్ తెలివితేటలు, వ్యూహాత్మక నిర్ణయాలే కారణం. అక్టోబర్ 31న çపటేల్ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడమే ఆయనకు మనం ఇవ్వబోయే నిజమైన నివాళి. గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన సర్దార్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనది. ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎత్తయిన రెండో విగ్రహంగా ఉన్న న్యూయార్క్‌లోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’కి రెండింతల ఎత్తులో పటేల్ విగ్రహం ఉండనుంది. భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి కూడా అక్టోబర్ 31నే. ఈ సందర్భంగా ఇందిరాజీకి నివాళులు అర్పిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. అభివృద్ధితోనే నిజమైన శాంతి.. ‘యుద్ధం లేకపోవడం నిజమైన శాంతి కాదు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తులకు అందడమే నిజమైన శాంతికి సూచిక. ప్రపంచశాంతి గురించి ఎక్కడైనా ప్రస్తావించాల్సి వస్తే అందులో భారత్ పాత్రను సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధంలో మనకు ఎలాటి సంబంధం లేకపోయినా భారతీయ సైనికులు కదనరంగంలో దూకారు. ఈ యుద్ధంలో కోటి మంది సైనికులతో పాటు మరో కోటి మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రపంచానికి శాంతి ప్రాముఖ్యత అర్థమయింది. గత వందేళ్లలో శాంతి అన్న పదానికి నిర్వచనమే మారిపోయింది. ఇప్పుడు శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ఇందుకోసం ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం తదితర సమస్యల పరిష్కారినికి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. క్రీడారంగంలో రాణించాలంటే స్పిరిట్ (స్ఫూర్తి), స్ట్రెంత్ (శక్తి), స్కిల్ (నైపుణ్యం), స్టామినా (సామర్థ్యం) ఉండటం కీలకమన్నారు. సైనిక చర్యలో ఆలస్యం ఉండొద్దన్న సర్దార్ ‘కశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాక్ బలగాలను తరిమికొట్టేందుకు భారత సైన్యాన్ని పంపడంలో జరుగుతున్న జాప్యంపై సర్దార్ పటేల్ అప్పట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత సైనిక చర్యలో ఎలాంటి ఆలస్యం ఉండరాదని అప్పటి ఫీల్డ్ మార్షల్ మానెక్ షాకు పటేల్ సూచించారు. ఆతర్వాత వెంటనే రంగంలోకి దిగిన భారత బలగాలు కశ్మీర్‌ను పాక్ దురాక్రమణ నుంచి కాపాడాయి. భారత్‌కు ఏకం చేయగల, దేశ విభజన గాయాలను మాన్పగల శక్తిఉన్న వ్యక్తిగా పటేల్‌ను 1947, జనవరిలో ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ కీర్తించింది. స్వదేశీ సంస్థా నాలను దేశంలో విలీనం చేసే సామర్థ్యం కేవలం పటేల్‌కే ఉందని మహాత్మా గాంధీ సైతం గుర్తించారు. హైదరాబాద్, జునాగఢ్, ట్రావెన్కోర్.. ఒకటితర్వాత మరొకటి ఇలా 562 స్వదేశీ సంస్థానాలను పటేల్ భారత్‌లో విలీనం చేశారు. ఇందులో పూర్తి ఘనత పటేల్‌కే దక్కుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
ఆ విగ్రహానికి ఖర్చు.. రూ. 2979 కోట్లు!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ఖర్చు దాదాపు 2979 కోట్ల రూపాయలుగా తేలింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని మోడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహ ఏర్పాటు కాంట్రాక్టును లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)కి అప్పగించారు. భారత తొలి హోం మంత్రి అయిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని 182 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విగ్రహం వివరాలను గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది పటేల్ ఓ కార్యక్రమంలో వివరించారు. నాలుగేళ్ల వ్యవధిలో రూ. 2979 కోట్ల వ్యయంతో విగ్రహ నిర్మాణం మొత్తం పూర్తవుతుందని, దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఎల్అండ్టీ కంపెనీకి దీని కాంట్రాక్టును ఇస్తున్నామని ఆమె చెప్పారు. ప్రధాన విగ్రహం ఏర్పాటుకు రూ. 1347 కోట్లు, ఎగ్జిబిషన్ హాలు, కన్వెన్షన్ సెంటర్లకు రూ. 235 కోట్లు, మెమోరియల్ నుంచి గట్టుమీదకు వచ్చేందుకు వంతెన కోసం రూ. 83 కోట్లు, నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు దాని నిర్వహణకు రూ. 657 కోట్లు ఖర్చవుతాయని సీఎం పటేల్ వివరించారు. న్యూయార్క్ నగరంలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 93 మీటర్లు కాగా, దానికి రెట్టింపు పరిమాణంలో.. అంటే 182 మీటర్ల ఎత్తున పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.