ఇస్లామాబాద్ : ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు, కశ్మీర్ అంశంపై చర్చించుకుందామని ప్రధాని నరేంద్రమోదీకి, పాకిస్తాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. కిర్జిస్తాన్ రాజధాని బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా నరేంద్రమోదీ, ఇమ్రాన్ ఖాన్ మధ్య సమావేశం ఉండబోదని భారత్ స్పష్టం చేసిన మరుసటి రోజే పాక్ ఈ లేఖ రాయడం గమనార్హం. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారని, ఇరు దేశాల సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం కేవలం చర్చలతోనే సాధ్యమని లేఖలో పేర్కొన్నారని పాక్ మీడియా తెలిపింది. ఇరు దేశాల సత్సంబంధాలు మెరుగుపడితే పేదరికాన్ని అధిగమించవచ్చని, ప్రాంతీయ అభివృద్ధికి కృషి చేయవచ్చని, కశ్మీర్ సమస్య పరిష్కారం కూడా చర్చలతోనే సాధ్యమని ఇమ్రాన్ ఖాన్ అభిలాషించినట్లు పేర్కొంది. అయితే ఈ లేఖపై ఇప్పటి వరకు భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇక మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికైన అనంతరం కలిసి పనిచేద్దాం, చర్చించుకుందామని పాక్ కోరడం ఇది రెండోసారి. 2016లో పఠాన్‌కోట్ వైమానిక శిబిరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, దాయాది పాకిస్థాన్‌తో అధికారిక చర్చలను నిలిపివేసింది. ఉగ్రవాదం, చర్చలు కలిసిసాగలేవంటూ అప్పటి నుంచి దాయాదితో ద్వైపాక్షిక చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ నెల 13, 14 తేదీల్లో బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అటు పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా ఈ సదస్సుకు వస్తుండటంతో వీరిద్దరు భేటీ కావొచ్చునని ఊహాగానాలు వినిపించాయి. కానీ భారత్ మాత్రం పాక్ ప్రధాని ఎలాంటి సమావేశం లేదని స్పష్టం చేసింది. తనకు తెలిసినంతవరకు బిషక్‌లో ఎస్‌సీవో సదస్సు సందర్భంగా మోదీ, ఇమ్రాన్ ఖాన్ భేటీకి ప్లాన్ చేయలేదని, వారిద్దరి మధ్య సమావేశం ఉండే అవకాశం లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం మోదీ ఘనవిజయంపై ఫోన్‌ద్వారా అభినందనలు తెలిపారని, మోదీ సైతం ఆయనకు ధన్యవాదాలు చెప్పారన్నారు.
ఫిబ్రవర్ 14న పుల్వామా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులుకాగా.. ప్రతీకారచర్యగా భారత వాయుసేన పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరపడం.. పాక్ వాయుసేన భారత్‌పై దాడికి ప్రయత్నించడంతో యుద్దం ఖాయామనే పరిస్థితి ఏర్పడింది. కానీ పాక్ భూభాగంలో చిక్కుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ క్షేమంగా తిరిగిరావడంతో ఈ ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్ పడింది. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం భారత్‌లో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరాలని భావించారు. బీజేపీ అయితే కశ్మీర్ అంశం కొలిక్కి వస్తుందని, కాంగ్రెస్ అయితే ఏ నిర్ణయం తీసుకోకుండా సంశయిస్తుందని ఎన్నికల ముందు ఏప్రిల్‌లో అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment