భోపాల్: చైనాతో ఘర్షణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడేటట్టు లేదు. తాజాగా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలడని చాణక్య చెప్పారు. ఒక విదేశీ మహిళకు జన్మించిన వ్యక్తి ఎప్పటికి దేశభక్తుడు కాలేడు’ అంటూ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీకు రెండు దేశాల పౌరసత్వం ఉంటే, మీలో దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి’ అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నైతికత, నీతి, దేశభక్తి లేదని ఆరోపించారు. ‘ఒకసారి కాంగ్రెస్ పార్టీ లోపలికి చూడాలి. వారికి ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీకి నీతి, ధైర్యం, దేశభక్తి లేవు’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విరుచుకుపడడ్డారు.
అయితే ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ విదేశీ మూలాలు గురించి బీజేపీ తరచుగా విమర్శలు చేయడం సాధారణమే. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎమ్‌పీ పదవికి అవమానానన్ని తెచ్చిపెట్టారని ఆరోపించార. ఉగ్రవాద కేసులో చిక్కుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గురించి.. రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజ్ఞా మతిసస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఆమెకు వెంటనే తగిన చికిత్స అందించాలని ధనోపియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment