న్యూఢిల్లీ: భారత సరిహద్దు విషయంలో చైనాతో వివాదం కొనసాగుతున్న వేళ ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత భూభాగంలోకి డ్రాగన్ దేశం(చైనా) చొచ్చుకువస్తుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నారని విమర్శించారు. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి ప్రాంతాలకు డ్రాగన్ ఇలా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి. ఈ క్రమంలోనే మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు.
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్లాగొన్న ఖర్గే.. మోదీని అబద్దాల సర్దార్‌గా విమర్శించారు. ప్రధాని దృష్టి అంతా సంక్షేమంపై కాకుండా గాంధీ కుటుంభాన్ని దూషించడంపేనే ఉందని దుయ్యబట్టారు. మోదీ దేశం కోసం ఆలోచించడం పక్కకు పెట్టి గాంధీ కుటుంబంపై దుర్భాషలాడటం పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.
'నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, నేను భయపడను' అని మోదీ అంటున్నారు. మీకు భయం లేకుంటే మన ప్రాంతంలోని భూభాగాన్నంతా చైనాకు ఎందుకు విడిచిపెట్టారు? వారు భారత్‌లోకి చొచ్చుకువస్తున్నారు. మీరేమో నిద్రపోతున్నారు. నిద్రమాత్రలు వేసుకున్నారా? దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేసి తన వెంట తీసుకెళ్లాలని అనుకొంటున్నారన్నారు.
1989 నుంచి గాంధీ కుటుంబంల ఎవరూ ప్రధానమంత్రి, మంత్రి పదవిని చేపట్టలేదని, అయినప్పటికీ ప్రధానమంత్రి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబ సభ్యులు ఈ దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారన్నారు. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తారు. ఎన్నికల సమయంలో దేశమంతా తిరుగుతారు గానీ, అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌కు మాత్రం ఇంతవరకు వెళ్లలేదు’ అని మండిపడ్డారు.
కాగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చాలా ఏళ్లుగా చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. చైనా తీరును గతంలోనే భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్ పేరు, ఈ ప్రాంతం దక్షిణ టిబెట్‌లో భాగమని బీజింగ్ తెలిపింది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉంది. అయితే పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్‌లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశ అంతర్భాగమేనని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment