న్యూఢిల్లీ/బీజింగ్: ఓ వైపు చర్చల్లో పాల్గొంటూనే మరోవైపు సరిహద్దులో బలగాలను మెహరిస్తూ చైనా కుయుక్తులు ప్రదర్శిస్తోంది. భారత భూభాగాన్ని తమ ప్రాంతంగా ప్రకటించుకుంటూ భారత్‌ను రెచ్చగొట్టింది. గల్వాన్‌లో సైనికులను దొంగదెబ్బ తీసి దారుణానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో మన దేశంలో చైనాపై ఎంత విముఖత ఏర్పడిందో, పర్యవసానంగా భారత్.. చైనాపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా గల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమర వీరులయ్యారు. ఇనుప చువ్వలు బిగించి ఉన్న రాడ్లతో చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసి కొట్టి చంపారు. అయితే వారితో ఘర్షణ సందర్భంగా భారత సైనికులు ఆయుధాలు వాడలేదన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్)
ఐదుగురు జవాన్ల మృతదేహాలపై గాయాల గుర్తులు
నిరాయుధులైన సైనికులను చైనా ఆర్మీ చుట్టుముట్టి దాడికి తెగబడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమరుల కుటుంబాలకు జారీ చేసిన డెత్ సర్టిఫికెట్లలో విస్తుగొలిపే నిజాలు వెలుగు చూశాయి. ముగ్గురు సైనికుల మెడ దగ్గర లోతైన గాయాలు కావడంతో రక్తనాళాలు పూర్తిగా చిట్లిపోయి మరణించారని తేలింది. మరో ఇద్దరు పదునైన, మొనదేలి ఉన్న వస్తువులతో దాడి చేయడం వల్ల మరణించినట్లు తెలిసింది. వీరందరీ తల, మెడపై గాయాల గుర్తులు ఉన్నట్లు మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక చీకట్లో సైనికులు రక్షిత ప్రాంతానికి వెళ్లలేకపోయారని ఇదే అదనుగా భావించిన డ్రాగన్ ఆర్మీ వారిపై కర్కశంగా దాడికి దిగిందని కొందరు ఆర్మీ సైనికులు తెలిపారు. ఈ క్రమంలో కొందరిని గల్వాన్ నదిలోకి తోసేయగా గడ్డకట్టిన మృతదేహాలను తరువాతి రోజు ఉదయం బయటకు తీసినట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. (చైనా ముప్పును ఎదుర్కొందాం)
సైనికులను లోయలోకి తోసేసి..
చైనా ఇచ్చిన మాట ప్రకారం తన బలగాలను వెనక్కు తీసుకెళ్లిందా, నిర్మాణాలను కూల్చివేసిందా లేదా అనేది ధ్రువీకరించడానికి జూన్ 15న అర్ధరాత్రి గల్వాన్‌లో బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ కుమార్ పెట్రోల్ పాయింట్ 14 దగ్గరకు వెళ్లి చూడగా వివాదం మొదలైంది. చైనా సైనికులు మాటకు బదులుగా చేతికి దొరికిన ఆయుధాలతో (ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను) భారత సైనికులపై మెరుపువేగంతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ వెన్నుపోటు పొడిచిన చైనా ఆర్మీపై విజృంభించింది. ఈ ఘర్షణలో 40 మంది చైనా సైనికులు మరణించినట్టు వార్తలు వచ్చినా డ్రాగన్ ధ్రువీకరించలేదు. (లద్దాఖ్‌కు క్షిపణి వ్యవస్థ)
Comments
Please login to add a commentAdd a comment