న్యూఢిల్లీ: జూన్ 15 రాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం చైనా సైన్యం 10మంది భారతీయ సైనికులను అపహరించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరిలో 4గురు అధికారులు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఘర్షణలు జరిగిన తరువాత రోజు ఉదయమే భారత్ మన అధీనంలో ఉన్న డజనుకు పైగా చైనా సైనికులను వారికి అప్పగించింది. కానీ డ్రాగన్ మాత్రం మన సైనికులను తిరిగి పంపించడంలో ఆలస్యం చేస్తూనే ఉంది. గాల్వన్ వ్యాలీలో హింసాత్మక ఘర్షణల్లో గాయపడి ఎల్‌ఏసీకి అవతలి వైపు ఉన్న 50 మంది భారతీయ సైనికులను తిరిగి పంపించడానికి చైనాకు 24 గంటలు పట్టింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!)
ఈ క్రమంలో వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా... మరి కొందరు తీవ్రంగా గాయపడ్డట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే ఘర్షణలు జరిగిన మరుసటి రోజే చైనా, భారత సైనికులందరిని తిరిగి అప్పగించలేదని.. నలుగురు అధికారులతో సహా పది మంది భారత సైనికులను విడిచిపెట్టలేదని తర్వాత తెలిసింది. వారిని క్షేమంగా తీసుకురావడం కోసం తరువాత మూడు రోజుల పాటు భారత్-చైనా మధ్య తీవ్రమైన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మన సైనికులు వారి వద్ద ఉన్నారనే విషయాన్ని చైనా ఖండించలేదు. పైగా వారంతా సురక్షితంగా ఉన్నారని చైనా హామీ ఇచ్చింది.
అయితే వారిని వెంటనే విడుదల చేయకుండా.. భారతీయుల సహానానికి పరీక్ష పెట్టింది. ఇది చైనా మైండ్ గేమ్‌కు నిదర్శనం అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. జూన్ 16, 17,18 తేదీలలో ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున జనరల్-స్థాయి చర్చలు జరిగాయి. వీటిలో ప్రధానంగా భారతీయ సైనికుల విడుదల గురించి చర్చించారు. చివరకు జూన్ 18న చైనా.. 10 మంది భారత సైనికులను విడుదల చేసింది. అయితే ఈ 10 మందిని పీఎల్‌ఏ కస్టడీలోనే ఉంచారా లేదా అనే దాని గురించి రెండు దేశాలు స్పష్టత ఇవ్వలేదు. (వారు పోరాడటానికి జన్మించారు..)
లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలోని పెట్రోల్ పాయింట్ 14(పీపీ14) వద్ద జూన్ 15 రాత్రి నెత్తుటి ఘర్షణ ప్రారంభమైంది. చైనా ఏర్పాటు చేసిన టెంట్‌పై భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దళాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఇనుప చువ్వలు కల రాడ్లు, రాళ్లతో చైనా సైనికులు మన దళాల మీద దాడి చేశాయి. 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన భారత దళాలు ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటించాయి. కాని దురదృష్టవశాత్తు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బి సంతోష్ బాబు ఈ దాడిలో మరణించారు. ఈ ఘర్షణలో మొత్తం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా వైపు అనేక మరణాలు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. కానీ చైనా మాత్రం చనిపోయిన సైనికుల సమాచారాన్ని వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment