న్యూఢిల్లీ: ఇండియా-చైనా దళలా మధ్య జూన్ 15న గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. వీరందరికి మన ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది. దేశం యావత్తు మన జవాన్ల త్యాగాన్ని కొనియాడింది. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ సమాధి రాయి ఫోటో ఇంటర్నెట్‌లో వైరలవుతుంది. చైనా సైనికులు మరణించారు అనే దానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజనులు. చైనీస్ ఇంటర్నెట్ వీబో అకౌంట్‌లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్షమయ్యింది. క్షణాల వ్యవధిలోనే ఆ ఫోటో మన దేశంలోని చాలా ట్విట్టర్ యూజర్ల అకౌంట్లలో ప్రత్యక్షమయ్యింది. (చదవండి: మారని చైనా తీరు.. మళ్లీ కొత్త నిర్మాణాలు!)
ఈ సమాధి రాయి చైనా సైనికుడు చెన్ జియాంగ్‌రాంగ్‌కు చెందినదిగా తెలుస్తోంది. సమాధి రాయిపై మాండరిన్ భాషలో ‘69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచి’ అని రాసి ఉంది. అంతేకాక ‘చెన్ జియాంగ్రో సమాధి. జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుంది’ అని తెలుపుతుంది. 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్‌లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో చూపిస్తోంది. మరణించిన సైనికుడు 19 సంవత్సరాల వయస్సు వాడని.. అతడు 2001 డిసెంబర్‌లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. అయితే దీనిపై ఇంకా చైనా అధికార యంత్రాంగం స్పందించలేదు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య పలు దఫాల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశం సరిహద్దులో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment