(ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో ఈనెల 15న హింసాత్మక ఘటన చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లద్దాఖ్ రీజియన్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు దేశాలు సైనికులను తరలించడంతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. సైనిక వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఎల్‌ఏసీ వెంట భారత్-చైనా భారీగా జవాన్లు తరలిస్తున్నాయి. ఎల్‌ఏసీని అతిక్రమించకుండా ఎవరి భూభాగాల్లో వారు సైనిక కార్యక్రమాలను నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గల్వాన్ లోయ సెక్టార్‌లోని పెట్రోల్ పాయింట్ 14 వద్ద ప్యాంగాంగ్ సరస్సుకు సమీపంలో ఇరు వైపులా సైన్యం భారీగా మోహరించింది. కాగా 15 నాటి హింసాత్మక ఘటన అనంతరం మరోసారి ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోనప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు సరిహద్దు ప్రతిష్టంభనపై మరోసారి ఇరుదేశాలకు చెందిన కమాండ్ స్థాయి అధికారుల చర్చలు సోమవారం ప్రారంభం అయ్యాయి. (దుస్సాహసానికి దిగితే ఆయుధాలు వాడొచ్చు)
కాగా సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి సైనికులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే సరైన గుణపాఠం చెప్పే స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చింది. దానిలో భాగంగా తప్పనిసరి సందర్భాల్లో ఆయుధాలను సైతం ఉపయోగించే వెసులుబాటును కల్పించింది. సరిహద్దుల్లో చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు ఆయుధాలు వాడకం తప్పనిసరని కేంద్ర రక్షణ శాఖ అధికారులు, ఆర్మీ వర్గాలు కేంద్రానికి నివేధించిన సందర్భంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. భారత్ నిర్ణయం నేపథ్యంలో చైనా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీపీఏ)కు అదే రీతిలో స్వేచ్ఛను ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య 1996, 2005ల్లో కుదిరిన ఒప్పందాలకు ముందు పరిస్థితి మరోసారి పునరావృత్తం కానుంది. కాగా ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే.
Comments
Please login to add a commentAdd a comment