సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువుతున్న చైనాను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. భారత భూభాగాల దురాక్రమణకు దూకుడుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ ఎత్తుగడలను తిప్పికొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా చైనాతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న 73 రోడ్డు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రం సోమవారం సమీక్ష జరిపింది. వాటిలో 32 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా లద్దాక్ రీజియన్‌లో పొరుగుదేశంతో ఎక్కువగా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ముగించాలని పేర్కొంది. రోడ్డు నిర్మాణల ద్వారా చైనా దూకుడును అడ్డుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో బలగాలను సరిహద్దుకు చేర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుందని సైనిక వర్గాలు కేంద్రానికి నివేదించాయి. (నోరువిప్పిన చైనా.. కమాండర్ మృతి)
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌లతో కేంద్ర హోం శాఖ ఈ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో సరిహద్దు నిర్వహణ కార్యదర్శి సంజీవ్ కుమార్‌తో పాటు పలువురు ముఖ్య సైనికాధికారులు పాల్గొన్నారు. గల్వాన్ లోయలో చైనా ఆర్మీ అనుసరిస్తున్న దుందుడుకు చర్యకు సరైన రీతిలో సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాగే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గస్తీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు ఇకనుంచి ‘పూర్తి స్వేచ్ఛ’ ఇవ్వాలన్న ఆర్మీ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇకపై సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లు అత్యవసర పరిస్థితుల్లో సరైన గుణపాఠం చెప్పేందుకు ఆయుధానుల వాడుకునేలా స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. (గల్వాన్‌లో బయటపడ్డ చైనా కుట్రలు)
కాగా ఇరు దేశాల నడుమ ఏర్పడిన సరిహద్దు ప్రతిష్టంభనపై కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఓవైపు ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే సిక్కిం సరిహద్దుల్లో నుంచి భారత్‌లోకి చొరబడేందుకు చైనా బలగాలు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైన్యం కదలికలు, భారత సైన్య సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment