భారత–చైనా సంబంధాల్లో అయిదు అంకె ప్రాధాన్యం బాగానే వున్నట్టుంది. ఇరుదేశాల మధ్యా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద దాదాపు అయిదు నెలలుగా అలుముకున్న ఉద్రిక్తతలను ఉపశ మింపజేయడానికి గురువారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాల సందర్భంగా మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి సమావేశమయ్యారు. రెండు గంటలకుపైగా చర్చలు జరిగాక ఇరు దేశాల మధ్యా అయిదు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని మంత్రులు ప్రకటించారు. రెండు దేశాల మధ్యా 1954లో ఈ మాదిరే అయిదు అంశాలతో కూడిన పంచశీల ఒప్పందం కుదిరింది. అనంతరకాలంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎనిమిదేళ్ల తర్వాత ఇరు దేశాలమధ్యా యుద్ధం సంభవించింది. ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కారాదని అందరూ కోరుకుంటున్న వేళ గత శుక్రవారం మాస్కోలో రెండు దేశాల రక్షణ మంత్రులు భేటీ కావడం, అది జరిగిన అయిదురోజుల తర్వాత ఇప్పుడు విదేశాంగ మంత్రులమధ్య చర్చలు చోటుచేసుకోవడం హర్షించదగ్గది. మరోపక్క రెండు దేశాల మధ్యా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు సాగుతూనేవున్నాయి. మధ్యలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులూ సంభాషించుకున్నారు.
అయితే ప్రస్తుతం కుదిరిందంటున్న ఏకాభిప్రాయం సమస్యల్ని స్థూలంగా స్పృశించిందే తప్ప నిర్దిష్టమైన అంశాల జోలికి పోలేదు. రెండు దేశాలూ చర్చల్ని కొనసాగించాలని, సరిహద్దుల్లో ఇరుపక్షాలూ వెనక్కి తగ్గాలని, గతంలో ఇరు దేశాలూ కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించాలని, విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలని, విశ్వాస పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలూ అంగీకారానికొచ్చాయి. ప్రస్తుతం ఎల్‌ఏసీ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జూన్‌లో చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేయడం, దాన్ని అడ్డుకోవాలని చూసిన మన సైనికులపై వారు ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేసి 21మంది జవాన్ల ప్రాణాలు తీయడం అత్యంత విషాదకరమైన ఘటన. ఆ తర్వాత రెండు దేశాల మధ్యా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు అడపా దడపా జరుగుతూనే వున్నాయి. అయినా కూడా ఆ ఉద్రిక్తతలు అలాగేవున్నాయి. మూడు రోజులక్రితం తొలిసారి అక్కడ కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి. 45 ఏళ్లలో ఎల్‌ఏసీ వద్ద కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పరిస్థితి ఇంత విషమించాక చైనా తీరుపై మన దేశం గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయాలి. చర్చల సందర్భంగా జైశంకర్ ఆ పనే చేశారని అంటున్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దురాక్రమణ పోకడలను వాంగ్ యి దృష్టికి తీసు కొచ్చి, దానిపై నిరసన వ్యక్తం చేయడంతోపాటు ఎల్‌ఏసీ వద్ద శాంతి సామరస్యాలను పునరుద్ధ రించడానికి కృషి చేయడం తక్షణ కర్తవ్యమని చెప్పారు. మన జవాన్లు గత నెలాఖరున సరిహద్దులు అతిక్రమించారన్న చైనా వాదనను ఆయన తిరస్కరించారని చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అసాధారణ రీతిలో వున్నాయి. రెండు వైపులా సైన్యం మోహరింపు ఎక్కువైంది. పోటాపోటీగా యుద్ధ సామగ్రి అక్కడికి తరలుతోంది. కనుక ఎల్‌ఏసీ వద్ద యధాపూర్వ స్థితి నెలకొల్పడం తక్షణావసరం. ఏ వైపున ఎవరు ఆవేశపడినా అది చివరకు యుద్ధానికే దారితీస్తుంది. ఇప్పుడు ప్యాంగాంగ్ సో వద్ద మన సైనికుల అధీనంలోకొచ్చిన శిఖరాగ్రాల్లో కొన్నిటినైనా చేజిక్కించు కునేందుకు చైనా సైనికులు వ్యూహరచన చేస్తున్నారని అక్కడి నుంచి వెలువడుతున్న కథనాలు చెబుతున్నాయి. యుద్ధంలో ఎప్పుడూ ఎత్తయిన ప్రాంతాల్లో వున్న సైనికులకు అనుకూలమైన పరిస్థితులుంటాయని యుద్ధ రంగ నిపుణులు అంటారు. కనుకనే ఆ శిఖరాగ్రాలపై చైనా సైన్యం కన్నేసింది.
ఇరు దేశాలమధ్యా చాన్నాళ్ల తర్వాత తొలిసారి జనతాపార్టీ హయాంలో సామరస్యత ఏర్పడింది. మైత్రికి బీజాలు పడ్డాయి. అప్పటి విదేశాంగ మంత్రి వాజపేయి చైనాను సందర్శించారు. వివా దాస్పద అంశాలపై పరస్పరం చర్చించుకుందామని, వాణిజ్య రంగంలో సహకరించుకుంటూ ఎదుగుదామని చైనా చేసిన ప్రతిపాదనకు మన దేశం అంగీకరించింది. మన దేశంతో వాణిజ్యం మొదలయ్యాక ఆ రంగంలో అత్యధికంగా లాభపడింది చైనాయే. మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు అయ్యే ఎగుమతుల్లో చైనా వాటా 5 శాతం కాగా, మనకొచ్చే దిగుమతుల్లో వారి వాటా 14 శాతం. ఇలా మనవల్ల అనేకవిధాల లాభపడుతూ పాకిస్తాన్‌తో మనకు పేచీ వచ్చిన ప్రతిసారీ అంతర్జాతీయ వేదికలపై చైనా ఆ దేశాన్నే సమర్థిస్తూ వచ్చింది. ఎల్‌ఏసీ పొడవునా తరచుగా ఉల్లం ఘనలు సరేసరి. ఒకపక్క ఇరు దేశాల అధినేతలూ పరస్పరం పర్యటనలు జరుపుకోవడం, చర్చలు సాగించడం వంటివి కొనసాగిస్తున్నా ఇది రివాజే. నిరుడు జమ్మూ–కశ్మీర్ ప్రతిపత్తిని మన దేశం మార్చాక చైనాలో మరింత గుబులు బయలుదేరింది. పర్యవసానంగా ఏప్రిల్ నెలాఖరు నుంచి ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలున్నాయి. పరిస్థితి ఇంతవరకూ వచ్చింది కనుక మన దేశం యధాపూర్వ స్థితిపై గట్టిగా పట్టుబట్టాలి. వాణిజ్యం, సరిహద్దు వివాదం దేని దారి దానిదే అనే పాత విధానం చెల్లదని, ఎవరి హద్దుల్లో వారు వున్నప్పుడే సామరస్య సంబంధాలు ఏర్పడతాయని చెప్పాలి. దేశాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు అధికారిక, అనధికారిక స్థాయిల్లో పరస్పరం చర్చలు జరుగుతాయి. అయితే రెండు పక్షాలూ చిత్తశుద్ధితో వున్నప్పుడే మంచి ఫలితాలనిస్తాయి. ఇప్పుడు ఉద్రిక్తతల ఉపశమననానికి మంత్రుల స్థాయి భేటీలు జరగడం మంచి పరిణామమే. వచ్చే నెల్లో ఎస్‌సీఓ శిఖరాగ్ర చర్చల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చర్చలు జరిగే అవకాశం వుందంటున్నారు. అందులో సరిహద్దు వివాదంపై ఒక అవగాహన కుదరడం ఉభయ దేశాలకూ మంచిది. అందుకు అనువైన వాతావరణం ఏర్పర్చవలసింది చైనాయే.
చైనా చిత్తశుద్ధి ప్రదర్శించాలి
Published Sat, Sep 12 2020 1:53 AM | Last Updated on Sat, Sep 12 2020 1:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment